Home జాతీయ వార్తలు గూబ గుయ్‌మంటుంది

గూబ గుయ్‌మంటుంది

Causes and Effects of Noise Pollution

దేశంలోని నగరాలో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. నిబంధనలున్నా కచ్చితంగా ఎవరిమట్టుకు వారు పాటించకపోవడమే దీనికి కారణం. పిల్లలకు పరీక్షలు జరుగుతున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. పాశ్చాత్య దేశాల్లో మితిమీరిన శబ్దాన్ని అనుమతించరు. ఎక్కడైనా ఎవరైనా ఎక్కువ శబ్దం చేస్తే ఫిర్యాదులు వెళ్లిన క్షణంలోనే పోలీస్‌లు అక్కడకు వచ్చి నివారిస్తారు. నిబంధనల ప్రకారం పాఠశాలలు, న్యాయ స్థానాలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు తదితర ప్రశాంత ప్రదేశాలకు 100 మీటర్ల దూరంలో హారన్లు మోగించరాదు. వీటిని సున్నిత ప్రదేశాలుగా గుర్తించినా మనదేశంలో శబ్దాలు చేయడం పరిపాటి అవుతోంది. పెళ్లిళ్లు, వేడుకలు, ఊరేగింపులు, వంటివి భారీగా, బ్రహ్మాండం బద్దలయ్యే శబ్దాలతో నిర్వహించడం గొప్పగా భావిస్తుంటారు. బాజా బజాంత్రీలు ఎంత గట్టిగా మోగిస్తే అంత గొప్ప వేడుకగా పెళ్లి పెద్దలు భావిస్తుంటారు. రాజకీయ నాయకులు ఊరేగింపులు డప్పులతో, మేళతాలలతో, డాన్సులతో సాగుతుంటాయి. ఎవరైనా ఏ ఎన్నికల్లోనయినా విజయం సాధిస్తే కొన్ని మైళ్ల పొడవునా ఊరేగింపులు కదులుతుంటాయి.

ఒక పక్క ట్రాఫిక్ స్థంబిస్తున్నా మరో పక్క చెవులు చిల్లులు పడేలా బాణా సంచా మందుగుండు పేలుస్తుంటారు. డప్పులు బ్యాండు మేళాలతో నృత్యాలతో రక్తి కట్టిస్తుంటారు. రోడ్లపైనే బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు. న్యూయార్క్ వంటి అధిక జనాభా ఉండే నగరాల్లో ఊరేగింపులకు, ర్యాలీలకు అనుమతి ఉండదు. మైకులు, లౌడ్ స్పీకర్లు వంటివి నిషేధిస్తుంటారు. ఆడిటోరియాల్లోనే సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలి తప్ప బయట ఏమాత్రం పనికి రాదు. ప్రార్థన మందిరాల్లోనయితే చాలా తక్కువ ధ్వని ఉండాలి. శబ్ద కాలుష్య నివారణ చట్టాలను ఇంగ్లాండు, ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ప్రజల్లో అక్కడ ఎక్కువగా అవగాహన కల్పిస్తుంటారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ విడిచిపెట్టరు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి 10వేల మంది జనాభాకు పోలీస్‌ల సంఖ్య అధికంగానే ఉంటుంది. ధ్వని కాలుష్య నమోదు పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆ సమాచారం ఎప్పటి కప్పుడు చేరుకునే ఏర్పాట్లు ఉన్నాయి. అందుకనే పోలీస్‌లు ఆగమేఘాలపై చేరుకుని శబ్దాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. భూటాన్, మాల్దీవుల వంటి దేశాల్లో పర్యావరణ చట్టాలు కఠినంగా అమలవుతుంటాయి.

అమెరికాలో హారన్లు మోగించడం నిషేధం
మూడుసార్లు నిబంధన ఉల్లంఘిస్తే డ్రయివింగ్ లైసెన్సు రద్దు చేస్తారని పిసిబి అధికారి ఒకరు తెలిపారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శబ్దాలను నియంత్రించడం చాలా అవసరం. ఒకరికి కష్టం కలిగించే పనులను, ఇబ్బంది పెట్టే చర్యలను చేయరాదని ఇస్లాం చెబుతోందని ముస్లిం పెద్ద ఒకరు పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. రోజూ అయిదు సార్లు మైకులో దేవుడి ఆహ్వానాన్ని చెప్పేటప్పుడు శబ్దకాలుష్యం లేకుండా చూడవలసిన బాధ్యత తమదేనని ఆయన చెప్పారు. విద్యార్ధుల పరీక్ష సమయాల్లో రాత్రి ఏడు గంటలకే ఆలయాలను మూసేసే చర్యలు తీసుకోవాలని హిందూ ఆలయ ధర్మ కర్త ఒకరు పేర్కొన్నారు. ఏడాది పాటు కష్టపడి చదివిన వారు పరీక్షలు రాసినప్పుడు శబ్దకాలుష్యం వారికి ఆటంకం కారాదని ఆయన అభిప్రాయ పడ్డారు. పిల్లల ఏకాగ్రతకు భంగం కలగకుండా చర్చిలో మైకు సాయంత్రానికే బందు చేయిస్తామని చర్చి నిర్వాకులు ఒకరు పేర్కొన్నారు. వాస్తవానికి 20 డెసిబుల్ వరకు శబ్దాన్ని వాడేందుకు అనుమతి ఉన్నా పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ శబ్దాన్ని 5 డెసిబుల్స్‌కు పరిమితం చేస్తున్నామని మరో చర్చి నిర్వాహకులు పేర్కొన్నారు.

ప్రార్ధన సమయంలో మైకుల శబ్దం బయటకు వెళ్లనీయబోమని ఆయన అన్నారు. ఈ విధంగా ఎవరికి వారు శబ్దాన్ని నివారించడానికి ముందుకు వస్తేనే శబ్ద కాలుష్యం నియంత్రణ లోకి వస్తుంది. శబ్దకాలుష్యంతో పిల్లల చదువలకు భంగం వాటిల్లుతుండడం వాస్తవం. కాలనీల్లో, వీధుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా దేవాలయాలు,మసీదులు, చర్చిలు, ఫంక్షన్ హాళ్లు పెద్ద పెద్ద శబ్దాలతో మైకులు వాడుకుంటారు. పైగా ఇది పెళ్లిళ్ల పుణ్య కార్యాల సీజన్, అట్టహాసాలకు, భారీ శబ్దాల సందడికి లోటుండదు. కానీ దీని వల్ల ఎందరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఆలోచించాలి. ఆస్పత్రుల్లో గుండె వ్యాధి రోగులు ఉంటారు. ఆస్తమా రోగులు, ప్రశాంతత కావలిసిన వృద్ధరోగులు ఉంటారు. వారందరికి మితిమీరిన శబ్దం ప్రాణాంతకమవుతుంది. స్కూళ్లలో పిల్లలు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మితిమీరిన శబ్దాన్ని నిషేధించ గలిగితేనే సత్ఫలితాలు కనిపిస్తాయి. ఇది పిల్లలకు పరీక్ష కాదు. పెద్దలందరికీ పరీక్షే.

భక్తి, ఆధ్యాత్మిక, మత ధార్మిక సంస్థలు తమ కార్య క్రమాలను రాత్రంతా లేదా తెల్లవారు జాము నుంచి సాగించడం పరిపాటి.చుట్టు పక్కల నివసించే వారికి ఇది ఇబ్బందై దీనిపై పోలీసుల వరకు ఫిర్యాదులు వెళ్తుంటాయి. కొన్ని కొన్ని ప్రదేశాలను ఉదాహరణగా తీసుకుంటే నగరంలోని విద్యానగర్ టిఆర్‌టి కాలనీ చుట్టూ 10 మసీదులు ఆలయాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే శబ్ధాలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని, అక్కడి వారు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ఆయా కార్యక్రమాల నిర్వాహకులు ఇది తమ హక్కుగా గట్టిగా వాదిస్తుంటారు. పూజలు లేదా ప్రార్ధనలు ఏవైనా చేయడం సంప్రదాయంగా చెబుతుంటారు. అయితే శబ్దాలు బయటికి రాకుండా మీరు ఏకార్యక్రమాలు చేసినా ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా! అని కాలనీ వాసులు ప్రశ్నిస్తుంటారు. అయితే మత సంస్థలు ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించవని ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్పారు.

ఈ సందర్భంగా ముస్లిం పార్ధనలు స్పీకర్లలో కొంత దూరం వరకు వినిపిస్తుంటారు. భగవంతుడ్ని ప్రార్ధించడానికి పిలవడమే ఈ ప్రార్ధనలో పరమార్ధం. ఇది లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రసారం కాకుంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదీ కూడా ఈ పిలుపు మూడో నాలుగు నిముషాల కన్నా ఎక్కువ సమయం పట్టదని మక్కా మసీదు పెద్ద చెప్పారు. శబ్ధ స్ధాయిలు ఎంత వరకు ఉండాలో నిబంధనలు ఉన్నాయి. కానీ తరుచుగా వీటిని ఖాతరు చేయరు. పొల్యూషన్ కంట్రోలు బోర్డు వివరాల ప్రకారం మే నెలలో నగరంలో 11 కేంద్రాల నుంచి అందిన వివరాలను పరిశీలిస్తే మే నెలలో 10 నుంచి 15 శాతం శబ్ద స్థాయిలు పెరిగాయి. ఇవి వాహనాల శబ్దంతో సమానం. విచక్షణా రహితంగా లౌడ్ స్పీకర్లు వినిపించడం, పరిశ్రమల శబ్దాలతో సమానం. అయితే పోలీసులు తమ అలవాటు ప్రకారం ఏవో చెబుతుంటారు. 50 డెసిబుల్స్ కు మించి శబ్దం పెరిగినా, రాత్రివరకు కొనసాగించినా దానికి బాద్రులయిన వారు సిటీపోలీస్ చట్టం ప్రకారం శిక్షార్హులని వారు హెచ్చరిస్తున్నారు.

నగరంలో శబ్ద స్థాయిలు
నగరంలో అబిడ్స్, పారడైజ్ సెంటర్లు రాత్రి పగలు ఎక్కువ శబ్ధ స్థాయిలు గల ప్రాంతాలుగా రికార్డు కెక్కాయి. గచ్చిబౌలి కొంత వరకు వాటి కన్నా మెరుగనే చెప్పాలి. జనవరి నెలలో జూబిలీ హిల్స్, అబిడ్స్ ప్రాంతాల్లో శబ్ధ స్థాయిలు ఎన్ని డెసిబుల్స్ ఉన్నాయో పరిశీలిస్తే పగటిపూట జూబిలీ హిల్స్ ప్రాంతంలో జనవరి 17న 60 డెసిబుల్స్ వరకు శబ్దస్థాయిలు పెరిగాయి. రాత్రిపూట 54 నుంచి 57 వరకు డెసిబుల్ స్ధాయిలో శబ్దాలు పెరిగాయి. అబిడ్స్ ప్రాంతంలో పగటిపూట శబ్దాలు కొనసాగాయి. అబిడ్స్ ప్రాంతంలో పగటి పూట 69 నుంచి 70 వరకు డెసిబుల్ స్థాయిలు కొనసాగాయి. పారడైజు జంక్షన్లలో పగటిపూట 72 నుంచి 74, రాత్రిపూట 72 నుంచి 73 వరకు డెసిబుల్స్ కొనసాగాయి. జీడిమెట్ల ప్రాంతంలో జనవరి 17న 65 నుంచి 75 , రాత్రి 58 నుంచి 61 వరకు డెసిబుల్స్ స్థాయి కొనసాగింది.

గచ్చిబౌలిలో పగటిపూట 50 నుంచి 60 , రాత్రి 40 నుంచి 52 వరకు డిసెబుల్ స్థాయిలు కొనసాగాయి. ఇదే విధంగా ఫంక్షన్ హాళ్లు- రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము వరకు సంగీత కార్య క్రమాలు సాగుతుంటాయి. గుడి మల్కా పూర్ (మెహదీ పట్నం) ప్రాంతంలో నాలుగైదు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. అక్కడి వారు ఈ పద్ధతిపై పోలీసులకు ఫిర్యాధు చేసినా ఫలితం కనిపించడం లేదు. పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటారని పోలీసులు సరిబుచ్చుతున్నారు. పాత బోయిన పల్లిలో ఇదే పరిస్థితి. అక్కడొక ఫంక్షన్ హాలులో డిజెను రాత్రి బాగా పొద్దుపోయే వరకు ప్లే చేస్తుంటారు. దీనికేదో శాశ్వత పరిష్కారం ఉండాలని ఆ ప్రాంతం వారు కోరుతున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు ,మత స్థావరాలు, నిశ్శబ్ద జోన్ పరిధిలోకి వస్తాయి. నిబంధనల ప్రకారం ఈ నిశ్శబ్ద జోన్‌కు 100 మీటర్ల పరిధిలో మ్యూజిక్ అత్యంత కనీస స్థాయిలలో ఉండాలి కానీ సరిగ్గా పాటించక పరిసరాల ప్రజలు శబ్దకాలుష్యాలతో బాధ పడవలసి వస్తోంది.

-మన తెలంగాణ పరిశోధన విభాగం