Home దునియా క్రమశిక్షణ లక్ష్యాన్ని చేరుస్తుంది

క్రమశిక్షణ లక్ష్యాన్ని చేరుస్తుంది

ఆత్మీయత, అనురాగాలు ఆ కుటుంబం ఆస్తి. నిరంతర శ్రమ, పట్టుదల ప్రతి ఒక్కరిలో అగుపిస్తుంటుంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రమశిక్షణతో
అడుగులువేసి ప్రయోజకులైన నేపథ్యం ఆ కుటుంబానికి ఉంది.. అదే సి.బి.ఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుటుంబ కథ. తెలంగాణ ఏటూరి నాగారం నుంచి భారతదేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన సిబిఐ డైరెక్టర్ పదవి నిర్వహించారు. ఆయన్ను దునియా పలకరించింది…

చదువు మనిషి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతుంది. చిన్నప్పటినుంచి బాగా చదువుకోవాలనే తపన నాలో ఉండేది. అమ్మ వెంకట చల్మాయమ్మ, నాన్న గోపాల రావు చదువులను ప్రోత్సహించారు. ఆనాడు సౌకర్యాలు లేని ఏటూరినాగారంలో నా బాల్యం గడిచింది. ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాలనే కోరికతో మద్రాసు విశ్వవిద్యాలయంలో చేరి డిగ్రీ, పిజి పూర్తి చేశాను. హైదరాబాద్‌లో ఉర్దూ మీడియం ఉండటంతో మద్రాసుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత హిస్టరీ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది . అయితే స్నేహితులంతా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. వారితో పాటు సరదాగా నేను అప్లయ్ చేశాను. ఈసారి పరీక్షఎలా ఉంటుందో చూసి మరోసారి సివిల్స్ సాధించాలనేది నా ఆలోచన. అందుకే సివిల్స్ కోసం ప్రత్యేకంగా ఏ పుస్తకం చదవలేదు. అయితే లెక్చరర్‌గా విధులు నిర్వహించడంతో సబ్జెక్టుపై అవగాహన ఉండేది. అలాగే సివిల్స్ రాశాను, ఐపిఎస్ వచ్చింది. మరోసారి రాసి ఐఏఎస్ సాధించాలనే ఆలోచన ఉన్నా ఐపిఎస్ కూడా గొప్పగానే అనిపించడంతో ఆ ప్రయత్నం మానుకుని మౌంట్ అబు లో శిక్షణ పొందాను. 1959 బ్యాచ్ ట్రైనింగ్‌లో నేను అనేక విషయాలను తెలుసుకోగలిగాను.

Vijaya-Ramarao

తొలి పోస్టింగ్ ఎక్కడవచ్చింది?

దశలవారీగా శిక్షణ అనంతరం ఏసిపి చిత్తూరు, ఏఎస్‌పి సూర్యపేట, ఎస్‌పి రైల్వే, ఆ తర్వాత ఐపిఎస్ అడ్వాన్స్ కోర్సు చేశాను. ఎస్‌పి నెల్లూరు, ఎస్‌పి కృష్ణ, లా అండ్ ఆర్డర్ డిసిపి హైదరాబాద్, స్పెషల్ బ్రాంచ్ ఇంటలిజెన్సీ ఎస్‌పి, ఐజి ఇంటలిజెన్సీ, తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా తదితర బాధ్యతలు చేపట్టాను. పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో నిత్యం మతకల్లోలాలతో ప్రజలు తల్లడిల్లే వారు. గణేష్ నిమజ్జనం అప్పుడు మతకల్లోలాలు చెలరేగాయి. ప్రధానంగా రెండు వర్గాలమధ్య కల్లోలిత వాతావరణం నెలకొని ఉండేది. అయితే పెద్దవాళ్ళుగా చెలామణి అవుతూ ప్రజలను రెచ్చగొట్టిన నాయకులందరిని అరెస్టు చేయడంతో పాటు యాంటీ గుండా స్కాడ్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రౌడీలను అరెస్టు చేయడంతో పాటు కాల్పులకు అనుమతి ఇచ్చిన రోజులు ఉన్నాయి.

విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే మీరు కుటుంబానికి సమయాన్ని ఎలాకేటాయించారు?

విధులు వేరు, కుటుంబ వ్యవస్థ వేరు దేనికి అదే ముఖ్యం. రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుం ది. విధుల నిర్వహణలో ఎక్కడా రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో విధులకే ప్రాధాన్యత ఇచ్చాను. సహధర్మచారిణి వసుమతి కుటుంబ బాధ్యతల్లో రాజీ పడలేదు, నేను బిజీగా ఉన్న సమయాల్లో నాకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా తీర్చిదిద్దారు. నా అభివృద్ధి వెనుక నా భార్య ఉందని నేను గొప్పగా చెపుతాను. అయితే చదువులకు ప్రాధాన్యత ఇవ్వడంతో కొడుకులు ప్రసాదరావు, శ్రీనివాస్ కళ్యాణ రావు ఐఐటి లో మంచిఫలితాలు సాధించి అమెరికాలో స్థిరపడ్డారు.

హైదరాబాద్‌లో పోలీసు కాల్పులు, కర్ఫూ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?

మతకల్లోలాల్లో నిర్దిష్టంగా కొంతమంది ప్రణాళిక ప్రకారం హత్యలకు పాల్పడరు. హత్యచేయాలని ఏ ముఠా పిలుపు ఇవ్వదు. కానీ ఉపన్యాసాలతో రెచ్చగొడుతుంటారు. ఉన్మాదాన్ని శరీరంలోకి ఇన్‌జెక్ట్ చేస్తూ ప్రసంగిస్తారు. వినేవారు ఏదోచేయాలనే ఉద్రేకంతో రాళ్ళురువ్వడం, ప్రత్యర్థులపై దాడులు చేయడం, మారణాయుధాలతో సంచరించడం, దారి వెంటవెళ్ళే అమాయకులను హత్య లు చేస్తుంటారు. హంతకులను విచారిస్తే మా వర్గం పై దాడి చేసినప్పుడు మేము ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి ప్రతి దాడులు ఎందుకు చేయకూడదనే సమాధానమే వస్తుంది. కానీ కిరాయి హంతకులమనీ, ఎవరో చెప్పారని అంగీకరించరు.

పోలీసు కాల్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి ఉత్తర్వులిస్తారు?

తప్పనిసరి పరిస్థితుల్లో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు కాల్పులకు అనుమతులు ఇస్తాం. అయితే కిందివైపే కాల్పులు జరపాలని చెపుతుంటాం. కాళ్ళపైనే కాల్పులు జరిగేటట్లు శిక్షణ పొందిన పోలీసులు ఫైర్ ఓపెన్ చేస్తారు. అనుకోని విధంగా ఆందోళనకారులు వ్యవహరించినప్పుడు పరిస్థితి మారుతుంటుంది. ఒకసారి చార్మినార్ దగ్గర ఒక వర్గానికి చెందిన వారు రాళ్ళ వర్షం
కురిపించారు. పోలీసులనే లక్షంగా చేసుకుని బండరాళ్ళు విసిరారు. ఆలాంటి పరిస్థితుల్లో చట్టం మేరకు ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చింది.

రాజకీయాల్లో ప్రవేశించాలని ఆలోచన ఎలా వచ్చింది?

ఆనాటి పరిస్థితులు వేరు, రాజకీయాల్లో ఉన్నత విలవలను పెంపొందించాలని నాటి అధికారపార్టీ రాజకీయాల్లోకి ఆహ్వానించింది. అయితే సమాజానికి అధికారిగా సేవలందించాను, రాజకీయనాయకుడిగా సేవలందించాలనే ఆలోచనతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. మంచి మెజారిటీతో ఖైరతాబాద్ నుంచి గెలవడం మంత్రిగా బాధ్యతలు చేపట్టటం జరిగింది. రవాణా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకు రావడంతో పాటు నియోజవర్గ అభివృద్ధికోసం కృషిచేశాను.

టిఆర్‌ఎస్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్న మీరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా?

ఉన్నతాధికారిగా, ప్రజాప్రతినిధిగా సమాజానికి నా వంతు సేవలనందించాను. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదు. నా రాజకీయ వారసత్వా న్ని మా అమ్మాయి అన్నపూర్ణ నెరవేరుస్తుంది. ఇప్పటికే టిఆర్‌ఎస్ పార్టీ క్రీయాశీల రాజకీయాల్లో అన్నపూర్ణ ఉంది. పార్టీ అధిష్టానం ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం ఇస్తే అమ్మాయి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. నా రాజకీయ వారసురాలిగా అమ్మాయి అన్నపూర్ణ ప్రజలముందుకు వస్తుంది.

సిబిఐ డైరెక్టర్‌గా మీ అనుభవాలు

సిబిఐ పరిశోధనలు రహస్యంగా ఉంటాయి. వాటిని వెల్లడించ కూడదు, అయితే అనేక పరిశోధనలు నా పదవీ కాలంలో జరిగాయి. ప్రధానంగా ముంబయిబాంబుపేలుళ్ళు, హర్షత్ మెహతాకేసు, ఆర్థిక కుంభకోణాలు, శాంతి భద్రతలకు సంబంధించినఅంశాలపై దర్యాప్తు చేశాం.

వి.భూమేశ్వర్, మనతెలంగాణ ప్రతినిధి