Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సిమెంటు ధర పెంచిన సిసిఐ

CCI Cement Packing Size 50 Kg Rs272 bag
వికారాబాద్ : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్వల్పంగా సిమెంట్ ధరలు పెంచింది. అదనంగా 10 రూపాయలు పెంచి బస్తా ధరను రూ.272కు చేర్చింది. రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు తర్వాత సిమెంటు ఉత్పత్తులు గణనీయంగా పడిపోయినా ఇటీవల స్వల్పంగా కోలుకుంది. అయినప్పటికి సంస్థకు ఆర్థిక ఇబ్బందులు నెలకొనడంతో సిమెంటు బస్తాపై రూ.10 అదనంగా పెంచడం గమనార్హం. ఇంకా సిసిఐ లాభాల బాట పట్టకపోవడం ప్రభుత్వానికి రుచించడం లేదు. అప్పటికి రూ.50 కోట్ల నష్టాలను అధిగమించడం లేదని తెలుస్తున్నది. గతంలో చవిచూసిన నష్టాలను పక్కనబెడితే పదేళ్లుగా ఫర్వాలేదనిపిస్తున్నది. నవంబరు నుంచి మే వరకు సిమెంటు అమ్మకాలు జోరుగా సాగాయి. వచ్చిన రాబడి ద్వారా ఉద్యోగుల వేతనాలు, ముడిసరకు కొనుగోలుకే సరిపోయిందని సంస్థ యాజమాన్య ప్రతినిధుల ద్వారా తెలిసింది. 1987లో తాండూరు మండలం కరణ్‌కోట గ్రామంలో సిసిఐ కర్మాగారం నెలకొల్పారు. ఈ ప్రాంతంలో విస్తరించిన నాపరాతి గనుల వల్ల సిమెంటు ఉత్పత్తులకు అనుకూలంగా భావించి పరిశ్రమ ఏర్పాటు చేశారు. యేటా 10 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నా ఆరంభం నుంచి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా చవిచూస్తున్నది.

ఈ ప్రాంతంలో విస్తరించిన సున్నపురాయి నిక్షేపాలను సద్వినియోగం చేసుకుంటూ సంస్థను ముందుకు తీసుకువెళుతున్న ఘనత కార్మికులదేనని చెప్పక తప్పదు. మూసివేత దిశగా నడిచిన సంస్థను కష్టపడి పని చేసి మూడేళ్ల పాటు లాభాలు సాధించారు. అయితే, పెరిగిన ముడిసరకు ధరలు, ఉద్యోగుల వేతనాలు, యంత్రాల కొనుగోళ్లు తదితర వాటి ఖర్చు వల్ల అనుకున్నంత లాభాలు సమకూర్చుకోవడం లేదు. కొత్త నియామకాలు చేపట్టడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. సంస్థ నెలకొల్పిన సమయంలో 500 మంది పని చేసేవారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య సగం కంటే తక్కువగా ఉందని చెబుతున్నారు. తాండూరు పరిసరాలలోనే సిసిఐకు ధీటుగా ఇండియన్ సిమెంట్స్, కలుబుర్గి సిమెంట్స్ (వికాట్ సాగర్), చిట్టినాడ్, పెన్నా సంస్థలూ ఉత్పత్తులు చేపడుతున్నాయి. సిసిఐ కంటే బస్తాపై రూ.10 తక్కువగా విక్రయిస్తున్నాయి. ఈ నాలుగు ఫ్యాక్టరీలు భారీ స్థాయిలో ఉత్పత్తులు చేపడుతున్నాయి. ఈ పరిశ్రమలన్నీ కలిపి రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం సీజన్ లేనందున ప్రైవేటు సంస్థల్లో కూడా ఉత్పత్తులు మందగించాయి.

Comments

comments