Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సిసిఎంబి వ్యవస్థాపక డైరెక్టర్ భార్గవ కన్నుమూత

Bhargava

హైదరాబాద్ : సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) వ్యవస్థాపక డైరెక్టర్, ప్రొఫెసర్ పి.ఎం. భార్గవ (89) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థీవ దేహం ఉంచారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన భార్గవ 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్‌డి పట్టా పొందారు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2015లో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తూ ఆయన 2015లో పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేశారు.1977లో స్థాపించిన సిసిఎంబి ద్వారా జీవశాస్త్ర మూలాంశాల్లో పరిశోధనల ద్వారా సమాజానికి మేలు చేకూర్చేందుకు ఆయన కృషి చేశారు. భారతీయ శాస్త్రీయ విజ్ఞానాన్ని దేశ నిర్మాణం కోసం ఉపయోగించేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. అణు జీవశాస్త్రవేత్తగా, మేధావిగా ఆయన ప్రపంచ ప్రసిద్ధులు. శాస్త్ర విషయాలతో పాటు కళ, సాంస్కృతిక విషయాల పట్ల ఆయన ఆసక్తిని కనబరిచేవారు. సామాజిక అంశాల పట్ల ఆసక్తి కలిగిన ఆయన భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ సమాజంపై శాస్త్ర విజ్ఞానం చూపే ప్రభావంపై ఎక్కువగా తన దృష్టిని సారించారు. ఆయన అసాధారణ ప్రతిభ, అంకితభావం పలువురిని ప్రభావితులను చేశాయి. భవిష్యత్ తరాలను కూడా శాస్త్రవిజ్ఞానం ప్రజల కోసమే అన్న స్ఫూర్తిని నింపనున్నాయి. ఆయన మృతి పట్ల సిసిఎంబి శాస్త్రవేత్తలు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఆయన కుమార్తె వినీతకు, కుమారుడు మోహిత్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

comments