Home తాజా వార్తలు ఉగ్రవాదుల దాడిని ఖండించిన సినీ ప్రముఖులు

ఉగ్రవాదుల దాడిని ఖండించిన సినీ ప్రముఖులు

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సిఆర్‌పిఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిని పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. వీర మరణం పొందిన జవాన్లకు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ “ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “జవాన్ల కుటుంబాలకు మనస్ఫూర్తిగా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దేశం కోసం జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. ఇది చాలా బాధాకరమైన రోజు”అని చెప్పారు. మంచు మనోజ్ మాట్లాడుతూ “పుల్వామా దాడి చాలా బాధాకరం. ఇందుకు కారకులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి”అని తెలిపారు. అల్లరి నరేశ్ మాట్లాడుతూ “ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవానులారా… ఈ దేశం మీకు, మీ కుటుంబాలకు ఎంతో రుణపడి ఉంటుంది”అని అన్నారు. సూర్య మాట్లాడుతూ “సిఆర్‌పిఎఫ్ జవాన్ల పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను”అని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ “దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఉగ్రదాడిలో మరణించడం మనసును కలిచి వేసింది. ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడడం మన అందరి బాధ్యత”అని చెప్పారు. అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ “పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ సైనికులపై జరిగిన దాడిని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఈ ఘటనను ఎప్పటికీ మరచిపోలేను. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను”అని తెలిపారు.

అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ “ప్రేమికుల రోజు జరుపుకుంటున్న వేళ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని అన్నారు. రానా మాట్లాడుతూ “ఉగ్రవాదుల దాడి జరిగిందన్న వార్త విని షాకయ్యాను. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలు ధైర్యంగా ఉండాలి”అని తెలిపారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ “పుల్వామా దాడి గురించి తెలిసి చాలా బాధపడ్డాను. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను”అని చెప్పారు. అనుష్క మాట్లాడుతూ “ఎంత దారుణమిది. అమరవీరుల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని తెలిపారు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ “పుల్వామా ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎన్నటికి సమాధానం కాలేదు. ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ధైర్యం అందించాలని దేవుడిని కోరుకుంటున్నాను”అని చెప్పారు. అనుష్క శర్మ మాట్లాడుతూ “పుల్వామా ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు దేవుడు కొండంత ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.

Celebrities Express Anger Over Pulwama Terror Attack