Home తాజా వార్తలు రైతుబంధు పథకం సాటిలేని మేటి

రైతుబంధు పథకం సాటిలేని మేటి

ph

దేశానికే ఆదర్శం.. ఆవశ్యకం

భవిష్యత్ వ్యవసాయ ప్రగతి విధానానికి బీజం వంటిది
కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ప్రశంసల జల్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : సొంత భూమి కలిగిన ప్రతీ రైతుకు పంట పెట్టుబడి అవసరాల నిమిత్తం ఎకరానికి ఏటా ఎనిమిది వేల రూపాయ ల ఆర్థిక సాయం ఇచ్చే ‘రైతుబంధు’కు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించగా, ఇది యావ త్తు దేశానికి ఆదర్శం, ఆవశ్యకం అని, భవిష్యత్తు భారత వ్యవసాయ పాలసీకి బీజం లాంటిదని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కెసిఆర్ కిట్, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివాటి అమలు ను తెలుసుకుని ఆశ్చర్యపోయిన అరవింద్ ‘రైతుబంధు’ ప్రత్యేకతను స్వయంగా సిఎం కెసిఆర్ నోటి వెంట వినడంతోనే ఉప్పొంగిపోయారు. ఇది ఒక్క రాష్ట్రానికే పరిమితం కారాదని, యావత్తు దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు. పథకం తొలిదశ అమలుపై అధ్యయనం చేసిన ఆయన ఒక ఆంగ్ల దినపత్రికలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో ‘విశ్వజనీన కనీస ఆదాయం’ (యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్‌యుబిఐ) గురించి చాలా లోతుగా విశ్లేషణ ఉందని, అయితే రాజకీయ విధాన నిర్ణయం దగ్గరకు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో ఆచరణ లేదని అభిప్రాయపడి, ‘రైతుబంధు’ను మాత్రం విప్లవాత్మకమైన సంక్షేమ పథకంగా కీర్తించారు. రేపటి వ్యవసాయ విధానానికి ‘రైతుబంధు’ బీజం లాంటిదని, ‘సదృశ్య విశ్వజనీన కనీస ఆదాయం’ పథకం నమూనా అని కొనియాడారు. నిజంగానే రేపటి వ్యవసాయ విధానానికి ‘రైతుబంధు’ ప్రేర ణ కావచ్చని అభిప్రాయపడ్డారు. సొంత భూమి కలిగిన ప్రతీ రైతుకు ఆర్థిక సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్రం దీన్ని అమలులోకి తేవడానికి ముం దు చాలా లోతుగానే కసరత్తు చేసిందని, రైతుల భూకమతాలను గుర్తించడానికి, లోపాలను చక్కదిద్దడానికి ‘భూ రికార్డుల ప్రక్షాళన’ చేపట్టి ఏ భూ మికి ఎవరు యజమానులో లెక్కదీసిందని, ఆ ప్రకారంగా ‘రైతుబంధు’ సాయం పంపిణీ అయిందని వివరించారు. చాలా తక్కువ సమయంలో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా రైతుల సమ్మ తి, ఏకాభిప్రాయంతో భూరికార్డుల ప్రక్షాళనను పూర్తి చేసి వివాదాలకు తావులేకుండా వ్యవహరించిందని గుర్తుచేశారు. ‘రైతుబంధు’ ఒక సాంఘిక సంక్షేమ విధానం కాబట్టి రైతులకు వారికున్న భూముల విస్తీర్ణాన్నిబట్టి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని, ఎక్కువ భూమి ఉన్నవారికి ఎక్కు వ సాయం అందడం వల్ల తక్కువ భూమి ఉన్న రైతుల్లో ఒక రకమైన అసంతృప్తికి కారణం కావచ్చునేమోగానీ (అందువల్లనే భూ గరిష్ట పరిమితి చట్టం పరిధిలోకి వచ్చిన సంపన్న భూస్వాముల ను ఈ పథకం నుంచి మినహాయించింది) కేంద్ర ఆర్థిక సర్వే ప్రతిపాదించిన యుబిఐ ఆయా కు టుంబాల పేదరికాన్ని బట్టి సబ్సిడీ రూపంలో ఎక్కువ సాయం అందించే ప్రగతిశీల పథకమని వివరించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘రైతుబంధు’ను ఒక సాంఘిక సంక్షేమ పథకం కంటే వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి అమలుచేస్తున్నదేనని నొక్కిచెప్పారు. ఈ కోణం నుంచి చూసినప్పుడు రేపటి వ్యవసాయ విధానానికి ‘రైతుబంధు’ ఒక దిక్సూచిగా ఉంటుందని, ప్రస్తుతం వ్యవసాయ రంగానికి లభిస్తున్న మద్దతుతో పోల్చుకుంటే దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఎన్ని పథకాలున్నా ‘రైతుబంధు’కు ప్రత్యేక స్థానం : ప్రస్తుతం ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతీ రాష్ట్రంలో ఒక తరహా పథకం అమలవుతోందని, ‘రైతుబంధు’ మాత్రం వాటికి చాలా భిన్నమైనదని అరవింద్ సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. పంటలు తీవ్రంగా దెబ్బతింటేనో, ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోతేనో ‘పంటల బీమా’, ‘రుణమాఫీ’ లాంటివి ఉన్నాయని, ఒకవేళ అంచనాలకు మించి పంటల ఉత్పత్తి జరిగితే మార్కెట్‌లో కనీస మద్దతు ధర లేనప్పుడు రైతుకు ఎంత నష్టం వచ్చిందో దాన్ని భర్తీ చేయడానికి పథకం ఉందని గుర్తుచేశారు. వీటికి తోడు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు లాంటి అవసరాలకు ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో మరికొన్ని రాయితీలు లభిస్తున్నాయని, కానీ ‘రైతుబంధు’ మాత్రం వీటికి అతీతంగా, వీటితో సంబంధం లేకుండా అదనంగా ఆదుకునే పథకంగానే ఉందని వివరించారు. అయితే లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయడం ఒక సవాలు వంటిదేనని, ఆర్థికంగా మాత్రమే కాకుండా ప్రభుత్వం యంత్రాం గం కోణం నుంచి చూసినా అనేక పరిమితులతో నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని, రోజువారీ కార్యకలాపాలకు అదనంగా ప్రభుత్వ యంత్రాంగంలోని అనేక మంది సిబ్బంది సేవలను వినియోగించాల్సి ఉంటుందని, మధ్యలో అవినీతి, అసమర్ధత లాంటివాటికి తావులేకుండా చేస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అతివృష్టి ఏర్పడినా, అనావృష్టి చోటుచేసుకున్నా రైతులు పండించే ఉత్పత్తులతో సంబంధం లేకుండా, ఈ ప్రభావం రైతులపై పడకుండా ‘రైతుబంధు’ సాయం అమలవుతుందని వ్యాఖ్యానించారు. పంటల ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయంతో ‘రైతుబంధు’కు సంబంధం ఉండదని పేర్కొన్నారు. ఏ రకంగా చూసినా ‘రైతుబంధు’ ద్వారా అందుకునే ఆర్థిక సాయం రైతులకు అదనంగా లభించేది, సత్వరం వినియోగంలోకి వచ్చేదేనని పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం సగటున ఒక్కో రైతు కుటుంబానికి ఎరువుల, విద్యుత్ సబ్సిడీ కోసం ఏటా లక్షన్నర రూపాయలను వెచ్చిస్తోందని, ప్రతీ వ్యవసాయ కూలీకి కనీసంగా రూ. 50 వేలను ఇస్తోందని, ఇప్పుడు అలాంటి రాష్ట్రాలు ‘రైతుబంధు’ను అమలుచేయాలంటే తొలుత రైతుల భూముల వివరాలను, స్వంత భూములున్న రైతులను గుర్తించాల్సి ఉంటుందని, ఇందుకు చాలా కసరత్తే చేయాల్సి ఉంటుందని అరవింద్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఏ భూమికి ఎవరు యజమానులో తేల్చిన తర్వాత ఈ పథకం అమలు సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి తోడు ఈ పథకాన్ని ‘సామాజిక సంక్షేమం’గా అమలుచేయనుందా లేక ‘వ్యవసాయ సంక్షేమం’గా అమలుచేయనుందో విధాన నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ సామాజిక సంక్షేమ పథకంగా అమలుచేయాలనుకుంటున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’ విధివిధానాలను పుస్సమీక్షించి మరింత ప్రగతిశీలకంగా ఉండేలా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ‘వ్యవసాయ సంక్షేమ పథకం’గా చూస్తున్నట్లయితే ప్రతీ ఎకరానికి నిర్దిష్టంగా ఒకే తీరులో ఆర్థిక సాయం అందించడం సహేతుకమైనదేనని పేర్కొన్నారు. అయితే ఏ విధంగా అమలుచేసినా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న, స్వంత భూమి కలిగిన రైతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వీలవుతుందని పేర్కొన్నారు. ఎక్కువ భూమి ఉన్న రైతులకు ప్రస్తుతం తెలంగాణ ‘రైతుబంధు’ ద్వారా ఎక్కువ ఆర్థిక సాయం అందుతున్నందున ప్రస్తుత మార్కెట్ సంబంధాలకు అనుగుణంగా కొంత మొత్తాన్ని వ్యవసాయ కూలీలకు ఇవ్వడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలుచేయాలనుకుంటే దీనికి ‘సహకార సమాఖ్య స్ఫూర్తి’ ఉండాలని, అమలుచేసేది రాష్ట్రాలే అయినా ఆర్థిక వనరులను మాత్రం కేంద్రం సమకూర్చడం సమంజసంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలను ఈ పథకానికి మళ్ళించవచ్చునని, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకోసం రాష్ట్రాలకు ఇస్తున్న నిధులను ఈ పథకానికి వర్తింపజేయవచ్చునని, ఆయా పథకాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండాలని సూచించారు. కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించిన ‘యుబిఐ’కు తెలంగాణ అమలుచేస్తున్న ‘రైతుబంధు’కు పలు అంశాల్లో స్వాభావికమైన వ్యత్యా సం ఉందని ఉదహరించారు. యుబిఐ అమలు ద్వారా ఒక్కసారిగా దేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని, కానీ తెలంగాణ ‘రైతుబంధు’ లాంటి పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను రక్షించడానికి ఉపయోగపడుతుందని, ఈ పథకం వెలుగులో ‘సామాజిక’ లేదా ‘వ్యవసాయ’ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు.