Home తాజా వార్తలు కేంద్రం సహకరించడం లేదు : కెసిఆర్

కేంద్రం సహకరించడం లేదు : కెసిఆర్

Central Govt did not Cooperate : KCRహైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం లేదని, అదనంగా ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదని సిఎం కెసిఆర్ తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు బాగున్నాయని ఆర్థిక సంఘం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ రెండు పథకాలకు కలిపి రూ.24 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని చెప్పారు. ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయమని ఎన్ని సార్లు కోరినా స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో 1.25 కోట్ల ఎకరాల భూమికి సాగునీరు అందనుందని, సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.99వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. కొత్తగా ఆవిర్భవించిన ప్రతి గ్రామానికి బిటి రోడ్లు వేస్తామని ప్రకటించారు. కొత్త రోడ్ల మంజూరు కంటే ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పెంచిన పింఛన్లను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని, నిరుద్యోగ భృతి అమలుకు మాత్రం కొంత అదనపు సమయం పడుతుందని, నిరుద్యోగ భృతి లబ్ధిదారుల ఎంపిక విషయంలో సమగ్ర అధ్యయనం అవసరం ఉందని ఆయన తెలిపారు. రైతుబంధు పెంపు మొత్తం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతుందని, మిషన్ భగీరథ పథకం మార్చి నెలాఖరు నాటికి పూరవుతుందని ఆయన వెల్లడించారు.

Central Govt did not Cooperate : KCR