Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మూకలపై కొరడా!

central-government-employee

ఆగని గుంపు హత్యల నివారణకు  కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ

న్యూఢిల్లీ : దేశంలో మూక హత్యలను నిరోధంపై కేంద్రం స్పందించింది. వీటి నివారణకు తీసుకోవల్సిన చర్యలను సూచించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. మూకదాడులు, హింసాత్మక ఘటనలు, వదంతులతో తలెత్తే ఘర్షణలు వంటి అంశాలపై దేశంలో ఆందోళన నెలకొంది. మూకదాడుల నివారణకు ఇప్పటికే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో మంత్రిత్వ స్థాయి కమిటీ ఏర్పా టు అయింది. ఈ మంత్రుల బృందానికి ఉన్నతాధికారుల కమిటీ తమ సిఫార్సులను అందిస్తుంది. వీటిని మంత్రుల స్థాయి బృందం పరిశీలించి మంత్రుల బృందం ప్రధానికి ఒక పూర్తి స్థాయి నివేదికను అందిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సామూహిక దాడులు, మూక హత్యలపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు వెలువరించింది. తగు విధంగా చర్యలు తీసుకోవాలని , వీలైతే కొత్త చట్టం తేవాలని, లేదా ఇప్పుడున్న ఐపిసి సవరించాలని సూచించింది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు కేంద్రం చర్యలు చేపట్టిందని వెల్లడైంది.
అల్వార్‌పై నివేదికకు సూచన : రాజస్థాన్‌లోని అల్వార్‌లో మూకహత్య ఘటనపై నివేదికను అం దించాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. నివేదికను సాధ్యమైనంత త్వరగా పంపించాలని హోం మంత్రిత్వశాఖ నుంచి సం దేశం పంపించినట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. ఒక వ్యక్తి ఆవులను అక్రమంగా రవా ణా చేస్తున్నాడనే అనుమానంతో అల్వార్‌లో ఓ గుంపు కొట్టి పేసింది. ఈ ఘటన తీవ్రస్థాయిలో నిరసనలకు దారితీసింది. ఘటన వివరాలు, దాడికి కారణాలను నివేదికలో పొందుపర్చాలని , దాడికి పాల్పడ్డ వారిపై ఇప్పటివరకూ ఏమైనా చర్యలు తీసుకున్నారా? చర్యలు ఏ దశలో ఉన్నాయి? ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటీ? వివరాలను తెలియచేయాలని కోరారు. పాతికేళ్ల అక్బర్ ఖాన్ అనేక వ్యక్తిని గోవుల తరలింపు పేరిట అల్వార్ జిల్లాలోని లాలావండీ గ్రామంలో కొందరు తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యకి దుర్మరణం చెందాడు. రాజస్థాన్ పోలీసు విభాగం ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి తగు రీతిలో శిక్షించేందుకు చర్యలు చేపట్టింది. అక్బర్ ఖాన్‌ను సకాలంలో పోలీసులు ఆసుపత్రికి తరలించలేదని వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు జరుపుతుంది. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగపర్చారని వచ్చిన విమర్శలను కూడా పరిశీలించడం జరుగుతుందని , సీనియర్ పోలీసు అధికారులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు రాజస్థాన్ డిజిపి ఒపి గల్హోత్రా తెలిపారు.

Comments

comments