Home ఎడిటోరియల్ ప్రధానిమాటకు మాటసాయం

ప్రధానిమాటకు మాటసాయం

Champaran movement completed 100 years

ప్రధాని అంతటవారే తమ మాటల్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు పొంగిపోతారనే ఆశ ఈ అభ్యర్థనలో దాగి ఉంది. జనం కూడా నాయకులు దిగివచ్చినట్లు భుజం మీద చేయి వేయగానే కరిగి నీరై పోతున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు, పాలకులు మానవీయ బలహీనతల్ని వాడుకుంటూ వీధుల్లో కలిసి నడవడాలు, రోడ్డు పక్కన ఉన్న హోటళ్లలో తేనీరు, అల్పాహారాలు సేవించడం, వంగివంగి అందించే కరచాలనాలు, దళితులతో కలిసి, వారి ఇళ్లలోకి వెళ్లి భోజనం చేయడం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రధానికి దేశాన్ని ఎలా పాలించాలి, నేడు దేశంలో ఏం జరుగుతోంది.  

పారిశ్రామిక వేత్తలతో భుజాలు రాసుకొని తిరగడమేమిటని రాహుల్ గాంధి అడిగిన ప్రశ్నకు దీటుగా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే వారితో బేషరతుగా కలిసి ఉంటానని ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. వేల కోట్ల మోసంతో బ్యాంకులను నట్టేట ముంచిన వారితో ప్రధాని కలిసి దిగిన ఫోటోలనుద్దేశించి దొంగలకు దోస్తు అని చిత్రించేందుకు ప్రయత్నించిన రాహుల్ మాటకు అదురు బెదురులేని జవాబిచ్చారు మోడీ.

విపక్షాల ప్రశ్నల్ని తిప్పికొట్టడంలో దిట్ట అయిన ప్రధాని మోడీ రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ఇచ్చే ప్రసంగం కోసం మాటల్ని అరువివ్వండని ట్వీట్ ద్వారా కోరుతున్నారు. మాటలే ఆయుధంగా రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే మోడీ ప్రజల నుండి సూచనలు కోరడం కూడా ఓ రాజకీయ ఎత్తుగడనే. అయితే నేటి పరిస్థితి మాత్రం మోడీకి మాటలు రాని విధంగానే ఉంది. దేశంలోని అన్ని మతాల, వర్గాల ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో ఘోరంగా విఫలమైన పాలనలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ తెర వెనుక హస్తం బయట పడుతోంది. మూకోన్మాదపు దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నా వర్తమానంలో మోడీకి నోరు మెదలని పరిస్థితే ఉంది. మోడీ హావభావాల్లో తొలినాళ్ల గంభీరత, విజయ చిద్విలాసం మాయమై గండం ఎలా గట్టెక్కించాలో ఆలోచనలో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

గత కొన్ని ఉప ఎన్నికల్లో బిజెపిని ప్రత్యేకంగా మోడీ పరివారం చేష్టలను ప్రజలు అవమానకరంగా తిప్పికొట్టారు. సదా ప్రశంసల వర్షం కురిపించే మీడియా కూడా పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధపడుతున్నాయి. మోడీ అడుగులకు మడుగులొత్తిన తెలుగు పత్రికల్లో కొన్నింటికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై చిచ్చు రగలడంతో ప్రధాని బద్ధ శత్రువైనారు. కాలం కలిసి రాకపోతే మోడీ వచ్చే సంవత్సరం ఎర్రకోట నుండి ప్రసంగించకపోవచ్చు. క్రితం సంవత్సరాలలో కూడా ప్రధాని తన ప్రసంగంలో ఏమి ప్రస్తావించమంటారో తెలుపమని ప్రజల్ని కోరారు. ఆయన అభ్యర్థనకు ఎందరో స్పందించారు కూడా. అయితే మోడీ చేసిన ప్రసంగానికి ప్రజలిచ్చిన సూచనలకు పొంతనలేదని తెలిసిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అందరిదీ విని తనది మాత్రమే పాటించినట్లు మోడీ ప్రజల సూచనల్ని ఎన్నడూ తన ప్రసంగంలో వాడుకోలేదు.

ఈసారి 31-.7.2018 నాడు మీ ఆలోచనలు తనతో పంచుకొని తనకు 15వ ఆగస్టు నాడు చేసే ప్రసంగానికి తోడు నిలువమని తన ట్విట్టర్‌లో కోరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ యాప్ ద్వారా దాని, mygov.in/groupissve/gi.. ద్వారాగాని ప్రధానికి తమ సూచనలు పంపవచ్చు. 7 ఆగస్టు నాటికి ఏడువేలకుపైగా ప్రజలు ఆయన మాటకు స్పందించారు. గత మూడేళ్లుగా ఇలాగే ప్రధాని ప్రజల్ని కోరడం వేల మంది అందు లో పాల్గొనడం జరుగుతూనే ఉంది. ప్రజల సూచనలేమోగాని ప్రధాని ప్రసంగ సమ యం ఏడాదికేడాది తగ్గిపోతోంది. పాలన తొలి నాళ్లలో గంటన్నర దాకా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని పోయినేడు కేవలం 57 నిమిషాలతో ముగించారు. 2014లో గంటకు పైగా మాట్లాడిన ప్రధాని అందులో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన లాంటి ఆకర్షణీయ పథకాల గురించి ఘనంగా ప్రస్తావించారు. 2017లో మాత్రం పాత పథకాల అమలు తీరు, వాటి గణాంకాలతోనే సరిపెట్టుకున్నారు.

పథకాలకు సంబంధంలేని 75 ఏళ్లు పూర్తి చేసిన క్విట్ ఇండియా, వంద ఏళ్లు పూర్తి చేసుకున్న చంపారన్ ఉద్యమం, 125 ఏళ్లు నిండిన బాల గంగాధర్ తిలక్ చేపట్టిన గణేశ్ ఉత్సవాల ప్రస్తావన కూడా చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, గ్రామీణ సంపూర్ణ విద్యుద్దీకరణ, బినామీ ఆస్తుల స్వాధీనం ముచ్చట లేదు. ఈ ప్రసంగంలో ఆయన కవిత్వ ధోరణిలో చెప్పిన ‘న గోలీసే.. న గాలీసే.. సిర్ఫ్ లెలగ్ నేసే కశ్మీర్‌కి సమస్యా సులేజాయేంగే’ అన్న మాట ఉల్టా తిరిగి కశ్మీర్ ఎన్‌కౌంటర్లమయమైంది. తుపాకి గుండుతోకాదు, దూషణతో కాదు, పరస్పర కౌగిలింతలతో కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దాం అన్న మాట కవిత్వంగానే మిగిలిపోయింది. 2015 నాటి ప్రసంగంలో 2019 నాటికి ప్రధానమంత్రి క్రిష్ సిచాయి యోజన కింద ఉన్న అన్ని మధ్య తరహా, భారీ నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మాట బడ్జెట్ కేటాయింపుల్లో వట్టిపోయింది.

ప్రధాని అంతటవారే తమ మాటల్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు పొంగిపోతారనే ఆశ ఈ అభ్యర్థనలో దాగి ఉంది. జనం కూడా నాయకులు దిగివచ్చినట్లు భుజం మీద చేయి వేయగానే కరిగి నీరై పోతున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు, పాలకులు మానవీయ బలహీనతల్ని వాడుకుంటూ వీధుల్లో కలిసి నడవడాలు, రోడ్డు పక్కన ఉన్న హోటళ్లలో తేనీరు, అల్పాహారాలు సేవించడం, వంగివంగి అందించే కరచాలనాలు, దళితులతో కలిసి, వారి ఇళ్లలోకి వెళ్లి భోజనం చేయడం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రధానికి దేశాన్ని ఎలా పాలించాలి, నేడు దేశంలో ఏం జరుగుతోంది. జనం మనసులో ఏముంది, వారు ఏ సమస్యలకు ప్రభుత్వం నుండి పరిష్కారం కోరుతున్నారు అనేది తెలియకుండా ఉండే ఆస్కారమే లేదు. భాషణా చాతుర్యమే గనుక ఉంటే అది సామాన్యుడిని కూడా రాజుగా మారుస్తుంది’ అన్నాడు మహావక్త విన్సెంట్ చర్చిల్. ఎదుటి వారివైపు న్యాయమున్నా నోటి మాటలతో తికమక చేస్తున్న నాయకులు మన నేటి పాలకులు.

ప్రధాని కోరిక మేరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి తమ సూచనలు పంపిన వారి ఆకాంక్షలేమిటో ఒకసారి చూద్దాం. మహిళలపై, బాలికలపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న దాడులను, లైంగిక వేధింపులను ఆపే దిశగా చేపట్టే చర్యల గురించి ప్రస్తావించమని స్త్రీలు కోరుతున్నారు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీ ప్రజలపై, దళిత బహుజనులపై జరుగుతున్న మూకోన్మాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వేసే అడుగులేమిటో చెప్పమని కోరిన వారు అధికంగా ఉన్నారు.

మహిళలపై లైంగిక దాడులవల్ల స్త్రీగా దేశంలో నేను సురక్షితంగా ఉన్నట్లు భావించడం లేదని రోష్ని సంజీవ్ పోస్టు పెట్టారు. లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి పెంచడం కాకుండా ఉద్యోగమే లక్షంగా ఆర్థిక ఇబ్బందులు భరించి చదివిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ద్వారా ఆదుకోవాలని ఓం ప్రకాశ్ కోరారు. ఉద్యోగం చేసినన్ని రోజులు ఆదాయపు పన్ను చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పించమని సౌరభ్ చంద్ర అగర్వాల్ కోరారు. దేశంలోని కార్పొరేట్ వైద్యం ప్రజల్ని దోపిడీ చేస్తోంది. డాక్టర్లు వ్యాపారులుగా మారి మందుల కంపెనీ వారికి లాభాలు చేస్తూ, కంపెనీ ఖర్చుతో విదేశీ విహార యాత్రలు చేస్తున్నారు. దీనిని అరికట్టండి అని తుషార్ సెహగిల్ ఆశించారు.

ఆర్థికంగా బలపడిన దళిత, గిరిజన కుటుంబాలవల్ల వారిలోని పేద కుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు లభించడం లేదు. దీనిని పరిష్కరించే ఆలోచన ప్రకటించమని శుభం కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్య తీర్చి విద్యకు ఉపయుక్త సామాగ్రిని సమకూర్చి విద్య పెరిగే ఆలోచన చేయండని ధర్మేంద్ర కుమార్ ఆశించారు. ఇలా వస్తున్న అభ్యర్థనలు, సూచనలు, పదిహేను ఆగస్టు నాటికి మరిన్ని వేలల్లో ఉండవచ్చు. వీటిని సేకరించి వాటిలో ప్రస్తావించిన సమస్యలను క్రోడీకరించి, అందులో ప్రసంగంలో ప్రస్తావించవలసిన అంశాలను జల్లెడపట్టి ప్రధాని ముందు ఉంచేందుకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది ఎంత వరకు సిద్ధపడిందో తెలియదు. ఈ సూచనలకు ఎంత ప్రాధాన్యత ఈయబడుతుందో ప్రధాని ప్రసంగంలో వీటి ప్రస్తావన ఉంటుందో లేదోగాని వేల సంఖ్యల్లో ప్రధాని పాలనకు అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు మాత్రం బయటపడ్డాయి. ప్రధానంగా మహిళలపై దాడులు, దళిత, మైనారిటీలపై దమన కాండలపై అధిక ట్వీట్లున్నాయి. మరి వాటిని ప్రధాని తన ప్రసంగంలో ఎంత వరకు ప్రస్తావిస్తారో, పరిష్కారాన్ని ప్రకటించి దానిని ఎంత వరకు కార్యరూపానికి తేగలుగుతారో ఆగస్టు 15 రోజు, ఆ తర్వాతి కాలంలో తెలుస్తుంది.

                                                                                                                                  – బి.నర్సన్, 9440128169