Home ఎడిటోరియల్ మహానేత

మహానేత

Karunanidhi is against the majority of Indian politicians

కళైంజర్ (కళాకారుడు) ముతువేల్ కరుణానిధి ఇక లేరు. ఈ దుర్వార్త ఏ క్షణాన అయినా వినకతప్పదని గత కొన్ని రోజులుగా అనుకుంటున్నదే. శతాయుష్షు కావడానికి ఆరేళ్ల వ్యవధి ఉందనగా 94వ ఏట ఆయన తుది శ్వాస విడిచారు.

ద్రవిడ నేల, గాలి, నీరు ఆయన వియోగానికి ఎంతగా దుఃఖిస్తున్నాయో! తమిళ చరిత్ర, సాహిత్యాలు ఆయనకు కరతలామలకాలు. పాత్రికేయుడుగా, రచయితగా సినిమా కథలు, సంభాషణల సృషికర్తగా విశేష ఖ్యాతి గడించిన కరుణానిధి వాగ్ధాటి గల మంచి వక్త, ప్రసంగ చతురత పుణికి పుచ్చుకున్న మేటి. తొలి ద్రవిడ స్టూడెంట్ యూనియన్ ద్రవిడ మానవర్ మంద్రమ్ ను నెలకొల్పి విద్యార్థిగానే తనలోని రాజకీయ చైతన్యాన్ని చాటిన వ్యక్తి. కాళ్లకుడి ఊరు పేరు పునరుద్ధరణోద్యమంలో ముందుండి సమర శీల పాత్రను పోషించిన యువ కిశోరంగా రాజకీయాల్లో తొలి మైలు రాయిని దాటారు. మురసోలి పత్రికను ప్రారంభించి తర్వాతి కాలంలో దానిని డిఎంకె అధికార వాణిగా మలిచారు. పెరియార్ ప్రాణం పోసిన ద్రవిడ భావజాల రాజకీయ క్షేత్రంలో అనితరమైన సేద్యం చేసి అసాధారణ ఫలాలు పండించిన కరుణానిధి సాటిలేని నేత. హిందీ వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషించిన హేతువాది.

మామూలుగా ఐశ్వర్య శిఖరాలనుంచి ఊడిపడే మెజారిటీ భారత రాజకీయ నాయక బృందానికి విరుద్ధంగా కరుణానిధి అతి సాధారణ కుటుంబం నుంచి, జన సామాన్యం మధ్య నుంచి వచ్చారు. ఆలయ వాయిద్య వృత్తి కులం నుంచి, చిన్న చూపు చూడబడిన సామాజిక నేపథ్యం నుంచి వచ్చి నిజమైన జన నేతగా అశేష ప్రజావాహినికి ఆరాధ్యుడుగా ఎదిగిన కరుణానిధి ఒక శకపురుషుడనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌లోనూ, జస్టిస్ పార్టీలోనూ గల ధనిక వర్గ, అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలను పెరియార్ అడుగు జాడల్లో వ్యతిరేకించి ద్రవిడ చైతన్యాన్ని రగిలించడం ద్వారా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విశిష్ట నేత. తమిళ భావజాల స్ఫూర్తితో పరిశ్రమించిన చరితార్థుడాయన. ద్రావిడ ఆత్మగౌరవ ఉద్యమానికి ఊపిరిగా భాసించిన రాజకీయ భానుడు. పేదలకు, నిర్ధనులకు ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఉండే రాజకీయాలకు ప్రాణం పోయాలని తలచి అన్నాదురై డిఎంకెను నెలకొల్పడంతో కరుణానిధికి అది ఊహించని రీతిలో ఊతమిచ్చింది. ఉన్నత విద్యావంతుడు కాకపోయినా కరుణానిధిలోని పటిమను గమనించి ఆయన డిఎంకెలో ఎదగడానికి అన్నాదురై తోడ్పడ్డారు.

కరుణానిధి పదమూడుసార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడం, ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి ఆయనకు సొంత నేలతో, భాషా సంస్కృతులతో విశేషించి సాధారణ ప్రజానీకంతో గల పటిష్ఠ బంధమే కారణం. వ్యక్తిగతంగా జాతీయ రాజకీయాలవైపు కన్నెత్తి చూడకుండా తమిళ ప్రజల మధ్యనే ఉండి వారి నాలుకగా నాయకుడిగా చిరస్థానాన్ని సంపాదించుకున్నారు. కేంద్ర రాజకీయాల్లో డిఎంకె, అన్నాడిఎంకెలు పోషించిన పాత్రలు అసాధారణమైనవి. కరుణానిధి నేతృత్వంలో డిఎంకె తమిళులకు సంబంధించిన, ముఖ్యంగా శ్రీలంకలోని తమవారికి చెందిన విషయాల్లో కేంద్రంపై అసాధారణమైన ఒత్తిడి కలిగించి ఆమేరకు విజయాన్ని సాధించడంలో విశేష పాత్ర పోషించింది.

చలన చిత్ర నటులు అశేష ప్రేక్షకాభిమానంతో రాజకీయాల్లో ప్రవేశించి రాణించడానికి, కింది సామాజిక సోపానం నుంచి వచ్చిన ఒక సినిమా రచయిత వారికి తీసిపోని రీతిలో రాజకీయాల్లో గుర్తింపు, గౌరవం పొంది రాష్ట్రాధికార పగ్గాలు చేపట్టడానికి తేడా ఉంది. ఎంజి రామచంద్రన్‌తో, అనంతరం జయలలితతో ఢీ కొని సెభాష్ అనిపించుకోవడం కరుణానిధి అసాధారణ రాజకీయ ప్రాగల్భ్యానికి తిరుగులేని నిదర్శనం.

తమిళనాడు రాజకీయాలది దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం. ఉత్తరాది పెత్తనం దుడ్డు కర్రతో కేంద్రం బుసలుకొట్టినప్పుడల్లా దానిని ఎదిరించి నిలువరించడంలో తమిళనాడు ముందు నిలుస్తుంది అనే భావన గాఢంగా నెలకొన్నది. ఇటీవలి పరిణామాలను గమనించే వారికి తమిళనాడు ఆ వారసత్వాన్ని కోల్పోతున్నదనిపించిందనడం అసత్యం కానేరదు. ఇంతకాలం తమిళనాడుకు ఆ ప్రత్యేకతను నిలబెట్టిన కొద్దిమంది గొప్ప నేతలలో ఒకరైన కరుణానిధి అస్తమయంతో ఆ రాష్ట్రంలో ద్రవిడ రాజకీయాల ప్రాబల్యం అంతరిస్తుందా అనే ప్రశ్న ఉదయించడం సహజం.