Home ఆఫ్ బీట్ జైలు ఒ(బ)డిలో చంచల్‌గూడ వెళ్లొద్దాం రండి

జైలు ఒ(బ)డిలో చంచల్‌గూడ వెళ్లొద్దాం రండి

Chanchalguda-Women-Prison

జైలంటే సినిమాల్లో చూపించినట్లుగా ఖైదీల చేత  రాళ్లు రప్పలు కొట్టించడం, చిప్పకూడు తినిపించడం, వాళ్లను తిట్టడం, తన్నడంలాంటివి ఉంటాయనుకుంటారు…  వాస్తవానికి జైలు అంటే తప్పు చేసిన వ్యక్తి  పరివర్తన చెందేందుకు తోడ్పడే ప్రదేశం.. కారాగారానికి వచ్చే ఖైదీలలో  సగానికి మించిన వారికి చట్టాలపై అవగాహన  ఉండదు.  నిరక్షరాస్యత..అనేవి ముఖ్యకారణాలు.

క్షణికావేశంలో చేసిన తప్పుకు ఇక్కడికి వచ్చి అనంతరం పశ్చాత్తాపంతో కుమిలిపోయేవారే ఎక్కువ.  అలాంటివారిని అక్కున చేర్చుకుని వారు ఆందోళనకు లోనుకాకుండా కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో నూతనోత్సాహాన్ని కలిగించే ప్రశాంత నిలయాలివి.  వేలిముద్ర వేసి లోపలికి వెళ్లిన ఖైదీ విడుదలయ్యేటపుడు కచ్చితంగా సంతకం చేసి రావడం చూస్తే జైలంటే ఏంటో అర్థమౌతోంది.. ఖైదీల పరివర్తన కోసం పాటుపడే అక్కడి సిబ్బందిని అభినందించాల్సిందే.  జైలంటే స్వేచ్ఛ లేదని అర్థం కాదు.

కుటుంబం ఒక్కటే దూరం. నాలుగ్గోడల మధ్య ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంది.  ఇక్కడ ఖైదీలకు ప్రతి రోజు కౌన్సెలింగ్ క్లాసులు జరుగుతుంటాయి.  సాధారణంగా హత్య, దొంగతనం, వ్యభిచారం, డ్రగ్స్‌లో పట్టుబడ్డవాళ్లు, కట్నం కేసుల్లాంటివి వస్తుంటాయి.   చదువుకున్నవాళ్లకు ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంటారు.  ఏదో ఒకటి వాళ్లకు తెలిసిన విద్యను తోటి ఖైదీలకు నేర్పిస్తుంటారు.  ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఖైదీలతో ఇన్ని కార్యక్రమాలు చేయించడం అద్భుతం. దేశంలో చాలా తక్కువ జైళ్లలో ఈ సదుపాయం ఉంది.  చంచల్‌గూడ మహిళా జైలు ఇండియాలోనే ప్రత్యేకమైనది. 

హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ప్రస్తుతం 270 మంది ఖైదీలున్నారు. ఇక్కడికి గర్భిణులు కూడా ఖైదీలుగా వస్తుంటారు. వారికి ఎవరూ లేరనే దిగులు లేకుండా చూస్తారు ఇక్కడి సిబ్బంది. బయట తమ ఇళ్లల్లో జరిగినట్లే సీమంతం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. తోటి ఖైదీలు వారికి తమ దీవెనలు అందిస్తుంటారు. పుట్టిన బిడ్డలను ఆరేళ్లు వచ్చే వరకు తమతోబాటే ఉంచుకునే అవకాశం ఉంది. పుట్టిన బిడ్డలకు బారసాల లాంటివి చేస్తుంటారిక్కడ. ఖైదీలకు తమ కుటుంబానికి దూరంగా ఉన్నామనే బాధ తప్ప ఇంకేమీ లోటు లోటు లేకుండా చూస్తారిక్కడ.

క్రమశిక్షణకు మారుపేరు…
ఖైదీలంతా సమయాన్ని అనుసరించి అన్ని పనులూ చక్కగా చేస్తుంటారు. ఆరోగ్యంతోపాటు అక్షరాస్యతకు అధికప్రాధాన్యం. ఉదయం 6.30 నుంచి 7.30 వరకు పరేడ్, యోగా, ధ్యానం చేస్తారు. వారంలో రోజుకొక అల్పాహారం ( చపాతి, కట్టెపొంగల్, ఉప్మాలాంటివి) ఉంటుంది. ప్రతి గురువారం అందరికీ గుడ్డు. సాయంత్రం ఆరు నుంచి తొమ్మది వరకు దూరదర్శన్ కార్యక్రమాలను చూస్తారు. కంప్యూటర్ నేర్చుకుంటారు. సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు హోం వర్కు ఉంటుంది. కుట్లు, అల్లికలు, కొవ్వొత్తులను, బేకరీ ఉత్పత్తులను , బ్యాగులను కుట్టడం, బేకరీ ఉత్పత్తులను తయారుచేయడం, గార్డెనింగ్‌లాంటివి అన్నీ నేర్చుకుంటారు. తయారుచేసిన వస్తువులతో ప్రతిఏటా జనవరిలో జరిగే నాంపల్లి ప్రదర్శనశాలలో స్టాల్‌ను పెడుతుంటారు. అమ్మగా వచ్చిన డబ్బు ఖైదీల అకౌంట్‌లో జమ అవుతుంది. వంతుల వారీగా వంట చేస్తుంటారు. మళ్లీ దాన్ని జైలు సూపరింటెండెంట్ రుచి చూసినతర్వాతే ఖైదీలంతా తినేది. అంత జాగ్రత్త తీసుకుంటారు జైలు అధికారులు. ప్రతి నెలా చివరి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఖైదీలంతా కలిసి తమ అభిరుచులకు తగ్గట్టుగా నాటికలు, నాట్యం, మిమిక్రీలాంటివి చేస్తుంటారు. కారాగారంలో సాయిబాబా గుడికూడా ఉంది. రోజూ నాలుగ్గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్లకు ఇష్టమైన ఆటలు ఆడుకుంటారు.

డిజి ప్రోత్సాహంతో…
జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వి.కె. సింగ్ మహాపరివర్తనం, విద్యాదానం పథకాలను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ఖైదీలంతా కచ్చితంగా చదువుకోవాల్సిందే. హరితహారం పేరుతో ఖైదీలు కారాగారంలో రెండు లక్షల చెట్లను నాటారు. ఖైదీలు సంపాదించిన డబ్బును బ్యాంక్‌లోని వారి వ్యక్తిగత అకౌంట్‌లో జమ చేస్తారు. దీని వల్ల ప్రధానమంత్రి కౌసల్య యోజన వాళ్లకు వర్తించేలా చేస్తున్నారు. ఇక్కడ వివిధ పనులు నేర్చుకున్న వారికి శిక్ష పూర్తయిన తర్వాత బయట ఉద్యోగాలను కూడా ఇప్పిస్తుంది జైళ్ల శాఖ. ప్రతి శనివారం యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, రచయిత్రుల్లాంటివారు వచ్చి ఖైదీలకు వారి అనుభవాలను చెబుతూ కౌన్సెలింగ్ చేస్తుంటారు. అంతేకాకుండా జైలుకు సంబంధించిన కౌన్సెలర్లు ఎప్పుడూ ఖైదీలకు అందుబాటులో ఉంటారు. రోజుకు పదిమంది ఖైదీలకు తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇస్తారు. ఇక్కడికి వచ్చే ఖైదీలకు నాంపల్లి, రంగారెడ్డి కోర్టుల ఆరుగురు అడ్వకేట్లను నియమించింది. వారు ఉచితంగా ఖైదీల తరఫున వాదిస్తారు.

పది బ్యారక్‌లు… పది సెల్‌లు
వివిధ వర్గాలకు సంబంధించిన వారు వారికి కేటాయించిన బ్యారక్‌లలో ఉంటారు. పెద్ద వయసు వారు, ఇరవై నుంచి పాతికేళ్ల వయసు వున్న వాళ్లను విడివిగా ఉంచుతారు. తమకు ఎవరూ లేరని చెప్తుంటారు. అయినా సరే ఇక్కడ అధికారులు ఆరా తీసి ఖైదీల చుట్టాలు ఉన్న ఊర్లకు తమ కౌన్సెలర్లను పంపి వివరాలు కనుక్కుంటారు.

ములాఖత్‌లో ఆధార్ తప్పనిసరి..
ములాఖత్‌లో వచ్చే వారికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అడ్వకేట్‌లు మాత్రం వీళ్లను ఎప్పుడైనా కలవొచ్చు. ఖైదీలు తమ వారితో వారానికి రెండు రోజులు మట్లాడుకోవచ్చు. థంబ్ ఇంప్రెషన్ పెడితే వారి వారి ఫోన్ నంబర్లు వచ్చేస్తాయి. ఫోన్‌లో ముందే ఖైదీల నెంబర్లు ఫీడ్ చేసి ఉంటాయి.

మేమేం తప్పు చేయలేదంటారు…
ఇక్కడికి వచ్చిన ఖైదీలు ముందుగా చెప్పే మాట మేమేం తప్పు చేయలేదు. మమ్మల్ని ఇరికించారు అని. వెంటనే జైలు సూపరింటెండెంట్ సంబంధించిన పోలీస్‌స్టేషన్లకు ఫోన్ చేసి విషయం కనుక్కుంటారు. అన్ని రికార్డులు తెప్పించుకుని చూస్తుంటారు.

హత్యకేసులో శిక్ష…
హత్య కేసులో భార్యాభర్తలం ఇద్దరికీ జీవితకాలం శిక్ష పడింది. మా ఆయన చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నాకు ఇద్దరు మగపిల్లలు. సికింద్రాబాద్‌లోని శిశుసంక్షేమ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. పెద్దవాడు పదో క్లాసు. చిన్నోడు ఎనిమిది. నాకు ఇక్కడికి వచ్చేముందు అస్సలు చదువురాదు. ఇప్పుడు బిఎ రెండో సంవత్సరం చదువుతున్నాను. పదిహేను రోజులకు ఒకసారి నన్ను చూడటానికి మా కన్నవాళ్లు వస్తారు. ఇక్కడ అల్లికలు, కేండిల్స్ తయారీ లాంటివి అన్నీ నేర్చుకుంటున్నాను. మాకు వచ్చే డబ్బును బ్యాంక్‌లో వేసుకుంటున్నాం. సత్త్రవర్తన కింద ప్రభుత్వం నాకు క్షమాభిక్ష పెడుతుందని నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చి ఎనిమిదేళ్లయింది. మా జైలు అధికారుల మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు.

హత్య కేసు ..
మహబూబ్‌నగర్ జిల్లా మాది. నేను మా ఆయన్ని హత్య చేసినందుకు శిక్ష పడింది. ఆయన తాగుబోతు. రోజూ వచ్చి నన్ను చితకబాదేవాడు. ఒకసారి కోపం పట్టలేక క్షణికావేశంలో అతన్ని చంపేశాను. నాకు ఒక కూతురు. ఒక కొడుకు. కూతురుకు పెళ్లయింది. పెళ్లికి వెళ్లలేదు. తర్వాత కూతురు అల్లుడు వచ్చి ములాఖత్‌లో కలిశారు. నా కొడుకు మా అమ్మ దగ్గర ఉంటున్నాడు. కుటుంబానికి దూరంగా ఉంటున్నాననే బాధ తప్ప ఇక్కడ బాగా చూసుకుంటున్నారు.

డ్రగ్స్ కేసులో…
బయట దేశం నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఏడేళ్లయింది. నాది పదేళ్ల శిక్ష. డ్రగ్స్ కేసులో శిక్ష పడింది. మా దేశపు ఎంబసీ వాళ్లు వచ్చి ములాఖత్‌లో కలుస్తుంటారు. అంతకు ముందు నాకు ఏ పనీ చేతకాదు. ఇక్కడికి వచ్చాక చపాతీలు తయారుచేయడం నేర్చుకున్నాను. తెలుగు, ఇంగ్లీష్. హిందీ మాట్లాడుతున్నా. వచ్చి మూడేళ్లయింది. బేకరీకి సంబంధించిన పదార్థాలను అన్నీ చక్కగా చేస్తాను.

వ్యభిచారం కేసు..
పదిహేడు నెలలైంది ఇక్కడికి వచ్చి. పాత కేసులలో రిమాండ్‌లో ఉన్నాను. ఊరి నుంచి వచ్చిన అమ్మాయిలను ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి మోసం చేసి వ్యభిచారంలోకి దించి తప్పు చేశాను. అందుకే నాకు శిక్ష పడింది. మళ్లీ ఇటువంటి తప్పు చేయను. నాది తూర్పుగోదావరి జిల్లా. కులాంతర వివాహం చేసుకున్నాను. భర్త వదిలేశాడు. నాకు ఎవరూ లేరు. అనాథను. అన్నీ జైలు అధికారులే. నాకు మధుమేహం ఉంది. ఇక్కడ వాళ్లు సమయానికి మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

క్షమాభిక్ష కోసం అర్జీ
క్షణికావేశంలో తప్పులు చేసి అయిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన జీవిత, జీవితేతర ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించాలని తెలంగాణ ముఖ్యమంత్రికి ఖైదీల కుటుంబసభ్యులు ఈ మధ్యనే లేఖ రాశారు.  ఈ ఏడాది జనవరి 26న ఖైదీల క్షమాభిక్షకు సిద్ధమైన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులలో కొన్ని లొసుగుల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈసారి అలాంటి లోటుపాట్లు లేకుండా ఉత్తర్వులను జారీ చేయాలని, ఆ ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించాలని వారు ఆ లేఖలో కోరారు. జైలులో ఉంటూ ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకున్నారని, పెట్రోల్‌బంక్‌లు, జైళ్లశాఖ నిర్వహిస్తున్న పరిశ్రమలో పనిచేసి అనుభవాన్ని సంపాదించుకున్నారు. వీరందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తే సమాజంలో గౌరవంగా బతుకుతారు. ఇంతకాలం కుటుంబ పెద్దలేని లోటుతో ఉన్న తమకు కూడా సాంత్వన కలుగుతుందని ఖైదీల కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. – మల్లీశ్వరి వారణాసి

జైలు సూపరింటెండెంట్ బషీరాబేగంతో ముఖాముఖి…  చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించడం గర్వకారణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ముస్లిం సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన ఓ సాధారణ మహిళ, రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు పొందిన చంచల్‌గూడ మహిళా కారాగారానికి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో అవరోధాలు, వాటిని అధిగమించాను. ఈ ఏడాది రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యాను. తెలిసి చేసిన నేరంతో కొందరు, తెలియక చేసిన తప్పులతో ఇంకొందరు, ఎవరి కారణంగానో దోషి అయినవారు మరికొందరు. ఇందులో సామాన్య జనుల నుంచి రాజకీయ నాయకులదాకా ఎన్నో రకాలవాళ్లుంటారు. వాళ్లందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారిమీద నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నేరస్థులుగా వచ్చిన వారిలో పరివర్తన తేవాలి. ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. ప్రతిరోజూ ప్రతిపనీ కత్తిమీద సాములాంటిదే.

అమ్మ కోసమే చదివాను…
మా నాన్న జల్లపల్లి ఫామ్‌లో అగ్రికల్చరల్ ఫోర్‌మెన్. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం..మా అమ్మ ఎప్పుడూ నాకు కొడుకులు లేరు అంటూ బాధ పడుతూ ఉండేది. అమ్మకు ఆ బాధ లేకుండా చేయాలని చిన్నప్పుడే అనుకున్నాను. ఐదో తరగతి వరకు చదువులో ఫస్ట్ వచ్చాను. మా చిన్నాన్న దగ్గర ఆరో క్లాసు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను. ఏడో క్లాసులో నేను స్కూలు ఫస్ట్ వచ్చాను. స్కూలు యాజమాన్యంవారు నాకు బహుమతిగా వంద రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో ముస్లిం అమ్మాయిలను బయటకు పంపడం అంటే చాలా కష్టం. ఇంత చదువు ఎందుకు పెళ్లి కాదు, సంబంధాలు దొరకవు అంటుండేవారు. కో -ఎడ్యుకేషన్‌లో చదివించడం అంటే అస్సలు ఇష్టపడేవారుకాదు. నాన్నగారు అన్ని సవాళ్లనూ ఎదుర్కొన్నారు. ఎవరు ఏమన్నా నాకవసరం లేదు మా అమ్మాయిని నేను చదివిస్తా అనేవారు. మా అమ్మ కూడా చాలా సపోర్ట్‌గా ఉండేది. వైవాహిక బంధం మరింత ధైర్యాన్నిచ్చింది. నా భర్త అన్నింట్లో తోడుగా నిలిచారు. మా అమ్మాయి డెంటిస్ట్. అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. డిప్యూటీ జైలర్‌గా మొదలైన నా ప్రస్థానంలో ఎక్కడా.. ఎప్పుడూ ఓడిపోలేదు. ఆడపిల్లలకు చదువెందుకు అన్న ఛాందసవాదులే నన్ను ప్రశంసించారు. ఇద్దరు పిల్లలకు తల్లికి కఠోరమైన పోలీస్ ట్రైనింగ్ సాధ్యమేనా అనుకున్నవారే అబ్బురపడ్డారు. బెస్ట్ ఇన్ సబ్జెక్ట్, బెస్ట్ ఇన్ లా, బెస్ట్ ఆల్‌రౌండర్‌గా వచ్చాను. అమ్మ వల్లే ఇదంతా సాధించాను.

బాస్ చెప్పిందే వేదం.. బాస్ ఈజ్‌ఆల్‌వేస్ రైట్ అని ట్రైనింగ్‌లో నేర్పించేవారు. ఆ ఫార్ములా నమ్ముకుంటే ఈ డిపార్ట్‌మెంట్‌లో రాణిస్తారు. నేను దానికి వందశాతం న్యాయం చేయాలనుకున్నాను. సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నాక మహిళా ఖైదీల సంస్కరణ కోసం అనేక ప్రయత్నాలు చేశాం. ఆసక్తి కలిగిన పనిలో వారికి శిక్షణ ఇచ్చి వారికి జైల్లోనే ఉపాధి మార్గం చూపిస్తున్నాం. 2011 నుంచి బేకరీ యూనిట్, గార్మెంట్ యూనిట్, కేండిల్ మేకింగ్, కేటరింగ్ ఇలా అనేక పనుల్లో ఖైదీలకు శిక్షణ ఇవ్వడమేకాకుండా, వారికి రెగ్యులర్‌గా ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నాం. మా పై అధికారుల సహకారంతో ఫండ్స్ తెచ్చుకుని, వారికి ప్రయోజనం కలిగించాం. ఖైదీలందరికీ పని కల్పించాం. ఉపాధి మార్గం చూపించడం ఒక ఎత్తయితే, ఖైదీలందరూ అక్షరాస్యత సాధించడం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. జైల్లో చదువును, శిక్షణను తీసుకున్న ఖైదీలకు విడుదలయ్యాక ఉద్యోగాలను ఏర్పాటుచేశాం. ఖైదీలను తరగతివారీగా విభజించి అక్షరజ్యోతివాళ్లతో కలిసి అక్కడి డైరెక్టర్‌తో మాట్లాడి పుస్తకాలు తీసుకువచ్చి చదివిస్తున్నాం. కారాగారంలో ఉన్న ఖైదీకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ఎంత వెసులుబాటు ఉన్నా వారి మానసిక పరిస్థితి పరిపరివిధాలుగా ఉంటుంది.

అన్ని సందర్భాలలోను ఓపికగా వ్యవహరించాలి. ఎవరినీ నొప్పించకుండా ఉండాలి. ఇలా నిబద్ధతతో డ్యూటీ చేయాలని నా తండ్రి చెప్పిన మాటే పాటిస్తున్నాను. డ్యూటీలోవచ్చే కోపాన్ని, అసహనాన్ని భగవంతుడిని ప్రార్థించి దూరం చేసుకుంటాను. ఎప్పుడూ ఆడవాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకునేదాన్ని. దేవుడు నాకు సరైన ఉద్యోగం ఇచ్చాడు. డిపార్ట్‌మెంట్‌కు వచ్చినందుకు గర్వపడ్డాను కానీ ఎందుకు వచ్చానా అని ఏనాడూ అనుకోలేదు. పై అధికారుల ప్రోత్సాహం, సహకారంతో సుదీర్ఘకాలం డిపార్ట్‌మెంట్‌లో చేసిన కృషికిగాను రాష్ట్రపతి పురస్కారం లభించింది. అవార్డులు బాధ్యతలను పెంచుతాయి. ఖైదీలను మార్చి సమాజానికి వీళ్ల ద్వారా మెసేజ్‌ను అందించడమే మా లక్షం. ప్రతి రంగంలో ఆడవాళ్లు ముందుండాలి. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలి. సామాజిక బాధ్యత తీసుకోవాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి. ఈ ఏడాది రాష్ట్రపతి పురస్కారాన్ని సీఎం చేతులమీదుగా తీసుకోవాలని కోరికగా ఉంది