Home తాజా వార్తలు శాకాహారం ఆరోగ్యకరం

శాకాహారం ఆరోగ్యకరం

 

dietary practices around world

ఆదర్శమైన ఆహారం అంటే తక్కువ తీపి ఉండే పదార్ధాలు ఆరగిస్తేనే జీవితకాలం పెరుగుతుందని అందువల్ల చక్కెర వినియోగం సగానికి సగం తగ్గించాలని, అలాగే మాంసం తినడం కూడా బాగా తగ్గించాలని లాన్సెట్ జర్నల్ కొన్ని సూచనలతో నివేదిక విడుదల చేసింది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, గింజలు వంటివి బాగా తీసుకోవాలని సూచించింది. ఈ ఆహారం ఆరోగ్యకరమే కాకుండా పర్యావరణానికి హితమైనదని నివేదిక పేర్కొంది. ఈట్‌లాన్సెట్ కమిషన్ ఎలాంటి లాభాపేక్ష లేని స్వతంత్ర సంస్థ. 16 దేశాలకు చెందిన 19 మంది శాస్త్రవేత్తలు, 18 మంది సహరచయితలు, ఇందులో ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్యపరమైన లక్ష్యాలను సాధించాలన్న సంకల్పంతో ఈ సంస్థ పనిచేస్తోంది. సగటున వయోజనునికి రోజూ 2500 కాలరీల ఆహారం అవసరమని, బియ్యం, గోధుమ, కాయధాన్యాల నుంచి 800 కాలరీలు సమకూర్చుకోవాలని, పండ్లు కూరగాయల నుంచి 204 కాలరీలు, ఎద్దుమాంసం, గొర్రె, పంది మాంసాల నుంచి 30 కాలరీలు కన్నా ఎక్కువ తీసుకోరాదని లాన్సెట్ నివేదిక సూచించింది. తీసుకునే ఆహారంలో చక్కెర కానీ కొవ్వు కానీ లేకుండా చూసుకోవాలి.

అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ప్రపంచం మొత్తం మీద అనారోగ్యానికి దారి తీస్తుందని అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఏటా 11మిలియన్ అకాల మరణాలను నివారించడానికి దోహద పడుతుందని నివేదిక వివరించింది. ఏయే ఆహారం, ఆహారోత్పత్తుల విధానాలు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్షాలను నెరవేరుస్తుందో పేర్కొంది. మాంసం నుంచి లభించే ప్రొటీన్లకు బదులుగా చిక్కుళ్లు, బఠాణీ వంటి వాటి నుంచి ప్రొటీన్లు లభిస్తాయని, అలాగే ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. సిఫార్సు చేసిన పరిమితి కన్నా 6.5 రెట్లు ఎక్కువగా మాంసాన్ని ఉత్తర అమెరికా దేశాలు ఆరగిస్తుంటాయి. దక్షిణ ఆసియా వారు మాత్రం సిఫార్సు చేసిన దానికి సగం మాత్రమే ఆరగిస్తారు. అన్ని దేశాల వారు పిండి పదార్ధం ఎక్కువగా ఉంటే బంగాళ దుంపలు వంటివి తీసుకొంటుంటారు. సిఫార్సు చేసిన దానికన్నా 1.5 రెట్లు ఎక్కువగా దక్షిణ ఆసియాలోను, సబ్‌సహరాన్ ఆఫ్రికాలో 7.5 రెట్లు ఎక్కువగా తీసుకుంటారు.

ఆహార విధానాల్లో మార్పు అవసరం
ప్రపంచం మొత్తం మీద ఆహార విధానాల్లో మార్పు తప్పనిసరి. 800 మిలియన్ కన్నా ఎక్కువ మంది చాలీచాలని ఆహారంతో సతమతమవుతుండగా చాలామంది అనారోగ్యకరమైన ఆహారాన్ని చాలా ఎక్కువగా తీసుకొంటున్నారు. దానివల్ల వ్యాధులకు గురై అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఆరోగ్యం బాగుండాలంటే కాలరీలు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. వివిధ రకాలైన శాకాహారాన్ని తీసుకోవాలి. జంతు సంబంధ మాంసాహారాన్ని చాలావరకు తగ్గించాలి. కొవ్వు పుష్కలంగా ఉండే పదార్ధాల కన్నా కొవ్వు లేని పదార్థాలను వాడాలి. చక్కెర కలిగినవి, ఎక్కువగా ప్రాసెస్ చేసినవి వాడరాదు. ఈ సూచనల ప్రకారం ఆహార విధానాలు మార్చుకుంటే 10.9 నుంచి 11.6 మిలియన్ అకాల మరణాలను ఏటా నివారించ వచ్చని లాన్సెట్ నివేదిక వెల్లడించింది.
         – సైన్స్ విభాగం

Change in dietary practices around world is essential