Home ఎడిటోరియల్ స్వచ్చ భారత్ తెచ్చిన మార్పు!

స్వచ్చ భారత్ తెచ్చిన మార్పు!

 Swachh Bharat 2011 జనాభా లెక్కల ప్రకారం 32 శాతం గ్రామీణ ప్రజలకు టాయిలెట్ సదుపాయం ఉంది. టాయిలెట్ సదుపాయం ఉన్న చాలా కుటుంబాలు వాటిని వాడడం లేదని కూడా పలు అధ్యయనాలు తేల్చాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల చాలా వరకు పరిస్థితి మారింది. అన్నింటికన్నా ముందుగా చెప్పుకోవలసింది అత్యున్నత అధికార పీఠాలు ఈ సమస్యను సమస్యగా గుర్తించి, పరిష్కారం సాధనపై దృష్టి పెట్టడం చెప్పుకోదగ్గ మార్పు. స్వయంగా ప్రధానమంత్రి ఈ విషయమై మాట్లాడడం వల్ల శ్రద్ధ పెరిగింది.

చెప్పుకోవలసిన మరో ముఖ్యవిషయమేమంటే, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రజల అలవాట్లను మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రజల అలవాట్లలో మార్పు తీసుకురాదలచిన అతిపెద్ద ఉద్యమంగా దీన్ని చెప్పుకోవచ్చు. మూడవ ముఖ్యమైన విష యం, బహిరంగ మలవిసర్జనను నివారించాలన్న సంకల్పం బలపడింది. ప్రజలు టాయిలెట్లను ఉపయోగిస్తున్నారా లేదా, బహిరంగ మలవిసర్జన ఎంత శాతం ఉంది వగైరా లెక్కలను పరిశీలించడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. ఇంతకుముందు కేవలం ఎన్ని టాయిలెట్లు కట్టారన్న లెక్క మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు సమస్యను చూసే దృష్టికోణం కూడా మారింది. ఇప్పుడు బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలెన్ని ఉన్నాయన్న లెక్క తీయడం ప్రారంభించారు. టాయిలెట్లు ఎన్ని కట్టారన్నది ఎంత ముఖ్యమో. ఈ అలవాటును ఎంతవరకు మాన్పించారన్నది కూడా అంతే ముఖ్యం.

నాల్గవ అతిముఖ్యమైన విషయం పారిశుద్ధ్యం పట్ల అవగాహన చైతన్యం పెంచడానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి బడ్జెటును భారీగా కేటాయించడం. అవసరమైన మానవ వనరులను సేకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం. జిల్లాల్లోను, గ్రామాల్లోను ఐదు లక్షల మంది స్వచ్ఛగ్రాహీ కార్యకర్తలను నియమించారు. ఈ స్వచ్ఛగ్రాహీ కార్యకర్తలకు తగిన శిక్షణ లేదన్నది వేరే విషయం. 2014లో ప్రధానమంత్రి చేసిన ప్రకటన ప్రకారం 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాని ఈ దిశగా సాధిస్తున్న అభివృద్ధి చాలా నెమ్మదిగా ఉంది. టాయిలెట్ల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందన్నది నిజమే. అక్టోబర్ 2014 నుంచి అక్టోబర్ 2017 మధ్య కాలంలో 45 లక్షల టాయిలెట్లను డిసెంబర్ 2018 నాటికి 91 లక్షల టాయిలెట్లను నిర్మించారు. మంత్రిత్వశాఖ వెబ్ సైట్ పరిశీలిస్తే ఈ సంఖ్య పెరుగుతూ కనిపిస్తుంది. దేశంలో 6 లక్షల 50 వేల గ్రామాలున్నాయి. అక్టోబర్ 2017 నాటికి 2 లక్షల 43 వేల గ్రామాలు బహిరంగ మలవిసర్జన లేనివిగా ప్రకటించబడ్డాయి. అలాగే 677 జిల్లాల్లో 201 జిల్లాలు ఈ సమస్య లేని జిల్లాలుగా గుర్తింపు పొందాయి. ఐదు రాష్ట్రాలు ఈ సమస్యను తుడిచేసిన రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఆ తర్వాత డిసెంబర్ 2018 నాటికి 5,39,000 గ్రామాలు, 580 జిల్లాలు, 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన అనేది లేనే లేదన్నారు. టాయిలెట్ల నిర్మాణం అనూహ్యమైన వేగంతో కొనసాగింది.

కాని ఈ లెక్కలన్నీ నిజమేనా అనే సందేహం తలెత్తింది. ధృవీకరించుకోడానికి ప్రభుత్వం ఇచ్చే లెక్కలు తప్ప మరో మార్గం ఏదీ లేదు. అయితే ఫలితాలు చూపించాలనే ఒత్తిడి ఉన్నప్పుడు, మంత్రిత్వ శాఖ ఇచ్చే లెక్కలు పూర్తిగా రైటని చెప్పడం కష్టం. ఈ లెక్కలు సరయినవేనని చెప్పే విశ్వసించదగ్గ సర్వే ఏదీ మన ముందు లేదు. జనాభా లెక్కలు 2011 లో చూపించిన లెక్కలను నమ్మవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో జరిగిన జనాభా లెక్కల సేకరణ అది. ఈ లెక్కల ప్రకారం 32 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే టాయిలెట్ సదుపాయం ఉంది. కాని యుపిఎ ప్రభుత్వం అప్పట్లో 72 శాతం కుటుంబాలకు టాయిలెట్ సదుపాయం ఉందని చెప్పేది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే లెక్కలపై పూర్తిగా ఆధారపడలేం. 2012లో ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఆ సర్వే తర్వాత కేవలం 36 శాతం కుటుంబాలకు మాత్రమే టాయిలెట్ సదుపాయం ఉందని తేలింది.

ఇప్పుడు నాలుగు సంవత్సరాల కాలంలో 96 శాతం గ్రామీణ పారిశుద్ధ్యాన్ని సాధించామని మోడీ ప్రభుత్వం చెబుతోంది. 2012 సర్వే ఎన్ని కుటుంబాలకు టాయిలెట్ సదుపాయం ఉందన్న విషయంపై నిర్వహించారు. బహిరంగ మలవిసర్జన గురించిన సర్వే కాదు. 2012లో టాయిలెట్ల కోసం సబ్సిడీ తీసుకున్న వారికి 2014 తర్వాత మళ్లీ ఇవ్వలేదు. దాదాపు 90 లక్షల కుటుంబాలు ఈ విధంగా ఈ కార్యక్రమంలో సబ్సిడీ పొందలేదు. ఎందుకంటే వారికి అంతకు ముందే సబ్సిడీ లభించింది. నిజంగానే అప్పట్లో వారు టాయిలెట్లు కట్టుకున్నారా? అనే ప్రశ్నకు సమాధానం లేదు

మరో ముఖ్యమైన విషయమేమంటే, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు టాయిలెట్ కట్టుకునే సబ్సిడీ అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వడం లేదు. బిపిఎల్ కుటుంబాలన్నింటికీ టాయిలెట్ సౌకర్యం కల్పించారని అనుకున్నా, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న చాలా కుటుంబాలకు టాయిలెట్ లేకపోవచ్చు. నిజం చెప్పాలంటే బిపిఎల్ కుటుంబాల కన్నా దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాల సంఖ్య ఎక్కువ. వీటిలో ఎన్ని కుటుంబాల్లో టాయిలెట్లున్నాయి? 2012లో జరిపిన టాయిలెట్లున్న కుటుంబాల సర్వే ఆధారంగా ఇప్పుడు ఎన్ని కుటుంబాలకు ఈ సదుపాయం కల్పించారో చెబుతున్నారు.

రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ కంపాషనేట్ ఎకానమీ 2018 అధ్యయనం ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 42 నుంచి 57 శాతం ప్రజలు బహిరంగ మలవిసర్జనకే అలవాటు పడి ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో బహిరంగ మలవిసర్జన లేనే లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఈ రిపోర్టుకు పొంతనే లేదు. టాయిలెట్ సదుపాయం ఉన్న కుటుంబాల్లో కూడా కనీసం 40 శాతం కుటుంబాల్లో ఎవరో ఒకరు టాయిలెట్ వాడడానికి బదులు బహిర్భూమికే వెళుతున్నారు. కాని మంచి వార్త ఏమంటే, ఈ నాలుగు రాష్ట్రాల్లో 2014లో బహిరంగ మలవిసర్జన 70 శాతం ఉండగా, 2018 నాటికి 44 శాతానికి తగ్గిపోయిందని ఆ నివేదిక తెలుపుతోంది. ప్రకటిస్తున్న స్థాయిలో స్వచ్ఛ భారత్ మిషన్ విజయాలు సాధించి ఉండకపోవచ్చు. కాని చెప్పుకోదగ్గ మార్పు తీసుకొచ్చింది. ఈ మార్పును కొనసాగించాలి. కేవలం ఫలితాలు చూపించే ఆరాటానికి బదులు నిరంతర ప్రయత్నంతో స్వచ్ఛ భారత్ సాధించే దిశగా అడుగులు వేయవచ్చు.

Change of Swachh Bharat in Country