Home సినిమా చరణ్ అద్భుతమైన నటుడుః పవన్‌కల్యాణ్

చరణ్ అద్భుతమైన నటుడుః పవన్‌కల్యాణ్

pawan

రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం (మోహన్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం విజయోత్సవ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో భాగంగా పాటల ప్రదర్శన జరిగింది. జిగేల్ రాణి… పాటకు రామ్‌చరణ్ సహా యూనిట్ సభ్యులందరూ స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం కొసమెరుపు. ఈ విజయోత్సవ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “కేవలం కలెక్షన్స్‌పరంగానే కాదు… అత్యద్భుతమైన సినిమా ‘రంగస్థలం’. భారతీయ చలన చిత్రసీమలోనే గర్వించదగ్గ సినిమా తీసిన దర్శకుడు సుకుమార్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇలాంటి సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ నవీన్, రవిశంకర్, మోహన్‌లకు నా అభినందనలు. రంగస్థలం సినిమా చూశాను. సినిమా చూస్తున్నప్పుడు రంగస్థలం అనే ఊరిలోకి వెళ్లి అక్కడి ప్రజల మధ్య జరిగిన సన్నివేశాలను ప్రేక్షకుడిలా చూసి వచ్చేశాను. ఇది సినిమాలాగా అనిపించలేదు. నిజ జీవితంలా అనిపించింది. సుకుమార్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు కానీ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు ఆయన. సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు సుకుమార్.  యువతకు ఏం కావాలో తెలిసిన దర్శకుడు, గొప్ప రచయిత. నేను చిన్నప్పటి నుంచి చరణ్‌ను చూస్తున్నాను. నాకు తెలిసిన చరణ్ నేలకు చాలా దగ్గరగా ఉండేవాడు. ఎంత ఎత్తు ఎదిగినా అణిగిమణిగి ఉండేవాడు. నాకు తెలిసి ఈ పాత్ర అతని సహజత్వానికి దగ్గరైన పాత్ర. తను అద్భుతమైన నటుడు. రామ్‌చరణ్‌కు నేను ఓ పెద్దన్నయ్యలాంటి వాడిని. చరణ్, సుస్మిత అందరికీ నేను బాబాయ్ అనడం కంటే అన్నయ్యలా ఫీలవుతా. ఇక చిట్టిబాబు పాత్రలో చరణ్ ఒదిగిపోయి నటించాడు. ఈ సినిమా చూడగానే అతన్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దుపెట్టుకొని అద్భుతంగా నటించావని అన్నాను. ఎన్ని విజయాలు వచ్చినా, అపజయాలు వచ్చినా చరణ్ పెద్దగా పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోతాడు. అతనికి ఇలాంటి విజయాలు ఎన్నో  వస్తాయి. ఇది ఆరంభం మాత్రమే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం బావున్నాయి. ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా ఇది. దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఓ లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప సినిమాను లాస్‌ఏంజిల్స్‌కు షార్ట్‌లిస్ట్ చేయకపోతే ద్రోహం చేసినవాళ్లమవుతాం”అని అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “సుకుమార్ నా ఫేవరేట్ డైరెక్టర్. ‘రంగస్థలం’లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన ఆయనకు నా ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మానాన్నల స్పందనను మరచిపోలేను. అమ్మకైతే మాటలు రాలేదు… కళ్లలో నీళ్లు పెట్టుకొని నా చేయి పట్టుకొని రెండు నిమిషాల పాటు కూర్చోపెట్టుకుంది. అయితే కల్యాణ్ బాబాయి ఈ సినిమాను జనాలతో చూడాలని ఉందని అన్నారు. ఆయన ‘తొలిప్రేమ’ తర్వాత ‘రంగస్థలం’ సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చినందుకు ఆనందపడుతున్నాను. ఈ రెండు స్పందనలను మరచిపోలేను”అని తెలిపారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “సినిమా సక్సెస్ అయినా కాకపోయినా ప్రతి సినిమాలో ఒక సైన్యం ఉంటుంది. అదే డైరెక్షన్ టీమ్. ‘రంగస్థలం’ కథ బాగా రావడానికి కాశీ, ప్రతాప్‌లే కారణం. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత మంచి అవకాశాలు వచ్చినా వెళ్లకుండా ‘రంగస్థలం’పై వర్క్ చేశారు. సినిమాలో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడు. అతని కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోయింది”అని పేర్కొన్నారు. సమంత మాట్లాడుతూ “మా టీం పడ్డ కష్టం నాకు తెలుసు. మేం అనుకున్న దానికంటే ప్రేక్షకులు పెద్ద బహుమతినిచ్చారు. రామలక్ష్మి క్యారెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిట్టిబాబు క్యారెక్టర్ లేకపోతే రామలక్ష్మి క్యారెక్టర్ లేదు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో జగపతిబాబు, అజయ్‌ఘోష్, చంద్రబోస్, ఆది పినిశెట్టి, దేవిశ్రీ ప్రసాద్, అనసూయ, రామకృష్ణ, మోనిక, రత్నవేలుతో పాటు చిత్రబృందం పాల్గొంది.