Home ఆఫ్ బీట్ హాస్యచక్రవర్తి

హాస్యచక్రవర్తి

20వ శతాబ్దంలో అత్యున్నత గౌరవం పొందిన ప్రపంచ కళాకారుల్లో ప్రథముడు చార్లీచాప్లిన్. సాధారణ రీతికి భిన్నంగా,చిత్రంగా ధరించిన దుస్తులతో వంకర టింకర నడకతో, చేతి కర్రతో ఆ పాత్ర చేసే చేష్టలు, చిన్న టోపి, అమాయకంగా మిలమిల లాడే కళ్లు, మాటల ద్వారా కాకుండా, వేషం, మూగనటన ద్వారానే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. నవరసాల్లోని హాస్యాన్నీ, కరుణని సమపాళ్లలో రంగరించి వెండితెర మీద ప్రదర్శించి ప్రేక్షకుల కళ్ల పొరలను తొలగిస్తాడు. అనేక రకాలుగా అందరినీ గలగల లాడిస్తాడు. నవ్వుతో పాటే, ఆ నవ్వు నుండే దుఃఖం అలలుగా పొర్లుతుంది. ఆ వినోదం, ఆ విషాదం రెండూ జీవిత సత్యాలే. అవి జీవితానికి బొమ్మా బొరుసూ లాంటివి.

charles-chaplin

మహానటుడు, హాస్య వినోద చక్రవర్తి చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‌లో జన్మించాడు. అతని తల్లి పేరు హన్నా. ఆమె స్పానిష్- ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి -యూదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు ‘వాడెవిల్’ అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‌లో మ్యూజిక్ హాల్స్‌గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలిచ్చి డబ్బు గడించేవారు.

కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది..సినిమాలలో చాప్లిన్ పొట్టిగా, వికారంగా, విచిత్రంగా కనపడినా చార్లీ అందగాడు. సౌందర్య పిపాసి, జీవన యాత్రికుడు, సత్యశోధకుడు, సాహసికుడు, నిగర్వి, సున్నితహృదయుడు. విశాల దృష్టిగల నాగరికుడు. ఏ దేశమేగినా, ఏ సమాజంలోనైనా లక్షలాది ప్రేక్షకుల అభిమానం పొందాడు. ఇటువంటి వ్యక్తిత్వం గల హాస్య కరుణాన్వితమైన కళాకారుడుగా ప్రపంచ చరిత్రలో చార్లీ చాప్లిన్ తనొక్కడిగానే మిగిలిపోవచ్చు…

రంగస్థలం పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లికి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది, పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలినాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‌లోనో, పార్కులలోనో పడుకునేవాడు. అలా క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ‘From Rags to Riches’ అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హోమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తు వుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత.

అప్పటికే అతడు ఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‌ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలామంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోను ఒక చార్లీ వుండేవాడు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ వుండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్‌తో ఆగిపోలేదు. దానికి మానవతా వాదమనే కొత్త డైమెన్షన్‌ను కల్పించాడు.

ఒక అర్థశతాబ్దానికిపైగా అతడు దేశదేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించాడు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించాడు. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, కరుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాలలో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు.