Home దునియా వారెవ్వా ఏమి రసం !

వారెవ్వా ఏమి రసం !

రాత్రిపూట ఆలుగడ్డ వేపుడు, రసం వండుకుని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి కలుపుకుని తింటే ఆ మజానే వేరు. దీనిముందు ఫైవ్‌స్టార్ హోటల్ ఫుడ్‌కూడా పనికిరాదు. ఇంకెందుకు ఆలస్యం. వెరైటీగా చారు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం..

నిమ్మరసం- కొత్తిమీర చారుCharu

 

కావలసినవి: నిమ్మ చెక్కలు – 2, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, పోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూను, ఎండు మిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – కొద్దిగా, ఉప్పు – తగినంత, నెయ్యి – ఒక టేబుల్ స్పూను.
తయారీ: కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేయించాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు, ఉప్పు, ఇంగువ, పసుపు, నిమ్మ చెక్కలు, కొత్తిమీర ముద్ద వేసి కలియబెట్టాలి. బాగా మరిగాక కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. వేడి వేడి అన్నంలో కలుపుకోవడమే..

బీట్‌రూట్ చారు

కావలసినవి: సన్నగా తరిగిన బీట్‌రూట్ ముక్కలు – అర కప్పు, నీళ్లు – తగినన్ని.
పొడి చేయడానికి:జీలకర్ర – ఒక టీ స్పూను, మిరియాలు – అర టీ స్పూను, ధనియాలు – అర టీ స్పూను, ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి), బీట్‌రూట్ రసం కోసం…చింతపండు – ఒక టేబుల్ స్పూను, నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను, ఆవాలు – అర టీ స్పూను, ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి), కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూను, పసుపు – పావు టీ స్పూను, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
ఎలాచేయాలంటే.. కుక్కర్‌లో బీట్‌రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఉడికించాలి. మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు మిర్చి వేసి కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసి తీసి పక్కన ఉంచాలి. అదే జార్‌లో ఉడికించిన నీళ్లతో కలిపిన బీట్‌రూట్‌ను నీళ్లతో మిక్సీ పట్టాలి. చింతపండు జత చేసి మరోమారు మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపట లాడించాలి. ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేగే వరకు మరోసారి కలపాలి. మసాలా పొడి జతచేయాలి. బీట్‌రూట్, చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి. రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి.

వెల్లుల్లి చారు

కావలసినవి:మిరియాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూను, వెల్లుల్లి – మూడు రెబ్బలు, ఎండు మిర్చి – 2 చింతపండు గుజ్జు కోసం నీళ్లు – అర కప్పు, చింతపండు – ఒక టేబుల్ స్పూను, నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను, ఆవాలు – అర టీ స్పూను, మినప్పప్పు – అర టీ స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి), వెల్లుల్లి రెబ్బలు – 10 (చేతితో మెదపాలి), తరిగిన టమాటా – 1, పసుపు – పావు టీ స్పూను, ఇంగువ – పావు టీ స్పూను, నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు తయారీ: చింతపండు రసం తీసి పక్కన ఉంచాలి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి వేసి మిక్సీ పట్టి (మరీ మెత్తగా ఉండకూడదు) పక్కన ఉంచాలి. టమాటాలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా తొక్కిన వెల్లుల్లి వరసగా వేసి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. టమాటా తరుగు, పసుపు, ఇంగువ జత చేసి, టమాటాలు మెత్తగా ఉడికేవరకు కలియబెట్టాలి. మిక్సీ పట్టిన రసం పొడి జత చేసి బాగా కలపాలి. చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి దించేయాలి.

 

Charu Telangana Recipe