Home తాజా వార్తలు నేటి నుంచి చతుర్వేద సహిత మహారుద్ర సహస్ర చండీయాగం

నేటి నుంచి చతుర్వేద సహిత మహారుద్ర సహస్ర చండీయాగం

MP Santosh Kumar,CM KCR

 

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వేద పండితులతో 300మంది రుత్విక్కులతో నిర్వహించనున్న సిఎం కెసిఆర్

యాగస్థలాన్ని పరిశీలిస్తున్న సిఎం కెసిఆర్, పక్కనే ఎంపి సంతోష్ కుమార్, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి

నేటి నుంచి చతుర్వేద సహిత మహారుద్ర సహస్ర చండీయాగం
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించిన సిఎం కెసిఆర్
ప్రజా ప్రతినిధులు ఆహ్వానితులే
300 మంది రుత్వికులతో ఐదు రోజుల పాటు యాగం
ఈ నెల 25న పూర్ణాహుతి

మన తెలంగాణ / హైదరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 21 నుంచి ఐదు రోజుల పాటు చతుర్వేద సహిత మహారుద్ర సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలుపడి రైతు లు సుభిక్షంగాఉండేలా, తలచిన అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాఘాటంగా కొనసాగేలా, అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా, బంగారు తెలంగాణ కల సాకారం అయ్యేలా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా అమ్మవారి అనుగ్రహం కోసం సహస్ర హోమాలను ముఖ్యమంత్రి చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. యాగశాలల నిర్మాణం, ఐదు రోజుల పాటు జరిగే హోమానికి అవసరమైన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సాయంత్రం దగ్గరుండి పరిశీలించారు. అవసరమైన మార్పులు చేర్పుల గురించి తగిన సూచనలు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ యాగ కార్యక్రమాల్లో 300 మంది రుత్వికులు పాల్గొంటున్నారు.

నాలుగు వేదాల పండితులు ఇప్పటికే చేరుకున్నారు. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, హంపిలోని శృంగేరీ మఠానికి చెందిన ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో యాగం జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. యాగంలో సిఎం దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారని, తొలుత గోపూజ చేసిన తరవాత ప్రధాన యాగం కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపాయి. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్లు, ఆహ్వానితులని తెలిపాయి. ఈనెల 25వ తేదీన పూర్ణాహుతి ఉంటుందని, యాగంలో కర్ణాటక శృంగేరి పీఠం నుంచి యాగానికి వేద పండితులు ప్రత్యేకంగా హాజరవుతున్నారని తెలిపాయి. విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో యాగం ప్రారంభమవుతుందని తెలిపాయి.

యాగశాల పనులను, ఏర్పాట్లను విశాఖ శారదాపీఠ వేద బ్రాహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కర్నాటకలోని శృంగేరీ పీఠాధిపతుల ఆశీస్సులతో శిష్యబృందం ఆధ్వర్యంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని దక్షిణ ద్వారాన్ని ఆనుకుని యాగశాలల నిర్మాణం జరిగింది. యాగంలో 27 హోమగుండాలను ఏర్పాటుచేశారు. ఇదే వ్యవసాయ క్షేత్రంలో మూడేళ్ళ క్రితం ఆయుత చండీయాగం, తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని సిఎం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి కరుణించాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ఈ యాగాన్ని కెసిఆర్ నిర్వహిస్తున్నారు.

Chaturveda Sahitha Maharudra Sahasra Chandiyagam from today