Home జగిత్యాల ధాన్యం తూకంలో మోసం

ధాన్యం తూకంలో మోసం

Cheating in grain Pound
జగిత్యాల: సింగిల్ విండో ఆధ్వర్యంలో తమ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసాలకు పాల్పడి తమకు తీరని అన్యాయం చేశారని, మోసానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ రాయికల్ మండలం ఒడ్డె లింగాపూర్ రైతులు ఆదివారం నిజామాబాద్ ఎంపి కవితను జగిత్యాలలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ, తమ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 36 లారీలు కొనుగోలు చేశారని, అయితే ప్రతి బస్తాకు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేసి తమను నిండా ముంచారని వారు పేర్కొన్నారు. ధర్మాజిపేటలో ఒక్కో బస్తాలో 4 కిలోలు అదనంగా తూకం వేయగా అక్కడి రైతులు మోసాన్ని గుర్తించి బట్టబయలు చేశారన్నారు. అదనపు తూకం జరిగినట్టు సింగిల్ విండో చైర్మన్, సిఇఓలు కూడా ఒప్పుకున్నారని, తూకంలో మోసాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అదనంగా తూకం వేసిన ధాన్యం డబ్బులను తిరిగి రైతులకు అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దాంతో స్పందించిన ఎంపి కవిత రైతులను మోసం చేస్తే సహించేది లేదని, అదనంగా తూకం వేసిన విషయమై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అదనపు తూకం మొత్తానికి సంబంధించిన డబ్బులు రైతులకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.