Home లైఫ్ స్టైల్ సోషల్ మీడియాతో సమస్యలకు చెక్..

సోషల్ మీడియాతో సమస్యలకు చెక్..

ktr1

లీడర్ అంటే తెల్లని బట్టలు వేసుకొని, పెద్దకారులో తిరుగుతూ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉంటారనే అపోహలను పటాపంచలు చేస్తున్నారు కొంతమంది నాయకులు. ప్రస్తుత రాజకీయ నాయకులు సోషల్‌మీడియా ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒకప్పుడు మన సమస్యలు వారితో చెప్పుకోవాల్సి వస్తే వారి ఆఫీసు వైపు నెలలపాటు తిరగాల్సి వస్తుండేది. కాని ప్రస్తుతం వారందరు సోషల్‌మీడియాతో ప్రజల సమస్యలను తెలుసుకొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులను మన దగ్గరకి పంపించి, సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ విషయంలో మన ప్రధాన మంత్రి తరువాత తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె. తారకరామారావు ఉన్నాడు. స్వల్పకాలంలోనే సుపరిచితుడైన మంచి నాయకుడిగా తన ట్విట్టర్ ఖాతాలో మరో విశిష్ట రికార్డును సాధించాడు. అధికారులకు, పార్టీ నేతలకు, కార్పొరెట్ ప్రతినిధులకు, అన్నింటికీ మించి సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు.. వేదికగా ఎంచుకున్న ట్విట్టర్ ఖాతా మిలియన్ మైలురాయిని అధిగమించింది. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య శుక్రవారం నాటికి పది లక్షలు దాటింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, అంతర్జాతీయస్థాయి సంస్థల అధినేతలు, సినీనటులు, వివిధ రంగాల ప్రముఖులు, మరెందరో సామాన్యులు కేటీఆర్ ఫాలోవర్ల జాబితాలో ఉన్నారు. ప్రాంతీయ నేతకు అతితక్కువ కాలంలో ఇంతమంది ఫాలోవర్లు లభించడం ఆయకే సాధ్యమైంది. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఫాలోవర్లకు మిలియన్ థ్యాంక్స్ చెప్పారు. రెండేళ్ల క్రితం ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య కేవలం యాభై వేలే. ప్రస్తుతం ఆ సంఖ్య పది లక్షలకు చేరడం కేటీఆర్ పనితీరుకు నిదర్శనం. తన పరిధిలోని శాఖలకు సంబంధించిన సమాచారం తెలియజెప్పడమే కాకుండా, ఇతరశాఖల్లోని ఆసక్తికరమైన అంశాలను సైతం పంచుకొంటున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, తన పరిధి కాకపోతే వాటిని ఇతరులకు చేరవేయడం వంటివి మంత్రి కేటీఆర్ ప్రత్యేకతలు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఆయనకు ఒక్కట్వీట్ చేస్తే చాలు.. సమస్య పరిష్కారమైపోతున్నది. ఒకవేళ తాను బిజీగా ఉంటే.. ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్లోనే కేటీఆర్ ఆఫీస్ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్‌ను ఏర్పాటుచేశారు. ఆయన ద్వారా సహాయం పొందినవారిలో కేవలం తెలంగాణవారే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలవారు కూడా ఉండటం విశేషం.