Home తాజా వార్తలు చెడ్డీ గ్యాంగ్ అరెస్టు

చెడ్డీ గ్యాంగ్ అరెస్టు

Cyberabad SOT police

 

మన తెలంగాణ/హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఇద్దరిని సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ పరిధిలోని ఇళ్లలో ఎనిమిది దొంగతనాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి రూ.1,375 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కథనం ప్రకారం… గుజరాత్ రాష్ట్రం ధాహోడ్ జిల్లా, జేసవాడ పిఎస్, గర్‌బాడా తాలుకా, మట్వా గ్రామానికి చెందిన హసన్ నర్సింగ్, వినోద్, పంకజ్, చర్‌చోడ గ్రామానికి చెందిన రాజు సావ్‌సింగ్ బారియా, జేసమ్ కలిసి డిసెంబర్ 2017, ఏప్రిల్ 2018, జనవరి 2019లో ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. హసన్ నర్సింగ్, రాజు సావ్‌సింగ్ బారియాను పట్టుకోగా, వినోద్, పంకజ్, జేసమ్ పరారీలో ఉన్నారు.

కేపిహెచ్‌బిలో నాలుగు దొంగతనాలు, నార్సింగిలో ఒక చోరీ చేశారు. నార్సింగి, కెపిహెచ్‌బి కాలనీలో 2019లో దొంగతనానికి పాల్పడడంతో మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు సవాల్‌గా తీసుకుని చెడ్డి గ్యాంగ్ సభ్యులను పట్టుకున్నారు. ఆదివాసీ జాతికి చెందిన వీరు మారుమూల ప్రాంతంలో ఉంటారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేస్తుంటారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి జాసవాడ తానే పిఎస్, ధహోడ్ జిల్లా, గుజరాత్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. అడిషనల్ డిసిపి దయానంద రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్స్ పురుషోత్తం, రమేష్, ఎస్సైలు ఎస్‌కె లాల్ మాధర్, విజయ్, రాజేంద్ర నిందితులను పట్టుకున్నారు.

రైళ్ల లో ప్రయాణం
చెడ్డి గ్యాంగ్ సభ్యులు దేశంలో ఎక్కడ దొంగతనం చేయాలన్నా రైళ్లలో ప్రయాణం చేస్తారు. రాత్రి అయ్యే వరకు రైల్వే స్టేషన్లు స్లమ్ ఏరియాల్లో ఉంటూ తాళం వేసిన ఇళ్లను ఎక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహిస్తారు. సాయంత్రం కాగానే తాళం వేసిన ఇళ్ల సమీపంలోని పొదళ్లలో రాత్రి అయ్యేవరకు ఉంటారు. రాత్రి కాగానే తమ దుస్తులు, చెప్పులు విడిచి నడుము చుట్టూ కట్టుకుంటారు. ఇళ్ల తాళాలను పగుల గొట్టి చోరీకి పాల్పడుతారు. వెంటనే మళ్లీ తెల్లవారు జాము 5 గంటల వరకు పొదల్లో ఉండి తర్వాత ఒక్కొక్కరు అక్కడి నుంచి సమీపంలోని రైల్వే స్టేషన్లు లేదా స్లమ్ ఏరియాకు వెళ్తారు. అక్కడి నుంచి రైల్‌లో పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ఎస్‌ఓటి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. టెక్నికల్, సెల్ సిగ్నల్ ఆధారంగా వారిని పట్టుకున్నారు.

ప్రేయసి, స్నేహితుడే పట్టించారు
ఇద్దరు సభ్యులను ఎస్‌ఓటి పోలీసులు అక్కడి స్థానికుల సాయంతో పట్టుకున్నారు. ఓ దొంగను అతడి ప్రేయసి సాయంతో పట్టుకున్నారు. ఓ పెళ్లికి వస్తున్నట్లు సమాచారం రావడం, మెడలో వెండి గొలుసు ముడివేసి ఉంటుందని చెప్పడంతో ఎస్‌ఓటి పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. మరొకరిని స్నేహితుడికి ఎరవేసి పట్టుకున్నారు. అతడి స్నేహితుడికి ఫోన్ చేసి రప్పించేందుకు యత్నించగా కుదరలేదు. తనకు బదులుగా వేరే వ్యక్తిని పంపించాడు. మరో రోజు అసలు దొంగే ఫోన్ చేయడంతో నేషన్‌ల్ హైవే పై అరెస్టు చేశారు.

Cheddi Gang were arrested by Cyberabad SOT police