Home రాష్ట్ర వార్తలు త్వరలో సర్పంచ్‌లకు చెక్ పవర్…

త్వరలో సర్పంచ్‌లకు చెక్ పవర్…

Cheque power

 

హైదరాబాద్ : రాష్ట్రంలోని సర్పంచ్‌లకు మరో పది రోజుల్లో చెక్‌పవర్ రాబోతున్నది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఈ అధికారం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకే సంయుక్తంగా కల్పించారు. కానీ చట్టం అమలులో కొంత మేర కాలయాపన జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టం ప్రకారం చెక్ పవర్ అధికారాలను గ్రామ కార్యదర్శులకే అప్పగించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వరసగా ఎన్నికలు జరగడం వల్ల సుమారు ఆరు నెలలు పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారని తెలుస్తోంది.

ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ తప్ప మిగిలిన అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావడంతో కెసిఆర్ పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే త్వరగా తమకు చెక్‌పవర్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు సిఎం కెసిఆర్‌ను, రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సిఎం కూడా వెనువెంటనే సుముఖతను కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం స్వయంగా వెల్లడించారు. దీంతో చెక్‌పవర్ కోసం సర్పంచ్‌ల నిరీక్షణ త్వరలో ఫలించబోతోంది.

Cheque power is coming to Sarpanchs