Home జాతీయ వార్తలు ఛీబిఎస్‌ఇ

ఛీబిఎస్‌ఇ

EXAM*పరీక్ష పేపర్ల లీకేజీపై ఢిల్లీలో విద్యార్ధుల నిరసన ప్రదర్శనలు
*సిబిఎస్‌ఇ ఆఫీస్ ఎదుట ధర్నా

న్యూఢిల్లీ : సిబిఎస్‌ఇ ప్రశ్నాపత్రాల లీక్‌పై నిరసనలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, కాంగ్రెస్ యువజన కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులను చివరికి సిబిఎస్‌ఇ పాలక మండలి నిర్లక్ష ధోరణి పూర్తిగా దెబ్బతీసిందని ప్రదర్శకులు మండిపడ్డారు. లీక్‌కు బాధ్యులను గుర్తించి తగు విధంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద కొందరు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనకు దిగారు. ఇక కాంగ్రెస్ యువజన విభాగం అయిన ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శన ఏకంగా కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ నివాసానికి దారితీస్తూ ఉండటంతో వారిని పోలీసులు మధ్యలోనే అడ్డగించారు. ఇక మరో వైపు విద్యార్థుల బృందాలు, ఢిల్లీ పిసిసి ఆధ్వర్యంలో సిబిఎస్‌ఇ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ప్రీత్‌విహార్ ప్రాంతంలో విద్యార్థులు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దేశంలో ఎగ్జామ్ మాఫియా బయలుదేరిందని, అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు ఈ మాఫియా గుప్పిట్లోకి వెళ్లాయని ఎస్‌ఎస్‌యుఐ నేత నీరజ్ మిశ్రా విమర్శించారు. మోడీ ప్రభుత్వం కనుసన్నల్లో ఈ మాఫియా చెలరేగిపోతోందని, పైగా విద్యావ్యవస్థను హెచ్‌ఆర్‌డి మంత్రి, సిబిఎస్‌ఇ ఛైర్‌పర్సన్ తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారని మిశ్రా నిరసన వ్యక్తం చేశారు. జరిగింది కేవలం సాంకేతికపరమైన లోటు కాదని,అంతకు మించిన అక్రమం జరిగిందని, ఇందుకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి జవదేకర్, సిబిఎస్‌ఇ అధ్యక్షులు అనితా కర్వల్ పదవులకు రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. కౌశక్ రోడ్‌లోని జవదేకర్ నివాసం వైపు వెళ్లిన ఎన్‌ఎస్‌యుఐ ర్యాలీని పోలీసులు ఉద్యోగ్‌భవన్ మెట్రో స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. ఎన్‌ఎస్‌ఐయు అధ్యక్షులు ఫైరోజ్ ఖాన్, డియుఎస్‌యు ఉపాధ్యక్షులు కునాల్ షెరావత్ మంత్రిని కలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు వెంట తీసుకువెళ్లారు.
లీక్‌పై జార్ఖండ్ విద్యార్థుల నిర్బంధం
సిబిఎస్‌ఇ పేపర్ లీక్ వ్యవహారంలో ఆరుగురు జార్ఖండ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఛత్రా జిల్లాకు చెందిన విద్యార్థులకు పేపర్ లీక్‌తో సంబంధం ఉందనే కోణంలో సమాచారం అందడంతో వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం మరో పది మందిని ప్రశ్నించారు. బోర్టు పరీక్షల విభాగం కంట్రోలర్‌ను కలుసుకుని పలు విషయాలను రాబట్టుకున్నారు. దర్యాప్తు వేగవంతం అయిందని, పరీక్షల తీరు తెన్నుల గురించి పరీక్షల కంట్రోలర్‌తో మాట్లాడామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక పేపర్ లీక్ అంశం గురించి తెలిపే ఒక కీలక ఇ మొయిల్ తమకు అందిందని సిబిఎస్‌ఇ వెల్లడించింది. దీని గురించి తమకు సిబిఎస్‌ఇ నుంచి వివరాలు అందాయని నగర పోలీసు విభాగం తెలిపింది.

మళ్లీ ఏప్రిల్ 25న పరీక్ష

ఆర్థిక శాస్త్రం సిబిఎస్‌ఇ క్లాస్ 12 రీ ఎగ్జామ్ వచ్చే నెల 25న జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ తెలిపారు. క్లాస్ 1౦ గణితం పేపర్‌కు తిరిగి పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది వచ్చే 15 రోజులలో నిర్ణయిస్తామని వెల్లడించారు. శుక్రవారం స్వరూప్ విలేకరులతో మాట్లాడారు.
పదవ తరగతి పరీక్షలలో లీక్ కేవలం ఢిల్లీ, హర్యానాలకే పరిమితం అయిందని, తిరిగి పరీక్షలు జరిగితే ఈ ప్రాంతాలలోనే ఉంటుందని, ఏది ఏమైనా దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును, తల్లిదండ్రుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు స్వరూప్ వెల్లడించారు. లీక్‌పై రెండు దశలలో దర్యాప్తు చేపట్టినట్లు, ఇందులో పోలీసు బృందాలు ఒకవైపు విచారణలు జరుపుతున్నాయని, మరో వైపు విభాగ అంతర్గత దర్యాప్తు సాగుతోన్నట్లు తెలిపారు. దోషులు వెల్లడైతే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.