Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

న్యాయ వ్యవస్థ మాట నెగ్గింది

Justice of the Orissa High Court Vineet Saran along with Justice Joseph

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.ఎం.జోసఫ్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుపై కేంద్ర ప్రభుత్వ మడతపేచీలు దాదాపు 7 మాసాల అనంతరం పరిసమాప్తమైనాయి. జస్టిస్ జోసఫ్‌తోపాటు ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ న్యాయమంత్రిత్వశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ జోసఫ్ పేరును పునరుద్ఘాటించాక కేంద్ర ప్రభుత్వం గత్యంతరలేని స్థితిలో ఆ సిఫారసును ఆమోదించటం గమనార్హం. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్ (ఇప్పుడు రిటైర్డ్) తదితర ఐదుగురు సీనియర్ జడ్జీలతో కూడిన కొలీజియం జనవరి 10న తేదీన జస్టిస్ కె.ఎం.జోసఫ్, సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేర్లను సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేస్తూ సిఫారసు చేసింది. అయితే మూడు మాసాలపాటు ఫైలును తొక్కిపెట్టిన న్యాయమంత్రిత్వ శాఖ ఏప్రిల్‌లో ఇందూమల్హోత్రాను నియమిస్తూ, జోసఫ్‌కు సీనియారిటీలేదంటూ, ఆయన ప్రమోషన్‌ను పునఃపరిశీలించాలంటూ ఫైలును తిప్పి పంపింది. ఒకేసారి సిఫారసు చేసిన రెండు పేర్లను వేరుచేయటం న్యాయశాఖ తొలి తప్పు.

న్యాయవాది అయిన ఇందూమల్హోత్రా నియామకాన్ని ఆమోదించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోసఫ్ పేరును తిరస్కరించటం మలి తప్పు. దీనివల్ల న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వర్గం (ప్రభుత్వం) మధ్య ఘర్షణ పెరిగింది. జస్టిస్ జోసఫ్ పేరును పునఃపరిశీలనకు పంపటంలో ఏదో దురుద్దేశం ఉందన్న అనుమానాలకు ప్రభుత్వం తావిచ్చింది, ఆరోపణలకు గురైంది. జస్టిస్ జోసఫ్ హైకోర్టు జడ్జీల్లో సీనియర్ కాదని, ఆయన నియామకం ప్రాంతీయ ప్రాతినిధ్య సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని, ఆయన స్వరాష్ట్రం కేరళకు ఇప్పటికే సుప్రీంకోర్టులో తగు ప్రాతినిధ్యం ఉందని ఆయన పేరును తిప్పిపంపటానికి కారణాలుగా న్యాయశాఖ పేర్కొన్నది. ఇది న్యాయశాఖకు న్యాయ వ్యవస్థకు ప్రతిష్టాత్మక సమస్య అయింది. జస్టిస్ చలమేశ్వర్ రిటైర్మెంట్‌కు కొద్ది రోజుల ముందు మే 16న సమావేశమైన కొలీజియం జస్టిస్ జోసఫ్‌పై ప్రభుత్వ వాదనను తిరస్కరించి, ఆయన పేరును తిరిగి పంపాలని నిర్ణయించింది. అయితే ఇతర సిఫారసులతో కలిపి పంపాలని నిర్ణయించటం వల్ల ఇప్పుడు ముగ్గురు జడ్జీల నియామకం ఒకేసారి జరిగింది. సుప్రీంకోర్టుకు నియమించిన తేదీ నుంచి జడ్జీల సీనియారిటీ పరిగణించబడుతుంది. సీనియారిటీ ప్రాతిపదికపై ప్రధాన న్యాయమూర్తి నియామకం జరుగుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జోసఫ్ సీనియారిటీని తగ్గించగలిగింది. కొలీజియం రెండవసారి అదే పేరు సిఫారసు చేస్తే ఆమోదించక తప్పదని తెలిసి కూడా న్యాయ వ్యవస్థను ఒత్తిడి చేయటానికి న్యాయశాఖ ప్రయత్నించింది.

ప్రభుత్వం అంగీకరించకపోవచ్చుగాని జస్టిస్ జోసఫ్‌పట్ల ద్వేషభావంతోనే ఆయన ప్రమోషన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్న భావన ఏర్పడింది. 2016లో ఉత్తరాఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రివర్గాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించటాన్ని జస్టిస్ జోసఫ్ రాజ్యాంగ విరుద్ధంగా తీర్పు చెప్పటంతో రావత్ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టింది. అంతేగాక, జస్టిస్ జోసఫ్‌ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన ఉత్తర్వును కూడా అమలు చేయలేదు.

జస్టిస్ జోసఫ్ నియామకం ఒక్కటే కాదు, హైకోర్టు జడ్జీల నియామకాల విషయంలో కూడా కొలీజియం సిఫారసులను ప్రభుత్వం అనేక మాసాలపాటు తొక్కిపట్టటం, కొన్ని పేర్లను నిరాకరించటంవంటి ఘటనలతో ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ పెరిగింది. పెండింగ్ కేసులు పెరిగిపోతున్న దృష్టా న్యాయమూర్తుల నియామకాన్ని వేగిరపరచాలంటూ (రిటైర్డ్) ప్రధాన న్యాయమూర్తి ఒకరు ప్రధాని పాల్గొన్న సభలో కళ్లనీళ్లపర్యంతం కావటం కేంద్ర ప్రభుత్వం న్యాయ నియామకాల్లో ఆధిపత్యం కొరకు ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో బహిర్గతం చేసింది. న్యాయ నియామకాలకు జుడీషియల్ కమిషన్ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు కొట్టివేసిన దగ్గర్నుంచి రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ ఏర్పడింది. న్యాయ నియామకాలకు సంబంధించిన ‘మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్’ ఆమోదం కూడా ప్రభుత్వం వద్ద అనేక మాసాలుగా పెండింగ్‌లో ఉంది. కిందిస్థాయి జడ్జీల న్యాయశాస్త్ర పాండిత్యాన్ని వారి తీర్పులను బట్టి మదింపు చేయగలిగింది సుప్రీంకోర్టు కొలీజియమేతప్ప ప్రభుత్వం కాదు. అందువల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రతను గౌరవిస్తూ, మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్‌ను సత్వరం ఆమోదించటం అభిలషణీయం.

Comments

comments