Home తాజా వార్తలు పంద్రాగస్టు తర్వాత ప్రజాక్షేత్రంలోకి

పంద్రాగస్టు తర్వాత ప్రజాక్షేత్రంలోకి

Chief Minister KCR who is widely traveling in the state

రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ 

మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన తదితరాలపై నాలుగేళ్ళుగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కెసిఆర్ పంద్రాగస్టు తర్వాత ఇక ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. భారీ స్థాయి బహిరంగసభతో ప్రారంభించి అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకాలం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టగా ఇకపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముందస్తు ఎన్నికలు ఉంటాయా, ఉండవా అనే అంశంతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం గడిపేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. ఐదేళ్ళ కాలంలో లక్షంగా పెట్టుకున్న ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి తదితరాలన్నింటినీ వరుస సమీక్షలు నిర్వహించి ఒక ఇంజినీర్‌గా, ఒక వ్యూహకర్తగా సంబంధిత అధికారులకు, వర్గాలకు ఆదేశాలిచ్చి దాదాపు ముగింపు దశకు వచ్చేంత వర కు పర్యవేక్షించారు. కొత్త పంచాయతీలు ఇప్పటికే ఉనికిలోకి వచ్చేశాయి. మిషన్ భగీరధ మరో పది రోజుల్లో ప్రతీ గ్రామానికి చేరువకానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంవత్సరాంతానికి తొలి దశ పూర్తికానుంది. ఇప్పటికే రెండు పంపులు ట్రయల్ రన్‌లో నడుస్తున్నాయి. తొలి విడత రైతు బంధు విజయవంతంగా పూర్తయింది. రైతుబీమా, కంటివెలుగు తదితరాలను పంద్రాగస్టు రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు. లక్షంగా పెట్టుకున్న పను ల్లో చాలా వరకు ముగిసిపోవడం, మరికొన్ని ముగింపు దశలో ఉండడంతో ఇకపైన అధికారులకు అప్పగించాలనుకుంటున్నట్లు తెలిసింది. ప్రధాన కార్యదర్శి ఇకపైన ఈ పథకాల ముగింపుపై ఎక్కువ సమయాన్ని సమీక్షలు, సమావేశాల కోసం వెచ్చిస్తారని, ఎప్పటికప్పుడు వాటి పురోగతిని తెలుసుకుంటూ తగిన సూచనలు ఇవ్వడంపై సిఎం దృష్టి సారిస్తారని తెలిసింది. ఇప్పటికే పలు సర్వేల ద్వారా వచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఏ జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ వర్గం ప్రజలకు చేరువకావాలి, స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలో ఒక భారీ స్థాయి బహిరంగ సభను అక్టోబరు లేదా నవంబరులో నిర్వహించనున్నట్లు తెలిసింది.

నాడు అభివృద్ధి… నేడు ప్రజాక్షేత్రం :
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా అనేక అంశాలపై రోజుల తరబడి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించిన కెసిఆర్ విద్యుత్ సంక్షోభాన్ని ఆరు నెలల్లోనే పరిష్కరించారని, అది లోతుగా వెళ్ళి అధ్యయనం చేయడం వల్లనే సాధ్యమైందని పార్టీ వర్గాలు గుర్తుచేస్తూ ఇకపైన ఇదే తరహా అభివృద్ధి కోసం మళ్ళీ పార్టీని ప్రజలు గెలిపించేలా రాజకీయ యాత్రలు చేపట్టక తప్పదని నొక్కిచెప్పాయి. తొలి అసెంబ్లీ సమావేశంలోనే అభివృద్ధి కోసం నిరంతర సమీక్షలు చేస్తానని స్వయంగా కెసిఆర్ స్పష్టం చేశారని, అదే తరహాలో నాలుగేళ్ళ పాటు అనేక అంశాలను అధ్యయనం చేశారని పేర్కొన్నాయి. అనుకున్న పనులన్నీ గాడిలో పడ్డాయని, ఇకపైన తదుపరి ఐదేళ్ళ లక్షం కోసం పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించనున్నారని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎలాగూ ఎంపిలంతా వారివారి నియోజకవర్గాల్లో ఉంటారని, శాసనసభ్యులకు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందిగా సూచనలు ఇచ్చారని పార్టీ వర్గాలు వివరించాయి.
స్థానికంగా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ శాసనసభ్యులపై ప్రజల్లో వివిధ స్థాయిలో అసంతృప్తి ఉన్నందున పార్టీ గెలుపుకు ఇప్పుడు కెసిఆర్ పెద్ద దిక్కుగా మారారని, అలాంటి నియోజకవర్గాల్లో ఎక్కువ దృష్టి ఉంటుందని పేర్కొన్నాయి.