Home రాష్ట్ర వార్తలు పగిలిన గాజుబొమ్మలు

పగిలిన గాజుబొమ్మలు

హైదరాబాద్ గాజుల పరిశ్రమలో బీహార్, ఒడిశా బాలల వెట్టిచాకిరీ

Child-Labourహైదరాబాద్ సిటీబ్యూరో: చాప కింద నీరులా హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి పిల్లలను ఢిల్లీ మీదుగా ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ పిల్లల వ్యాపారం వెనుక పాతబస్తీకి చెందిన మాఫియా ముఠా హస్తం ఉంది. పూట గడవని దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన 14 ఏళ్లలోపు పిల్లలను వారు తీసుకువస్తు న్నారు. ఒక్కో పిల్లవాడికి వెట్టి చాకిరి కోసం తీసుకువచ్చే ఏజెంట్లు వారి తల్లిదండ్రులకు నెలకు రూ.500 చొప్పున ఇస్తారు. పాతబస్తీ లోని గాజుల తయారీ పరిశ్రమకు ఈ పిల్లలను అమ్మివేస్తారు.

అక్కడ పిల్లలతో ప్రమాదరక రసాయనాలతో తయారయ్యే గాజుల తయారీలో రోజుకు 12 నుంచి 20 గంటలు పని చేయించుకుంటారు. పిల్లలు అక్కడే తినాలి, అక్కడే పడు కోవాలి, అక్కడే ఉండాలి. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ప్రస్తుతం పాతబస్తీలోని యాకుత్‌పురా, భవానీనగర్, తలాబ్‌కట్ట, బాబా నగర్‌లలోని పదుల సంఖ్యలో ఉన్న గాజుల పరిశ్రమలో సుమారు 1000 మంది కిపైగా వెట్టి చాకిరీలో మగ్గుతున్నారు. గాజుల ఆర్డర్ ఇచ్చే నెపంతో “మన తెలంగాణ” ప్రతినిధి మంగళ, బుధవారాల్లో ఆ పరిశ్రమలకు వెళ్లగా భయంకర వాస్తవాలు వెలుగు చూశాయి.

గత ఏడాది ఇక్కడి పరిశ్రమలో మాఫియా ముఠా చేతిలో ఒడిశాకు చెందిన బాలిక (12) హత్యకు గురైందని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పే ర్కొంది. అయితే ఈ హత్యను సాధారణ మరణంగా తీర్చిదిద్దారని గత ఏడాది కమిషన్ ఆరోపించింది.

ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు…ఢిల్లీలో ‘ఎప్లాయిమెంట్ ఏజెంట్’ పేరుతో నిర్వహిస్తున్న కార్యాలయాల ద్వారా పిల్లల అక్రమ రవాణా సాగుతుంది. ఒకో కార్యాలయంలో 10 మంది ఏజెంట్లు (దళారీలు) ఉంటారు. వీరు బీహా ర్, ఒడిశా రాష్ట్రాలలోని పూటకు గడవని దళిత, గిరిజన కుటుంబాలను ఎం చుకుంటారు. ఒకొక్కరికి (ఆడ, మగ) నెలకు రూ.500 చొప్పున తల్లిదండ్రులకు చెల్లించి పిల్లలను అక్కడి నుంచి ఢిల్లీకి తరలిస్తారు. ఢిల్లీలోని కార్యాలయంలో పిల్లల పేర్లపై నకిలీ ఏజ్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు తీస్తారు. ఆ తరువాత అక్కడి ఏజెంట్లు ఒక్కో పిల్లవాడికి నెలకు రూ.1500 చొప్పున హైదరాబాద్‌లోని గాజుల తయారీ పరిశ్రమల మాఫియాకు విక్రయిస్తారు. హైదరాబాద్‌కు వచ్చే రైళ్లలో దశల వారీగా ఏజెంట్లు ఎషాన్, రుస్తుం, మిస్టర్, లడ్డులు తమ వెంట పిల్లలను తీసుకువస్తారు. ఇక్కడికి చేరుకున్న పిల్లలను పాతబస్తీ మాఫియా లీడర్లు భవానీనగర్, యాకుత్‌పురా, తలాబ్‌కట్ట, బాబాన గర్‌లోని రహాస్య ప్రదేశాలలో ఉన్న గాజుల పరిశ్రమలలోకి తరలిస్తారు.

చచ్చినా..బతికినా అక్కడే…బీహార్, ఒడిశా నుంచి వెట్టి చాకిరీకోసం ఇక్కడికి చేరుకున్న పిల్లలు 24/7 రోజులు గాజుల పరిశ్రమలోనే ఉండాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలి. పరిశ్రమ గేటుకు బయటి నుంచి తాళం వేస్తారు. లోపల మాత్రం పిల్లలతో మొదటి, రెండు, మూడో అంతస్థులో పనిచేయిస్తుంటారు. పిల్లలు పరిపోకుండా బయట కాపాలగా మాఫియా ముఠాకు చెందిన ప్రత్యేక బృందాలు ఉంటాయి. పిల్లలకు జ్వరం, దగ్గు ఏదైనా జబ్బు చేసినా డాక్టర్ వద్దకు తీసుకెళ్లరు. అక్కడే చిట్కా వైద్యం చేస్తారు. సలసల మరుగుతున్న లక్కపై ఈ చిట్టి చేతులతో రంగురాళ్లు, పూసలు, చెమికిలు అద్దుతారు. ఏ మాత్రం తేడా వచ్చినా వారి చేతులు కాలకమానవు.

ఉదయం 6 గంటలకే వారిని నిద్ర లేపుతారు. 6.30కు అల్పాహారం పెడుతారు. 7 గంటలకే వారితో పనిచేయిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు భోజనం పెడతారు. 1.30 గంటలకు తిరిగి పనిలో చేరాలి. రాత్రి 9 గంటలకు భోజనం పెడతారు. ఆ తరువాత కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు పనిచేయిస్తారు. ఈ రకంగా రోజుకు వారిచే 12 నుంచి 20 గంటలు పనిచేయిస్తారు. తల్లిదండ్రులతో ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వరు.

చిన్నపాటి గదులలో పందుల్లా పిల్లలను కుక్కుతారు. సరైనా సౌకర్యాలు ఉండవు. ఎదురు తిరుగుతే వాతలు పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వారి ఆరాచకాలకు పిల్లలెవరు కూడా ఎదురు తిరగరు. కాగా సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ కార్డన్‌సర్చ్ పేరుతో గతంలో ఇక్కడి గాజుల పరిశ్రమలలో మగ్గుతున్న వేలాది మందిని విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. అయినా పిల్లల అక్రమ రవాణా ఏ మాత్రం ఆగలేదు. తిరిగి మళ్లీ ఈ దందా పుంజుకుంది. ఈ పరిశ్రమల వారు నెలనెల పోలీసులకు మామూళ్లు కూడా ఇస్తుండడం వల్లనే పిల్లల అక్రమ రవాణా జోరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.