Home లైఫ్ స్టైల్ బాలల ప్రపంచం మా మంచి పుస్తకం

బాలల ప్రపంచం మా మంచి పుస్తకం

Books-image

వాళ్లిద్దరిదీ బాలల ప్రపంచం. ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేశారు.ఎక్కువగా సంపాదించాల్సిన అవసరం లేదు కనీస అవసరాలు తీరితే చాలనుకున్నారు. సాధ్యమైనంత వరకూ మంచిని పంచాలనుకుని పిల్లలకు బాల సాహిత్యం అందిస్తున్నారు. చందమామ కథలు, రాజుగారి జున్నుముక్క, ఒకవేసవిరోజు, సాహసం, ఒకే మనుషులు ఒకే రక్తం వంటి నైతిక విలువల కథలను పుస్తకాల రూపంలో అందిస్తూ , పిల్లలను పుస్తకాలతో స్నేహం చేయిస్తున్నారు. చినప్పటి నుండి పిల్లలకు సమాజం మీద అవగాహన కల్పించాలని , ఎన్నో రకాల గమ్మత్తైన సరదా పుస్తకాలను పాఠశాలలకు, లైబ్రరీలకు అందిస్తునారు. చిట్టిపొట్టి పిల్లల కథల మా “మంచి పుస్తకం” గురించి సురేశ్, భాగ్యలక్ష్మీ దంపతులు సకుటుంబంతో ముచ్చటించారు.

కుటుంబ నేపథ్యం..?
సురేష్: మాది కృష్ణా జిల్లా కురుమద్ దాలి, అమ్మనాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు అన్నా, చెల్లె ఉన్నారు. మాది వ్యవసాయ కుటుంబం. ఎమ్‌ఎస్‌సి అగ్రికల్చర్ చదువుకున్నాను. మధ్యప్రదేశ్ లోని కిశోర్ భారతిలో కొంతకాలం పని చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చి 198990 లో ఈనాడు పత్రికలో రైతేరాజు అనే కాలానికి జర్నలిస్టుగా పనిచేశాను. 1992 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, 2006 లో ఉద్యోగం మానేశాను…

పి.భాగ్యక్ష్మి: మా నాన్న ఉపాధ్యాయుడు.చాలా పుస్తకాలు కొనేవారు. చిన్నప్పుడు సంచార గ్రంథాలయం అని విశాలాంధ్ర పుస్తకాలు అమ్ముతూ వ్యాన్‌లు తిరిగేవి. సోవియట్ బాల సాహిత్యం పెద్ద పెద్ద బొమ్మలతో ఉండేది. పత్రికల్లో బాలల పేజీ ఉండేది. అవి బాగా ఆసక్తిగా చదివే అలవాటు ఉంది. ఊర్లో గ్రంథాలయం ఉండేది. పిల్లలందరం కలిసి పుస్తకాలను మార్చుకుని చదువుకునే వాళ్లం. నవల, సీరియల్స్ లాంటివి సరదాకి చదువుకునే వాళ్లం. దాంట్లో“ఒకే మనుషులు ఒకే రక్తం” లాంటి కథలు చాలా బాగుండేవి. అలా చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. కొంత కాలం టీచర్‌గా పని చేశాను. ఇప్పుడు మా అమ్మకి 75 సంవత్సరాలు. ఇంకా ఆసక్తిగా పుస్తకాలు చదువుతుంది. మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. సంప్రదాయ వివాహం కాదు.

ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి బాలల సాహిత్యం కోసం కృషి చేయాలనుకున్నారెందుకు …
సింపుల్ లైఫ్‌స్టయిల్ మాది. ఆస్తి పెంచుకోవాలనే భావన లేదు. సంపాదించాలనుకోవట్లేదు. మా జీవితంలో నచ్చిన పని చేయాలనుకున్నాం. స్వలాభం, వ్యక్తిగతం కోసం కాకుండా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాం. మాకు డబ్బుని వృథాగా ఖర్చు చేసే అలవాటు లేదు. ఖర్చు ఎక్కువగా లేనపుడు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంటుంది. అందుకే ఉద్యోగం చేయడం అంత అవసరం అనిపించలేదు. ఉద్యోగం వదిలేశాను. జీవితాలను త్యాగం చేసిన వారున్నారు. అలాంటి వాళ్లతో పోల్చితే మేము చేసేది తక్కువే. పెద్దవాళ్ల కోసం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లాంటి సంస్థల నుండి చాలా రకాల సాహిత్యం వస్తుంది. కాని పిల్లలకు ప్రత్యేకంగా పుస్తకాలు రావటం లేదనే ఉద్దేశంతో ఇప్పుడున్న “మలుపు” పబ్లికేషన్ బాల్‌రెడ్డి కావ్యపబ్లికేషన్ సుబ్బయ్య మేము ముగ్గురం ఉద్యోగాలు చేసుకుంటునే, 1989 లో బాల సాహితీ సంస్థను స్థాపించాం. బుక్ లవర్స్ మెంబర్ షిప్ పెట్టి నడిపించాం. 40 పుస్తకాలు వేశాం. నిజానికి మంచి పుస్తకం స్థాపించడానికి ముందు అమ్మకాలు ఎక్కువగా ఉండేవి కావు. కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని ఎక్కువ కాలం నడిపించలేక పోయాం. తరువాత కాలంలో 2001 మంచి పుస్తకం, పుస్తకాలతో స్నేహం పేరుతో 6 నుండి 7 వందల పుస్తకాలు వివిధ సంస్థల నుండి తెచ్చి విశాలాంధ్ర లాంటి సంస్థలతో కలిసి పుస్తక ప్రదర్శనశాలలో అమ్మేవాళ్లం. మంచి పుస్తకం సంస్థ తరుఫున మొదటిగా 2003లో “విజయధ్వజం” అనే పుస్తకాన్ని ముద్రించాం. 2004 నుండి ప్రత్యేకంగా మంచి పుస్తకం సంస్థను నడిపిస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ప్రతి బుక్ ఎగ్జిబిషన్ లో మా స్టాల్ ఉంటుంది.

ఎలాంటి పుస్తకాలు వేస్తారు…

కథల గురించి పిల్లలకు ఫ్రెండ్లీగా హాయిగా పెద్ద అక్షరాలు, బొమ్మలతో, వయసును బట్టి పిల్లలు ధారాళంగా చదువగలిగేలా, పాఠకులకు అనువైన పుస్తకాలను ముద్రిస్తాం. పిల్లలకు నైతిక విలువల్ని మంచి సమాచారాన్ని అందించాలనుకున్నాం. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆ కథలు చదివితే, ఆ కథలోని పాత్రలు మనుషుల స్వభావాలు, అనుభవాలు, మనసుల్ని కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయి. కథలోని కొన్ని పాత్రలు మనకు ఎన్నో కొత్త ఆలోచనకు బీజం పోస్తూంటాయి. మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి కథలు చదవడం వల్ల ఎప్పుడో ఒకసారి నిజ జీవితంలో అలాంటి సందర్భం వచ్చినపుడు ఆ దృశ్యం మన కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. ఆ కథలోని సారాంశాలు, కొన్ని సందర్భాల్లో మనల్ని సమయానుకూలంగా చైతన వంతుడిగా, మేధావిగా నిలబెడతాయి. 6070 ల నాటికి ప్రపంచ బాలల సాహిత్యం తెలుగులోకి వచ్చింది. మేము ఎక్కువగా రష్యా, సోవియట్ పుస్తకాలను తెలుగు లోకి అనువదిస్తాం. తెలుగును అంటరానిదిగా చూసేవాళ్లు ఇప్పటికీ లేరని చెప్పలేం. భాష నేర్పటం వేరు. మాధ్యమం వేరు. తెలుగు ఇంగ్లీషు రెండు నేర్పించాలి. కాని ఆంగ్లాన్ని భాషగా నేర్పించాలి. చిన్నప్పటి నుండి పిల్లలు కథలు చదవటం వల్ల వారికి నిజజీవితంలో కథలు మంచి గుణాన్ని అలవాట్లను మంచిచెడుల తేడాలను తేలియజేస్తాయి. రాజుగారి జున్నుముక్క, చందమామ కథలు, అనగనగా కథలు, ఒక వేసవి రోజు, సాహసం లాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి.

ఎన్ని పుస్తకాలు ముద్రించారు…
మంచిపుస్తకం తరుఫున ఇప్పటి వరకూ 200 పైగా పుస్తకాలను ముద్రించాం. మేము ముద్రించిన కథలలో ఎక్కువగా టాల్‌స్టాయ్ కథలు 6 వేల నుండి 7 వేల కాపీలు అమ్ముడుపోయాయి. టాల్‌స్టాయ్ చెప్పిన మాట ఒకటి పిల్లలకు కథల్లో చివరగా నీతి ఏంటో రచయిత చెప్పకూడదు. కథలో నీతి ఏంటో వాళ్లే తెలుసుకునేలా రాయాలి. పిల్లల బాలసాహిత్యం కోసం మేము చేస్తుంది చాలా తక్కువ. మా పని పుస్తకాలు ముద్రించటమే కాని ఆ పుస్తకాలను చదివించటం పిల్లలకు చేరువయ్యేలా చేసేవాళ్లది గొప్పతనం. మేము మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచడం వీలైతే ఎవరైనా మమ్మల్ని పిల్లలకు కథలు ఎలా చదివి వినిపించాలో చెప్పడానికి రమ్మని పిలిస్తే లైబ్రెరీలకు సూళ్లకు వెళ్లి కథలు చదివి వినిపిస్తాము. ప్రతి సంవత్సరం 300 నుండి 450 స్కూల్స్ మా దగ్గర పుస్తకాలను తీసుకుంటున్నాయి. బ్రీడ్ సొసైటి వాళ్లు తీసుకుంటారు. కస్తూర్బా పాఠశాలలకి పంపిస్తాం. చాలా రకాల ఆర్డర్స్ వస్తుంటాయి. మా కథలు చదివి పెరిగిన పిల్లలున్నారు. వారు అప్పుడప్పుడు వచ్చి ఇంకా కథలు చదువుతుంటారు. పుస్తకాలను అమ్మడమే కాదు. ఎవరైనా వచ్చి మా పుస్తకాలతో స్నేహం చేయవచ్చు మా ఆఫీసుకి వచ్చి కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. ఎక్కువగా సోవియట్ పుస్తకాలను అనువాదం చేస్తాం. బొమ్మలు బాగుంటాయి. ఇంకా సైన్స్ , జానపదాల గురించి చాలా రకాల పుస్తకాలను పిల్లలకు అందిస్తున్నాం. పిల్లల శారీరక వేధింపుల గురించి కూడా పుస్తకాలతో అవగాహన కల్పిస్తున్నాం. వయస్సుకు మించి పుస్తకాలను చదవకూడదు. ఎవరి వయస్సుకు తగ్గట్లుగా వారు పుస్తకాలను చదవాలి.పిల్లలు ఒత్తిడికి లోనవకుండా జాగ్రత్తపడాలి. చిన్నారులు చదివే కథలు వారిలో కొత్త ఆలోచనలకు బీజం వేయాలి. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉన్నదాంట్లో వారికి ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పెద్దలదే.

                                                                                                                                 – బి. శ్రీనివాస్