Home లైఫ్ స్టైల్ మాట వింటే మెచ్చుకోండి..!

మాట వింటే మెచ్చుకోండి..!

Children face many difficulties in society

బుద్ధిమాంద్యం లోపాలు ఉన్న పిల్లలు సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యక్తిగత అభిప్రాయాలను తెలియపరచలేరు. చెప్పిందే మళ్లీ చెప్పటం లాంటివి చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ ఈ వ్యాధి గల వారి లక్షణాలు, వాటి తీవ్రత ప్రధానంగా మూడు విధాలుగా వ్యాపించి ఉంటుంది. ఆటిజం రుగ్మత కలిగిన ప్రతి పిల్లవాడు వింత ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటాడు. వారి ప్రవర్తన అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్న టీనేజర్లు, పిల్లలు ఉన్న కుటుంబాలలో తీవ్ర వ్యాకులత ఉంటుంది. వారి కుటుంబసభ్యులు ఈ పిల్లలను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతుంటారు. బుద్ధిమాంద్యం బారిన పడిన పిల్లలను పెంచడం ఆ తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతుంది. ఆ పిల్లలను అర్థం చేసుకోవడం కష్టంసాధ్యంగా మారుతుంది. వారి పెంపకంలో అనేక ఆటంకాలను ఎదుర్కొంటారు.
ఆటిజం ఉన్న టీనేజర్స్‌లో, చిన్న పిల్లల్లో ఉన్న లక్షణాలు …
పిల్లలందరూ తల్లిదండ్రులకు ఒక్కొక్కసారి సవాలుగానే మారతారు. కానీ ఎఎస్‌డి (ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ )ఉన్న పిల్లలు మిగతా అందరి పిల్లల కంటే ఎక్కువగా సమస్యలు సృష్టిస్తారు. ఏదైనా అడిగినప్పుడు నిర్లక్షంగా ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు. ఇతర పిల్లలను కొరకటం, గిల్లటం, ఇతరుల జుట్టు లాగడం లాంటివి చేస్తూ ఉంటారు. దూకుడుగా ఉండి కుయుక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు. బహిరంగ ప్రదేశాలలో దుస్తులను విప్పేయడం, ఇతరులను కొట్టటం లాంటివి చేస్తూ ఉంటారు. లేనిపోని అబద్ధాలు చెబుతూ దూకుడుగా ప్రవర్తి స్తూ ఉంటారు. వారికి వారే చేతితో కొట్టుకోవడంం, ఎత్తైన ప్రదేశాలు ఎక్కటం, కాళ్ళు కొట్టుకోవడం లాంటి వింత ధోరణులు ప్రదర్శిస్తూ ఉంటారు.
ఎఎస్‌డి ఉన్న పిల్లల స్వభావం…
వారు ఏమి చెబుతున్నారో వారికే అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. వారి చుట్టూ ఏమి జరుగుతోందో కూడా వారికి అర్థం కాని పరిస్థితి. వారి లోకంలో వారుంటారు. మిగతా వారితో ఎటువంటి సంబంధాలు ఉండవు. చాలా ఆతృతగా ఉంటారు. వారికి ఏమి అవసరాలు ఉన్నాయో చెప్పటం తెలీదు. దాంతో నిరాశకు, కోపానికి ఎక్కువగా లోనవుతారు. పిల్లలకు ఇలాంటి అసహజ ప్రవర్తన రావడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఎఎస్‌డి తో తరచుగా బాధపడే వారికి రోజువారీ పనులలో ఏమైనా మార్పులు వస్తే తరచుగా నిరాశకు గురవుతూ ఉంటారు. ఉదాహరణకి వారి క్లాసు టీచరు మారినా లేదా ఇంటిలో వారు నిద్రించే స్థలం మారినా వారు నిరాశకు గురవుతూ ఉంటారు. వీరు ఒక పని నుండి ఇంకొక పనిలోకి తరచూ మారుతూ ఉంటారు. సంపూర్తిగా ఒక్క పని కూడా నిలకడగాపూర్తి అయ్యేంతవరకు చేయలేరు. ఎఎస్‌డి సమస్యతో ఉన్న వారికి వినికిడి సమస్య ఉంటే దగ్గరగా వచ్చి వింటారు. ఇంకా చూపు సమస్య ఉంటే మరీ దగ్గరగా వెళ్లి చూడటం లాంటివి చేస్తారు. ఇలాంటి సున్నిత సమస్యలున్నవారు వారు అనుకున్నట్టు ఇవతలి వారు అనుమతించకపోతే తట్టుకోలేరు. ఏదైనా ఎక్కువ శబ్దం వచ్చినా, వారు అనుకున్నదానికంటే అత్యధికంగా ఉండి ఏమైనా జరిగితే ఆందోళన చెందుతారు. వీరు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఎఎస్‌డి ఉన్న పిల్లలు కనుక నిరాశకు గురైతే వారిలో ఉన్న నైపుణ్యం తగ్గిపోతుంది. ఏదీ తినకపోవటం, రాయకపోవటం, వారంతట వారు పనులు చేసుకోకపోవటం చేస్తారు.
ఎఎస్‌డి ఉన్న పిల్లలకి ఎక్కువగా నిద్రకి సంబంధించిన సమస్యలు వస్తాయి. వాళ్లు సరిపడినంత నిద్ర లేకపోతే పగటిపూట వారిని అదుపులో పెట్టటం కష్టమవుతుంది. ఏ రకమైన బట్ట లు వేసినా ఇష్టపడరు, తడిగా ఉన్నాయని, బిగుతుగా ఉన్నాయని ఫీలవుతూ ఉంటారు. త్వరగా అనారోగ్యంబారిన
పడతారు.
ఎఎస్‌డి ఉన్నవారిని ఎలా చూసుకోవాలి…
మొట్టమొదటగా ఇలాంటి ప్రవర్తన రావడానికి కారణమేంటి? మీ పిల్ల/పిల్లవాడు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. దానికై కింది చూపిన ఎ,బి,సి నియమాలను
అనుసరించాలి.
ఎ.యాంటిసిడెంట్స్ : ఇవి ప్రవర్తనకి కారణాలు.
బి. బిహేవియర్ : ఆ పిల్ల/పిల్లవాడు వీటికి స్పందించాలి.
సి. పరిణామాలు లేదా ‘బహుమతులు’: వాళ్ల ప్రవర్తని మార్చటానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి పిల్లలు మొబైల్ కావాల ని అరిచినప్పుడు అనుమతించటం లాంటివి. కాబట్టి ఎఎస్‌డి సమస్య ఉన్న పిల్లలను వారి ప్రవర్తనా తీరును మార్చటం ద్వారా కానీ, లేదా వారి ప్రవర్తన మార్చుకుంటే కనుక బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని మార్చవచ్చు.
1.ప్రవర్తనను తెలుసుకోండి
2.వారికి ఎటువంటి బహుమతులు ఇవ్వాలో నిర్ణయించుకోవటం
3.బహుమతులను మారుస్తూ పిల్లలలో మార్పులు తేవటం చేయాలి.
వారితో పనులను చేయించేటప్పుడు..
చిత్రాలద్వారా వారికి ఒక ప్రణాళికా బద్ధంగా పనులను అప్పగించాలి. వారిని మానసికంగా రోజువారీ పనులు చేయడానికి సిద్ధం చేయాలి. క్రమంగా వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించండి. మీరు పిల్లలతో స్పష్టంగా మాట్లాడాలి. వారిముందు అబద్ధాలు చెప్పవద్దు. మీరు ఏదైనా విషయం చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటున్నారా లేదా గమనించండి.
ఒకసారి ఒక అభ్యర్థనను మాత్రమే చేయండి. వారికి అర్థమయ్యే గుర్తులు, భాష, బొమ్మలతో మాట్లాడండి. వారికి ఏమి కావాలో అడగడం ఎలానో నేర్పండి.కష్టతరమైన పరిస్థితులలో ఎలా వారితో ఉండాలో ముందరే ఒక ప్రణాళిక వేసుకోండి. వారు ఏదైనా ఎదురు చెబుతున్నారు అనిపిస్తే నెమ్మదిగా పట్టించుకోనట్లు ఉండండి. వారు మీ మాట వింటే వారిని మెచ్చుకోండి, సానుకూలంగా స్పందించి ప్రతిఫలాన్ని వారికి ఇవ్వండి.
చికిత్సా పద్ధతులు
ఆటిజం ఉన్నపిల్లలకి చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
1. బిహేవియర్ థెరపీ.
2. డిస్‌క్రీట్ ట్రయల్ ట్రైనింగ్ (డిటిటి)
3. పిఇసిఎస్ (పిక్చర్ ఎక్సేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్)
4. పాజిటివ్ బిహేవియర్ సపోర్టు
5. ఎబిఎ థెరపీ