Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘చిలుకూరు బాలాజీ’ టూర్ ప్యాకేజీ

Chilkur Balaji Temple

చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి విననివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండీ చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.  ఒక పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది. టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు – తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరుస్తాడని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు.

ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరు పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు అని పురాణాలు చెబుతున్నాయి.

చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని దర్శించే భక్తులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చింది. ‘చిలుకూరు బాలాజీ దర్శన్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్యాకేజీ ద్వారా ఒక రోజులో చిలుకూరు ఆలయంతో పాటు మృగవని నేషనల్ పార్క్, లోటస్ పార్క్‌లను చూసిరావచ్చు. మధ్యాహ్నం భోజన ఖర్చు కూడా పర్యాటక శాఖదే. ఈ ప్యాకేజీ ద్వారా ఏసీ లేదా నాన్ ఏసీ బస్సును బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఏసీ బస్సులో వెళ్లేందుకు పెద్దలకి రూ.700, పిల్లలు రూ.560 చెల్లించాలి. నాన్ ఏసీ బస్సుకు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.450 చెల్లించాలి. ఈ బస్సులు రోజూ హైదరాబాద్‌లోని పర్యాటక శాఖ కార్యాలయం నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి, రాత్రి 9 గంటలకు తిరిగి వస్తాయి.

Comments

comments