Home రాష్ట్ర వార్తలు కెడిఎక్స్‌తో ఎంఒయు

కెడిఎక్స్‌తో ఎంఒయు

ktrరాష్ట్రంలో త్రీడీ మొబైల్ తయారీకి ముందుకొచ్చిన చైనా సంస్థ
హైదరాబాద్: హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కెడిఎక్స్‌తో తెలం గాణ ప్రభుత్వం ఒక ఎంవోయూను కుదుర్చు కుంది. కెడిఎక్స్ సంస్థ చైనా దేశంలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కావడం గమనార్హం. బేగం పేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల యంలో ఐటి శాఖ మంత్రి కె.తారకరామా రావు సమక్షంలో శుక్రవారం కెడిఎక్స్ సంస్థ ఈ ఎంవోయూను కుదుర్చుకుంది. ప్రపంచంలో కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను తయారు చేసే ఏకైక సంస్థ కెడిఎక్స్ అని, ఈ సంస్థ ఇప్పటికే ఇలాంటి సదుపాయం కల్గిన మొబైల్ ఫోన్ తయారు చేసిందని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. దీంతో పాటు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల తయారీ రంగంలోనూ కెడిఎక్స్ ప్రముఖ సంస్థగా ఉన్నదని, తమ సంస్థ ఫిలిప్స్, డాల్బీ 3 డి వంటి ప్రముఖ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థలతోనూ కలిసి పని చేస్తుందని ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు.వినోద పరిశ్రమ అవసరాల కోసం వాడే ఫిల్మ్ తయారీలో ప్రపంచ నంబర్ వన్ సంస్థ 3 M కంపెనీ తర్వాతి స్థానంలో తాము ఉన్నట్లు మంత్రికి తెలిపారు. గత ఏడాదిలో తమ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల రెవిన్యూని సాధించిందని, గ్రూప్ విస్తరణలో భాగంగా తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. మంత్రితో సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు నగరంలో అందుబాటులో ఉన్న మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కెడిఎక్స్ తో పాటు ఎంవోయూ భాగస్వామి అయిన ERIES EPICA గ్రూప్‌కి 15 దేశాల్లో 45 కంపెనీలు ఉన్నాయని తెలిపింది. కెడిఎక్స్- ఇరిస్ ఏపికా జాయింట్ గ్రూప్ భాగస్వామ్య సంస్థ తెలంగాణలో అందుబాటులో ఉన్న నిపుణులు, ఐటి పరిశ్రమ ముఖ్యంగా కనెక్టివిటి సౌకర్యాల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఎంచుకున్నట్లు తెలిపింది. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటి పార్కులు, ఐటి సెజ్‌లు సైతం తమ భవిష్యత్తు పెట్టుబడులకు ఊతం ఇస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణలో అద్దాలు లేని 3 డి తెరలు, మొబైల్ ఫోన్లు, టివి వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను తయారు చేయనున్నట్లు ఆ రెండు సంస్థలు ఎంవోయూలో పేర్కొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ భాగస్వామ్యం ద్వారా పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్ధమని తెలిపాయి. ఎలక్ట్రా నిక్స్, గేమింగ్ కంటెంట్, మొబైల్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లోని ప్రముఖ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోవడం పట్ల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం వలన అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు నగరానికి వస్తున్నాయని, ఇదే వరుసలో కెడిఎక్స్ తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నదని మంత్రి తెలిపారు. కెడిఎక్స్ పెట్టుబడులకు హైదరాబాద్ సరైన గమ్యస్థానమని పేర్కొన్న మంత్రి కెటిఆర్, కంపెనీ సేవలకు కావాల్సిన మొబైల్స్ మ్యానిఫాక్చరింగ్ సదుపాయాలు, గేమింగ్ మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ మ్యానిఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ మొబైల్ మ్యానిపాక్చరింగ్ పాలసీ ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఇక వినోద పరిశ్రమ కోసం గేమింగ్ సిటీ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతున్నదని, దేశంలోనే రెండో అతిపెద్ద సినిమా పరిశ్రమ తెలుగేనని కెడిక్స్ ప్రతినిధులకు మంత్రి కెటిఆర్ తెలిపారు.
కెటిఆర్‌కు మొబైల్ బహూకరణ
ప్రపంచంలోనే మొదటిసారి త్రిడి తెరతో మొబైల్ తయారు చేస్తున్నామన్న కెడిఎక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు తమ నూతన మొబైల్ ఫోన్ (మార్కెట్‌లోకి ఇంకా విడుదల కాలేదు)ను బహూకరించారు. అందులో ఉన్న త్రీడీ వీడియోలను ఎలాంటి కళ్లద్దాలు లేకుండానే చూడొచ్చని వారు మంత్రికి తెలిపారు. కెడిఎక్స్ సంస్థ రూపొందించిన మొబైల్‌ను వీక్షించిన మంత్రి కెటి ఆర్ వారి ప్రొడక్ట్ విజయవంతం అవుతుందని అభిలషించారు. అంతే కాకుం డా ఇలాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే కెడిఎక్స్ సంస్థకి పూర్తి సహాయ సహకారాలుంటాయని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎమ్‌డి వెంకట నర్సింహారెడ్డి, ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ పాల్గొన్నారు.