Home అంతర్జాతీయ వార్తలు చైనా పనికిమాలిన అభ్యంతరం

చైనా పనికిమాలిన అభ్యంతరం

India Vs Chinaమోడీ అరుణాచల్ పర్యటనపై వ్యాఖ్యలకు అభ్యంతరంపై భారత్ దీటైన సమాధానం

బీజింగ్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనను చైనా బలంగా వ్యతిరేకించింది. సున్నితమైన, వివాదపూరితమైన ఈ సరిహద్దు రా్ష్ట్రాన్ని ఏనాడూ గుర్తించలేదని, సరిహద్దు సమస్యను మరింత జటిలం చేసే ఏ చర్యనూ భారతదేశ నాయకత్వం చేపట్టకూడదని చైనా శనివారం వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీ శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 4,000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. ఈ సరిహద్దు రాష్ట్రంతో సంబంధాలను మెరుగుపరిచేందుకు తన ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన చెప్పారు.

అరుణాచల్‌లో పర్యటనలు వద్దు: చైనా
మోడీ పర్యటనపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చునియింగ్ ‘చైనాభారత సరిహద్దు సమస్యపై చైనా వైఖరి స్థిరంగాను, స్పష్టంగానూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అనబడే రాష్ట్రాన్ని చైనా ప్రభుత్వం ఎన్నడూ గుర్తించలేదు. చైనా-ఇండియా సరిహద్దులో ఉన్న తూర్పు భాగంలో భారత నాయకులు పర్యటించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం’ అన్నారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలనూ భారతదేశం గుర్తుంచుకోవాలని చైనా విజ్ఞప్తి చేసింది. చైనా వైపు ప్రయోజనాలను, ఆందోళనలను గౌరవించాలి. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కృషిచేయాలి. వివాదాస్పదమైన సరిహద్దు సమస్య మరింత జటిలమయ్యేందుకు దోహదం చేసే చర్యలను విరమించుకోవాలి’ అని ఆమె చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. భారతదేశ ఈశాన్యభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇండియాచైనా ఇంతవరకూ 21సార్లు చర్చలు జరిపాయని చైనా అంటోంది. వాస్తవాధీన రేఖపై ఉన్న (ఎల్‌ఏసి) 3,488 కిలోమీటర్ల ప్రాంతం ఇండియాచైనా సరిహద్దు వివాదంలో ఉంది. భారతదేశ నాయకులు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన ప్రతిసారి తన వైఖరిని చాటుకునేందుకు చైనా అభ్యంతరాలు లేవదీయడం మామూలే.

గట్టిగా తిప్పికొట్టిన ఇండియా
ప్రధాని నరేంద్రమోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను భారతదేశం గట్టిగా తిప్పికొట్టింది. అది పనికిరాని అభ్యంతరం అని తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, దాన్ని ఎవరూ విడదీయలేరని పేర్కొంది. బీజింగ్‌కు ఘాటైన సందేశం పంపుతూ ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఏ)ప్రతినిధి రవీష్‌కుమార్… ‘ఇండియాలోని ఇతర ప్రాంతాలను సందర్శించినట్టే నాయకులు అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా తరచు పర్యటిస్తుంటారు. ఈ స్థిర పరిస్థితిని చైనా నాయకులకు ఎన్నోసార్లు చెప్పాం’ అని ఎంఇఏ తెలిపింది.

China opposed PM Modi’s visit to Arunachal Pradesh