Home బిజినెస్ ముంచిన ’ట్రేడ్ వార్‘

ముంచిన ’ట్రేడ్ వార్‘

bs

 అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాల పెంపు ప్రభావం
 భారీగా 351 పాయింట్లకు సెన్సెక్స్ నష్టం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈక్విటీల్లో బలహీన పరిస్థితుల కారణంగా బుధవారం దేశీయంగా మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా-చైనా దేశాల మధ్య మళ్లీ ట్రేడ్ వార్(వాణిజ్య యుద్ధం) భయాలు పెరిగిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఆఖరి సమయంలో నేలచూపులు చూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్351 పాయింట్లు నష్టపోయి 33019 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 116 పాయింట్లు పతనమై 10128 వద్ద స్థిరపడింది. బుధ, గురువారాల్లో ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే చైనా ప్రభుత్వం అమెరికాకు చెందిన 106 ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వార్తతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకా వెల్లువెత్తాయి. ప్రధానంగా మెటల్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్లు భారీగా క్షీణించాయి. నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, కోటక్ మహీంద్ర బ్యాంక్ మార్కెట్‌ను దెబ్బతీశాయి. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 381.10 పాయింట్లు నష్టపోయి 24,130 వద్ద ముగిసింది. టైటాన్, హిందాల్కో, టాటాస్టీల్, వేదాంత, యుపిఎల్ షేర్లు 3 నుంచి 4 శాతం నష్టపోయాయి.
ఉత్పత్తులపై చైనా 25 శాతం సుంకం
స్టాక్‌మార్కెట్లు అనూహ్య పతనానికి ప్రధాన కారణం అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకం విధించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా 106 అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆటో, రసాయనాలు, సోయాబీన్స్ తదితర ఉత్పత్తులపై చైనా కొత్త సుంకాలు విధించింది. ఎప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయో త్వరలో ప్రకటిస్తామని చైనా తెలిపింది. గత నెలలో చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను విధించినందుకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చల్లబడిందనుకున్న ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ప్రభావితమయ్యాయి. ట్రేడ్ వార్ మార్కెట్లను భయపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
106 ఉత్పత్తులపై చైనా సుంకాలు
అమెరికాపై చైనా వాణిజ్య యుద్ధానికి సై అన్నట్టు సంకేతాలిచ్చినట్టయింది. ఇకపై అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే వస్తువులపై భారీగా పన్ను పడనుంది. అమెరికా నుంచి దిగుమతయ్యే సోయా బీన్స్, ఆటో, కెమికల్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని చైనా విధించింది. మొక్క జొన్న సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులపైనా పన్ను మోత పడనుంది. అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే 106 ఉత్పత్తులపై అధిక సుంకాలు పడనున్నాయి. కొత్త పన్నుల అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామని చైనా ప్రకటన చేసింది. ప్రపంచ పరిణామాలతో జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోగా చైనా, హాం కాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.