Home జగిత్యాల ముందస్తు చర్యలేవి..?

ముందస్తు చర్యలేవి..?

Chlorination Goddess in fresh water wells!

గ్రామాల్లో కనిపించని పారిశుద్ధం
రోడ్ల పైనే పారుతున్న మురుగునీరు
పట్టణాల్లో పందుల స్వైర విహారం
మంచినీటి బావుల్లో క్లోరినేషన్ దేవుడెరుగు..!

ప్రతి ఏటా వర్షాకాలంలో వ్యాధులు విజృంభించి ప్రజలు మంచం పడుతున్నారు. సకాలంలో వైద్య సేవలందక విలువైన ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. మంచినీరు, సానిటేషన్ పనులు చేపట్టేందుకు నిధులకు ఎలాంటి కొరత లేదని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా పట్టణాలు, గ్రామాల్లో యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినా గ్రామాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగి స్తోంది. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,చెత్త చెదారం,మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న అధికారులు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధం మెరుగుకు తీసుకుంటున్న చర్యలు మాత్రం నామమాత్రమే.

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాలో 18 మండలాలు ఉండగా గతంలో ఉన్న గ్రామ పంచాయతీలకు తోడు కొత్తగా మరో 60 గ్రామ పంచాయతీలు ఏర్పడగా మొత్తం 380కి చేరుకున్నాయి. అలాగే జిల్లాలో ఇదివరకు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా రాయికల్, ధర్మపురి మండల కేంద్రాలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. జిల్లాలో 9.88 లక్షల జనాభా ఉంది. అయితే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయని తెలిసి కూడా వ్యాధుల నిర్మూలనకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, విష జ్వరాలు, డయేరియా, ఫైలేరియా వ్యాధులు విజృంభించే అవకాశాలున్నాయి. అధికారుల నిర్లక్షం వల్ల అమాయక ప్రజలు అంటువ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలయ్యే ప్రమాదం నెలకొంది.

పారిశుద్ధం జాడేది…?
గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధం మెరుగుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంతో చెత్త చెదారం పేరుకుపోయి ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. మురికి కాల్వలు చెత్త చెదారంతో నిండిపోయినా వాటిని శుభ్రం చేసేందుకు మాత్రం చొరవ చూపడం లేదు. మురుగు కాల్వలు చెత్త చెదారంతో నిండిపోయి మురుగునీరు రోడ్లపై పరుచుకుని పారుతోంది. పరిసరాల్లో మురుగునీరు నిలిచి దోమలు, ఈగలు, పందులకు నిలయంగా మారుతోంది. పారిశుద్ధం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారుల మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయి తప్పా ఆచరణ సాధ్యం కావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు పర్యటనలకు వస్తున్నప్పుడో… ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టినప్పుడు మాత్రమే గ్రామాల్లో, పట్టణాల్లో వీధులను, మురికి కాల్వలను శుభ్రం చేస్తున్నారే తప్పా రోజు వారీ బాధ్యతగా విధులు నిర్వర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివాసాల మధ్య మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల నివారణ మందు స్ప్రే చేయాల్సి ఉండగా యంత్రాలు గదులకే పరిమితమయ్యాయే తప్పా వీధుల్లోకి రావడం లేదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.

బావుల్లో క్లోరినేషన్ దేవుడెరుగు….!
వర్షాకాలంలో బావుల్లోకి కొత్త నీరు చేరడం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున బావుల్లో విధిగా క్లోరినేషన్ చేయాలి. కాగా వర్షాకాలంలో ఆరంభమైనా ఇంతవరకు అధికారులు బ్లీచింగ్ పౌడర్‌ను గ్రామాలకు సరఫరా చేసిన దాఖలాలు లేవు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి వాటిలో క్లోరినేషన్ చేయాల్సిన అధికారులు అలాంటిదేమి చేయకుండానే బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజారోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేననే విమర్శలున్నాయి. గ్రామాల్లో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేక మంచినీటి బావుల చుట్టూ మురుగునీరు నిలవడంతో పాటు బావులకు సమీపంలోనే పెంట కుప్పలు ఉండటం వల్ల అపరిశుభ్రమైన నీరు బావుల్లోకి చేరే ప్రమాదముంది. బావుల్లో నెలకోమారు క్లోరినేషన్ చేయడం వల్ల అంటువ్యాధులను అరికట్టే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు.

పందుల స్వైర విహారం….
పట్టణాలు, గ్రామాల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. మెదడువాపు వ్యాధికి కారణమవుతున్న పందులను పట్టణాలు, గ్రామాలకు దూరంగా తరలించాలనే ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. వందల సంఖ్యలో పందులు వీధుల్లో సంచరిస్తూ పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. రోడ్డు వెంబడి నడిచి వెళ్లే పిల్లలపై, మహిళలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జగిత్యాలలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పందులు దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నా వాటిని పట్టణానికి దూరంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. అప్పట్లో పట్టణంలో ఉన్న పందులను పట్టణానికి దూరంగా తరలించాలని ప్రభుత్వం ఆదేశించగా మున్సిపల్ కౌన్సిల్ పందులను పట్టణం నుంచి తరలించాలని ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు పందుల పెంపకందార్లకు ఇచ్చిన గడువు లోపు తరలించకుంటే వాటిని కాల్చి చంపాలని సభ్యులు చేసిన తీర్మానం బుట్టదాఖలైందే తప్పా ఆచరణలో సాధ్యం కాలేదు. “ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న” చందంగా వ్యాధులు విజృంభించి ప్రజలు ఆనారోగ్యం బారిన పడిన తర్వాత నివారణ చర్యలు తీసుకునే బదులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.