Home కలం ‘చో’ అంటే వెక్కిరింత

‘చో’ అంటే వెక్కిరింత

CHO

చ, ఛ భావోద్వేగ తీవ్రతను వెల్లడించే బలమైన అక్షరాలు. చ, ఛ, ఛా, ఛీ ఏకాక్షరాల్లో బలమైనవి. చల్ అన్నా, ఛస్ అన్నా, ఛట్ అన్నా, ఛీర్స్ అని హర్షం వ్యక్తం చేసినా ఈ రెండక్షరాలే ప్రధానం. ‘చే’ అన్నా, ‘చేగువేరా’ అన్నా విప్లవమే గుర్తొస్తుంది. ‘చో’ అంటే వెక్కిరింతగానే వినిపిస్తుంది.
ఏకాక్షరంతో వెక్కిరింతకు మారుపేరుగా నిలిచిన చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతిభామూర్తి. నటుడు, దర్శకుడు, రచయిత, న్యాయవాది, రాజకీయ విమర్శకుడు, సంపాద కుడు. అన్నింటికీ మించి ఎవరికీ తలొగ్గని ధీశాలి. ఎంత పెద్ద స్థాయి రాజకీయ నాయకుడైనా ఆయన వెక్కిరింతకు గురి కావల సిందే. జనం నవ్వులకు ఒక వస్తువుగా మారాల్సిందే.
చో రామస్వామి 1934 అక్టోబరు 5న శ్రీనివాస అయ్యర్, రాజమ్మాళ్ దంపతులకు జన్మించారు. మద్రాసు హైకోర్టులో న్యాయ వాదిగా పనిచేశారు. 2016 డిసెంబరు 7న చెన్నైలో మరణించారు.
చో ఏదో ఒక పార్టీకి చెందినవాడు కాదు. అన్ని పార్టీలూ ఆయనవే. అన్ని పార్టీలకూ ఆయన విపక్షమే. నిజం చెప్పడం ఆయన నైజం. ఆయన బలమూ, బలహీనతా రెండూ ఆ స్వభావమే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం కలిసేవారంటే ఆయన స్థాయి ఎలాంటిదో తెలుస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన ప్రధానమంత్రి సైతం చెన్నై నగరంలో ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయనను కలిసి వెళ్ళారంటే ఆయన పెన్నుకున్న బలమెంతో తెలుస్తుంది.
ఏదైనా అంశం చో రామస్వామి దృష్టికి వచ్చిం దంటే దానిపై నిష్పాక్షిక విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు తప్పనిసరిగా ఆయన కలం నుండి వెలువడేవి. ఆ నాయకుడు తనకు ఎంత సన్నిహితుడైనా వెక్కిరించడం ఆపడం ఆయన స్వభావానికి వ్యతిరేకం. జయలలిత అయినా, మోడీ అయినా ఆయనకు ఎంత సన్నిహితంగా మెలిగినా, ఆయన కలం దాడికి గురి కాక తప్పలేదు.
‘తుగ్లక్’ ఆయన స్థాపించిన పత్రిక. ఆ పత్రికకు సంపాదకుడిగా కూడా ఆయన వ్యవహ రించారు. ఈ పత్రిక ఎడిటోరియల్ అంటేనే వెక్కిరింతల వర్షం. ఇందిరాగాంధీ, జె.బి. కృపలానీ, వాజ్‌పేయి, చంద్రశేఖర్, మూపనార్, ఎన్టీరామారావు, ఎం.జి.ఆర్., సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం, జయలలిత, కరుణానిధి, రామకృష్ణ హెగ్డే, ఎల్.కె.అద్వానీ మొదలైన మహామహులంతా ‘తుగ్లక్’ మొట్టికాయలు తిన్నవారే. కేవలం పత్రికల్లో మొట్టికాయలు పెట్టడంతో ఆగిపోలే దు చో. ప్రతి ఏటా జనవరి 15న జరిగే ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో ప్రేక్షకులు అడిగే వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు సమకాలీన రాజకీయ నాయకులపై వెక్కిరింతలే.
ఆయన పది గ్రంథాలను రచించారు. రాజ్యసభలోనూ తన వెలుగును ప్రసరింప జేశారు చో. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈహోదాలో 2005 వరకు పనిచేశారు.
చో రామస్వామి ‘పర్ మగళే పర్’ అనే తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 180 తమిళ చలన చిత్రాల్లో నటించారు. ‘నాన్ యార్ తెరియుమా’, ఉనక్కుం ఎనక్కుం’ మొదలైన సినిమాల్లో ప్రధాన హాస్య నటుడిగా నటించారు. ‘మల్లిగై పూ’, అంబై తేడి’ మొదలైన 20 చలన చిత్రాల్లో మనోరమతో కలిసి నటించారు. ‘ఒలి విలక్కు’, ‘మత్తుకర వేలన్’ మొదలైన చలన చిత్రాల్లో ఎం.జి.రామచంద్రన్, జయలలితలతో కలిసి నటించారు. ‘యారుక్కుం వెట్కమిలై ’్ల మొదలైన ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు.
‘మహ్మద్ బిన్ తుగ్లక్’, ‘జడ్జ్‌మెంట్ రిజర్వ్‌డ్’, ‘మద్రాస్ బై నైట్’ ‘వై నాట్’, ‘వాట్ ఫర్’ మొదలైన 20 నాటకాలను రచించారు. వాటికి దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ‘ఎంగే బ్రాహ్మణన్’, ‘సంభవామి యుగే యుగే’, ‘వాషింగ్టన్ ఇల్ నల్లతంబి’ ‘అధిగ ప్రసంగం’ మొదలైన 27 టీవీ సీరియళ్ళను రచించారు. వాటిలో నటించారు కూడా.
ఇతరులపైనే కాకుండా తనపైన తానూ జోకులు వేసుకోడానికి వెనుకంజవేయలేదు చో. ఆయన గుండుపై ఒక్క వెంట్రుకా ఉండదు. దీనిపై తానే జోకు వేసుకున్నారు. ఎవరో అడిగారట గుండు ఎందుకని. దానికి ఆయ నిచ్చిన సమా ధానం “నా తలకు చుండ్రు ఉండేది. రకరకాల వైద్యాలు ప్రయ త్నించా ను. అల్లోపతి వాడాను, తగ్గలేదు.హోమియోపతి వాడాను, తగ్గలేదు. నేచురోపతి కూడా వాడాను, అయినా తగ్గలేదు. చివరిగా నేను ఉపయోగించిన మందు ‘తిరుపతి’ ”. అదీ చో మార్కు హాస్యం అంటే.
ఎమర్జెన్సీ రోజుల్లో ‘తుగ్లక్’ పత్రికను చో రామస్వామి మూసేయాల్సి వచ్చింది. అదే సమయంలో ‘పిక్విక్’ పేరుతో ‘తుగ్లక్’ పత్రికకు ఇంగ్లీషు వెర్షన్‌ను ప్రారంభించారు. అనంతర కాలంలో దాన్ని మూసేసి, మళ్ళీ ‘తుగ్లక్’ను ప్రారంభించారు.
ఎమర్జెన్సీ రోజుల్లో ‘తుగ్లక్’ పత్రికపై వేధింపులు అన్నీ ఇన్నీ కావు. షా కమీషన్ ఈ వేధింపులపై కూడా దర్యాప్తు చేసింది. వేధింపులపై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన కమీషన్ సభ్యులు పత్రికలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రచురితమైన జోకులు చదివి నవ్వాపుకోలేకపోయారు.
ఆ రోజుల్లో పత్రిక పాఠకుడి నుండి వచ్చిన ఒక ప్రశ్న, దానికి చో ఇచ్చిన సమాధానం.
ప్రశ్న: తనను కొట్టేవాడి ముందు వంగినవాడికి, వంగినవాడిని కొట్టేవాడికి తేడా ఏమిటి?
చో ఇచ్చిన సమాధానం: ఏదో ఒక సమయంలో వంగిన వాడు ఇంకా ఎక్కువగా వంగలేని పరిస్థితి వస్తుంది. లేదా కొట్టేవాడు మరింత కొట్టలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు వంగినవాడు కొడతాడు, కొట్టినవాడు వంగుతాడు.
ఈ ప్రశ్న, సమాధానం చాలవా ప్రజలను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడగట్టడానికి! ఎవరో అడిగిన ప్రశ్న. “అవినీతిపరులైన రాజకీయనాయకులను తీహార్ జైల్లో పెట్టాలని మీరనుకుంటున్నారా?” అని. ఆయనిచ్చిన సమాధానం “అలా చేస్తే వాళ్లు అక్కడే తమ ఆఫీసు పెట్టుకుని, అక్కడి నుండే తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. వారిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచడం మంచిది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.”.
బహుశా ఇక్కడ వాతావరణ కాలుష్యం ఎక్కువైందనేనేమో… నిశ్శబ్దంగా వెక్కిరిస్తూనే దూర తీరాలకు సాగిపోయారు చో. సాహిత్యం, జర్నలిజం రంగాల్లో ఆయన ప్రతిభకు గుర్తింపుగా పద్మభూషణ్ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎంపిక చేయడం ముదావహం.

డా. ఆర్.సూర్యప్రకాశ్‌రావు
9441046839