Home దునియా గోవాలో క్రిస్మస్…

గోవాలో క్రిస్మస్…

Christmas-Celebrations

గోవా…తప్పక చూడాలని అందరూ కలలు కనే ప్రదేశం. క్రిస్టియానిటీకి ప్రతిరూపం. అక్కడి వేష, భాష, ఆట, సంప్రదాయం అన్నీ ప్రత్యేకం. క్రిస్మస్ వేడుకలూ ప్రత్యేకమే. మనదేశపు అతి పెద్ద పార్టీ డెస్టినేషన్. అందమైన సముద్రతీరంలో ఈత చెట్లు, బంగారు బీచ్‌లు, మళ్లీ మళ్లీ సందర్శించేలాగా ఉంటాయి. నైట్ క్లబ్‌లు, పార్టీలకు పెట్టింది పేరు. అద్భుతమైన సూర్యాస్తమయ సమయాలు, చల్లని గాలుల్లో సుదీర్ఘ నడక, ఇవన్నీ అనుభవిస్తే కాని తెలియని ఆనందాలు.

గోవాను చూడాలంటే అది క్రిస్మస్ సమయంలోనే అంటారు. సాధారణంగానే రకరకాల ఉద్విగ్నభరిత కార్యక్రమాలతో హోరెత్తిపోయే గోవా క్రిస్మస్‌కి కొత్త రూపం తెచ్చుకుంటుంది. వెలుగుల మెరుపులు, పాటలు, డాన్సింగ్ ఈవెంట్స్, క్రిస్మస్ ప్రత్యేక సంగీతం, అద్భుతంగా అలంకరించిన చర్చిలతో అదొక ప్రత్యేక ప్రపంచంలా ఉంటుంది. బాసిలికా ఆఫ్ బోర్న్ జీసస్, ఇంకా చర్చి ఆఫ్ ఇమాక్యులేట్‌లలో మిడ్‌నైట్ హంగామలకు స్థానికులు, పర్యాటకులు విస్తృతంగా హాజరవుతారు.

ప్రపంచంలోని మిగిలిన అన్ని ప్రదేశాల్లో లానే అక్కడి క్రిస్టియన్లు కూడా కుటుంబంతో పండుగ జరుపుకుంటారు. ఇళ్లలో తయారు చేసిన చాకొలెట్లు, స్వీట్లు, గోవా సంప్రదాయ వంటలతో సంతోషంగా జరుపుతారు. అడుగడుక్కీ అలంకరించిన క్రిస్మస్ చెట్లు, లైట్ల వెలుగులో కళకళలాడిపోయే దుకాణాలలో శాంటాక్లాజ్‌లు క్రిస్మస్ అంతా గోవాలోనే ఉందా అనిపించేట్టు ఉంటుంది. యూరోపియన్ తరహాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. పదిరోజుల ముందు నుంచీ వేడుకలు నడుస్తుంటాయి. ఒక కుటుంబం లేదా ఒక గ్రామం బృందంగా ప్రార్థనాగీతాలు పాడతారు. ఆ బృందంలో ఒక వ్యక్తి శాంటా వేషం వేసుకుంటాడు. ప్రతి ఇంటి ముందు చెక్కతో, గాలిపటం కాగితంతో తయారు చేసిన నక్షత్రం వెలుగుతుంటుంది.

ఇన్ని వేడుకలుంటే మరి మంచి భోజనం లేకుంటే ఎలా? క్రిస్మస్‌కి గోవాలో ప్రత్యేకంగా పదార్థాలు తయారు చేస్తారు. ప్రతి ఇంట్లో వైన్, డ్రైఫూట్స్‌తో కేక్ తయారు చేస్తారు. అదే కాక, కొబ్బరి, డ్రైఫ్రూట్స్ మధ్యలో నింపిన న్యూరియోస్, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన డోడోల్, లేత కొబ్బరిని చెక్కెరలో ముంచి పక్షుల గూడులాగా తయారు చేసిన కోకోనట్ నెస్ట్ స్వీట్లతో పాటు బెబింకా అనే గోవా ప్రత్యేక స్వీటును స్థానికులు ఇళ్లలో తయారు చేసి అలంకరించిన బాస్కెట్లలో పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు కార్డుతో స్నేహితులకు, చుట్టాలకు పంపుతారు. క్రిస్మస్‌రోజు కుటుంబం అంతా కలిసి క్రిస్మస్ భోజనం కలిసి చేస్తారు. అందులో టర్కీ చికెన్, పోర్క్ సోర్పోటెల్, పులావ్ వండి వడ్డించుకుంటారు. కుటుంబం అంతా కలిసి పసందైన విందు భోజనం, డ్రింక్స్, ఆటలు, పాటలు అన్నీ రాత్రి పదకొండున్నర వరకు నడుస్తాయి.

క్రిస్మస్ తర్వాతి రోజు ప్రజలు వారి కుటుంబం, స్నేహితులను కలిసి క్రిస్మస్ చెట్టు కింద బహుమతులు పెడతారు. కొత్త సంవత్సర వేడుకల వరకు కూడా క్రిస్మస్ వేడుకలను కొనసాగిస్తారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా పిల్లలు ముసలి వ్యక్తి బొమ్మను తయారు చేసి దారిలో వచ్చేపోయేవారి దగ్గర నుంచి డబ్బు పోగుచేస్తారు. అర్థరాత్రి ఆ బొమ్మను తగలబెడతారు.

పాతను వెనక్కి వదిలేసి కొత్త ఏడాది మంచి ఆరంభం కావాలన్న గుర్తుగా అలా చేస్తారు. అధికారికంగా క్రిస్మస్ సీజన్ జనవరి 6 కి అవుతుంది. ఆరోజు మాగి పండగ చేస్తారు. కొన్ని చోట్ల అప్పుడే పుట్టిన జీసస్‌ను చూడటానికి వచ్చిన ముగ్గురు రాజుల పండగతో కాని క్రిస్మస్ వేడుకలు ముగిస్తారు. ముగ్గురు రాజులకు చెందిన చిహ్నాలను గోవాలో మూడు చోట్ల ఉంచుతారు. దానితో గోవా వేడుకలను ముగించిందని అర్థం.