Home ఎడిటోరియల్ బ్యాంకు డిపాజిటర్ల బెంబేలు

బ్యాంకు డిపాజిటర్ల బెంబేలు

bankవడ్డీ ఎంతొచ్చినా అసలు మాత్రం భద్రంగా ఉంటుందన్న భరోసాతోనే జనం బ్యాంకు ల్లో డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు. డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రోజురోజుకూ తరిగిపోతున్నా మరో దారి లేక పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు ఖాతాల్లోనే వేసుకుంటున్నారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు ప్రభుత్వరంగ బ్యాంకులనే నమ్ముకొని బతుకుతున్నారు. తమ సొమ్ముకు ప్రభుత్వం హామీ అనే ధీమాతో నిశ్చింతగా ఉంటున్నారు. బ్యాంకు అప్పుల వసూళ్లు తగ్గి కోట్లాది రూపాయల రుణాలు నిరర్థకమవుతున్నందువల్ల ఎగవేత దారులకు కళ్లెం వేయలేని అశక్త బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ కోతలకు కత్తులు నూరుతున్నాయి. ఒకనాడు 13% ఉన్న వడ్డీరేటు నేడు ఏడాదికి 7శాతానికి దిగజారింది. అయినా బ్యాంకు డిపాజిట్లు దినదినం పెరుగుతూనే ఉన్నాయంటే బ్యాంకులపై ఉన్న విశ్వాసమే కారణం అనాలి. జూన్ 2017 నాటికి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో రూ.105లక్షల కోట్లు డిపాజిట్లున్నాయి. అందులో 76% వ్యక్తిగత విభాగానికి చెందినవే. ప్రభుత్వానికి చెందినవి 13% కాగా కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం కేవలం 11% మాత్రమే. డిపాజిట్ల మొత్తంలో రూ.76 లక్షల కోట్లు రుణాలుగా పంపిణీ చేయబడ్డాయి. ఈ రుణాల్లో పెద్దకంపెనీల వాటా 58% వుంటుంది. జూన్ 2017నాటికి నిరర్థక ఆస్తుల మొత్తం 8లక్షల కోట్లు. 2014లో 2.30లక్షల కోట్లున్న ఎన్‌పిఎ సూచిక 2017మార్చి నాటికి 8లక్షల కోట్లకు ఎగబాకింది. కాంగ్రెస్ పాలనలో ఉదారంగా బడా వ్యాపారస్థులకు బ్యాంకు రుణాలు అప్పగిస్తే బిజెపి ప్రభుత్వం ఆ అప్పులను మాఫీ చేస్తూ, రీషెడ్యూలు అవకాశం ఇస్తూ వారికి మరింత సహకరిస్తోంది. ఇలా 3.5లక్షల కోట్ల రుణాల చెల్లింపులకు కాలపరిమితి పెంచింది. అదాని కంపెనీకి ఉన్న రూ.72000కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.15000కోట్ల అప్పుకు రీషెడ్యూలు వసతి లభించింది. బ్యాంకుల్లో ఉన్న మొత్తం డిపాజిట్లలో 65% టర్మ్ డిపాజిట్లే. తమ సొమ్ము బ్యాంకుల్లో పెరగాలనో, నెలనెలా వడ్డీ రావాలనో ఆశపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే క్రమంగా జారిపోతున్న ప్రభుత్వ జవాబుదారీతనం బ్యాంకు డిపాజిటర్లను మనోవేదనకు గురిచేస్తోంది. అప్పులు వసూలు చేయలేని స్థితిలో బ్యాంకులు తమ డిపాజిట్‌దారులకు తామే బాధ్యత వహించాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. బ్యాంకులు దివాలా తీస్తే బీమా సొమ్ము చెల్లించి చేతులు దులుపుకునే దూరదృష్టి కూడా ఉంది.
సహకార కేంద్ర బ్యాంకులు దివాలా తీయడం వాటి డిపాజిటర్లకు బీమా కంపెనీ రూ.లక్ష పరిమితితో చెల్లింపులు చేయడం దశాబ్దంగా తెలుగువారు చూస్తున్నదే. ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా వీటికి భిన్నం కావని ఇటీవలి పరిస్థితులు చెబుతున్నాయి.రిజర్వ్‌బ్యాంకు అధీనంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే బ్యాంకు పొదుపుల, అప్పుల బీమా సంస్థ ఉంది. 1978లో ప్రారంభమైన ఈ సంస్థ దివాలా తీసిన బ్యాంకు యొక్క డిపాజిటర్లకు ఒక లక్షకు లోపడి చెల్లింపులు చేస్తుంది. దీనికిగాను ఆయా బ్యాంకులు ఈ సంస్థకు ప్రీమియం చెల్లిస్తాయి. ప్రతి రూ.100/-కు పదిపైసలు చొప్పున 6నెలలకోసారి ప్రీమియం కట్టవలసి ఉంటుంది. బీమాసౌకర్యం ఉన్న బ్యాంకులు చేతులెత్తేసినపుడు డిఐసిజిసి లక్ష రూపాయల వరకు బ్యాంకు ద్వారాగాని, నేరుగా డిపాజిటర్లకు గాని చెల్లిస్తుంది. అయితే లక్షపై ఎంత డిపాజిట్ చేసినా డిపాజిట్‌దారుకు అందేది మాత్రం లక్ష మాత్రమే. ఒకే వ్యక్తిపై ఒక బ్యాంకులో ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక్క ఖాతాదారుడి కిందే లెక్క. 1978లో నిర్ణయించిన లక్ష పరిధిని ఇప్పటి వరకు పెంచకపోవడం విచారకరమైన విషయం. 2013లో వందకు ఐదుపైసలు ఉన్న ప్రీమియం పదిపైసలు చేసినా లక్ష మొత్తాన్ని మాత్రం అంతే ఉంచారు. మరో విచిత్రమైన విషయమేమిటంటే ఈ మాత్రం బీమా సక్రమంగా చేయని బ్యాంకులు కూడా ఉన్నాయి. మొత్తం వ్యక్తిగత డిపాజిట్లలో కేవలం 35% మాత్రమే బీమా రక్షణలో ఉన్నాయని బీమాసంస్థ గణాంకాలే చెబుతున్నాయి.
ఈ శీతాకాలపు పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు మరో పిడుగులా బ్యాంకు డిపాజిటర్లపై పడనుంది. బ్యాంకుల్లో ఉన్న డిపాజిటర్ సొమ్మును బ్యాంకు మూలధనంలోకి మార్చి డిపాజిటరును వాటాదారునిగా మార్చే అధికారం ఈ బిల్లు కల్పిస్తుందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. డిపాజిటర్లకు మరింత భద్రత కల్పించే అంశాలే ఇందులో ఉన్నాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నా ఆ బిల్లులోని ‘బెయిల్ ఇన్’ క్లాజు పట్ల ఆర్థిక నిపుణులు అనుమానాలు పడుతున్నారు. బ్యాంకులు ఆర్థిక ఆపసోపాలు పడుతున్నప్పుడు కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు ద్వారాగాని, మరే బదలాయింపు ద్వారాగాని బెయిల్ అవుట్ విధానంలో సొమ్ము అందించి కాపాడుతుంది. ఇంతవరకు జరుగుతున్నదదే. ఇలా ప్రభుత్వం సాయపడే బదులు బ్యాంకు డిపాజిటర్ సొమ్మునే మూలధనంలోకి మార్చడం బెయిల్ ఇన్‌లో ఉన్న పద్ధతి. డిపాజిటర్ అంగీకారం లేకుండానే ఈ నిర్ణయం తీసుకునే అధికారం బ్యాంకులకు ఉంటుంది. అనగా ఫలానా తేదీకి నా సొమ్ము, వడ్డీతో సహా ఇంతమేరకు వస్తుందని ఎదురుచూసే డిపాజిటరు ఆశ నెరవేరకపోవచ్చు. అకస్మాత్తుగా వాటాదారుగా మారిపోవచ్చు. వాటాదారుకు బ్యాంకు లాభాలతో, నష్టాలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఆశించిన దానికన్నా ఎక్కువా రావచ్చు లేదా దాచిన సొమ్ము జారిపోవచ్చు కూడా. ఎఫ్‌ఆర్‌డిఐలో ఇన్సూరెన్స్ కూడా ఉన్నందువల్ల ది ఐసిజిసి పాత్ర కూడా ఇదే పోషించవచ్చు. అయితే అది లక్షకే పరిమితమై ఉంటుందా లేదా ఏమైనా మార్పులుంటాయా బయట పడాల్సి ఉంది.
బ్యాంకులు దివాళా తీసినపుడు జరిపే చెల్లింపుల విషయంలో ఈ బిల్లులో డిపాజిటర్ల స్థానం దిగువ ఉండడం మరో ఆందోళనకరమైన విషయం. దివాళా తీసిన బ్యాంకుల ఆస్తుల అమ్మకం ద్వారా సొమ్ములో మొదట స్వల్పకాలిక అప్పులను, ఆ తర్వాత ఉద్యోగుల బకాయిలను, వారి 12 నెలల జీతాలను లెక్కలోకి తీసుకున్న తర్వాత డిపాజిటర్ల లెక్క బయటి కొస్తుంది. ఎఫ్‌ఆర్‌డిఐ బ్యాంకులకే కాకుండా బీమా కంపెనీలకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, స్టాక్ ఎక్సేంజీలకు కూడా వర్తిస్తుంది. ప్రజాధనంతో దేశంలో నడుస్తున్న ఏ ఆర్థిక సంస్థ అయినా దెబ్బతిన్నప్పుడు ఈ రిజల్యూషన్ కార్పొరేషన్ ద్వారా పరిష్కరింపబడతాయి. సమాచార మాధ్యమాల ద్వారా ప్రచారమైన రిజల్యూషన్ కార్పొరేషన్ బిల్లులోని బెయిల్ ఇన్ క్లాజు ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సవరణలు చేపట్టకపోతే సమ్మెకు దిగుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆన్‌లైన్ పిటిషన్లకు కూడా జనసమాధానం, మద్దతు లభిస్తోంది. మా కష్టార్జితాన్ని, పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్న సొమ్మును బెయిల్ ఇన్ ద్వారా బ్యాంకులు వాడుకోవద్దని శిల్పశ్రీ, ముంబయి పిటిషన్‌కు 24గంటలలో 40,000 కుపైగా సంతకాలు జతకూడాయి. ఈ అభ్యర్థన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి రచించబడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ప్రకటించిన సేవింగ్స్ స్కీమ్‌ను ఒక ఉపశమనంగా భావించవచ్చు. 60 ఏళ్లు, ఆ పై వయసు వాళ్లు ఎంపిక చేసిన బ్యాంకుల్లోగాని, పోస్టాఫీసుల్లో గాని ఈ ఖాతాను తెరవవచ్చు. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ డిపాజిట్ స్కీమ్‌లో 8.5% సం॥కి వడ్డీ లభిస్తుంది. వడ్డీని మూడు నెలలకోసారి తీసుకోవచ్చు. అత్యధికంగా రూ. 15లక్షలదాకా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. బ్యాంకుల పరిస్థితులు గందరగోళంగా ఉన్న ఈ దశలో కనీసం వృద్ధుల కష్టార్జితానికైనా ప్రభుత్వం భరోసా ఇచ్చినందుకు సంతోషించాలి.ఆలోచన, అవగాహన ఉన్నవారికి మ్యూచువల్ ఫండ్స్ మరో పొదుపు మదుపుకు సోపానం. ఏదిఏమైనా పైసా పైసా కూడబెట్టుకునే ప్రజలకు పూర్తిస్థాయి గ్యారంటీ ఇయ్యవలసింది ప్రభుత్వమే.