Home రాష్ట్ర వార్తలు రియల్ చౌక్!

రియల్ చౌక్!

ధర్నాచౌక్ తరలింపు వెనుక రియల్‌ఎస్టేట్ వ్యూహం : కోదండరామ్

Kodanda-ram

హైదరాబాద్ : ధర్నా చౌక్, సచివాలయం తరలింపు వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫె సర్ కోదండరామ్ అన్నారు. ధర్నా చౌక్ చుట్టూ ఉన్న స్థానిక బస్తీలను ఎత్తేసి, హుస్సేన్ సాగర్ పరిసరాలను వ్యాపార కేంద్రంగా మార్చే అవకాశముందన్నారు.  ‘ధర్నా చౌక్ స్వాధీనం’ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ మంగళవారం మఖ్దూంభవన్‌లో సమావేశమైంది.

కమిటీ కన్వీనర్ చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో కో కన్వీనర్ ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, కోదండరామ్‌తో పాటు తమ్మినేని వీరభద్రం, డి.జి.నర్సిం హారావు(సిపిఐ(ఎం)), మల్లేపల్లి ఆదిరెడ్డి(సిపిఐ), వేములపల్లి వెంకట్రా మయ్య, హన్మేశ్ (సిపిఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ), కె.గోవర్థన్ (న్యూడె మోక్రసీ), రవిచంద్ర, నలమాస కృష్ణ (టిపిఎఫ్), భూతం వీరన్న (సిపిఐ(ఎంఎల్)), తాండ్ర కుమార్, ఉపేందర్‌రెడ్డి(ఎంసిపిఐ(యు)), జె.జాన కిరాములు(ఆర్‌ఎస్‌పి), సజయ (సామాజిక కార్యకర్త), సిహెచ్.మురహరి (ఎస్‌యుసిఐ(సి)), గాదె ఇన్నయ్య (తెలంగాణ ప్రజా వేదిక) తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమం కొనసాగింపుగా ఈ నెల 28న ఇందిరాపార్క్ పరిసరాలలోని బస్తీల్లో పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు. అలాగే జూన్ మాసంలో ఎంఎల్‌ఏలు, ఎంపిలు, ఎంఎల్‌సిలకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే జూలై నెలలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై బుక్‌లెట్‌లు, కరపత్రాలు వేసి ప్రచారం చేస్తామన్నారు. సచివాలయం తరలింపు అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందని, అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు, పటిష్టమైన కట్టడాలు, సరిపడ స్థలం ఉన్న ఈ సచివాలయాన్ని ఎవరికి కట్టబెట్టేందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు.

ధర్నాచౌక్ స్వాధీనం కార్యక్రమం తరువాత కూడా ప్రభుత్వ మొండి వైఖరిలో మార్పు రావడం లేదన్నారు.ఈ వ్యవహారంలో తాము న్యాయపోరాటం చేస్తామని ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వ రరావు తెలిపారు. దీనిపై హైకోర్టులో నడుస్తున్న కేసుల్లో పరిరక్షణ కమిటీ ఇంప్లీడ్ అవుతుందని చెప్పారు. కోదండరామ్ మాట్లాడుతూ ధర్నా చౌక్, సచివాలయం తరలింపు ద్వారా ప్రజల సమిష్టి ఆస్తులను ఒకరిద్దరు వ్యాపారులకు తాకట్టుపెట్టే యత్నాలను పెద్ద ఎత్తున ఎండగడతామన్నారు. సచివాలయాన్ని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్మించడంపై అక్కడి వాకర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తూ తీర్మానించిందని, అదే సమయంలో ధర్నా చౌక్ కొనసాగింపుపై ఇక్కడి వాకర్స్ అసోసియేషన్ వ్యతిరేకత లేదని తీర్మానం చేసిందని తెలిపారు. పెరేడ్ గ్రౌండ్స్ నగరంలో మిగిలిన అతి పెద్ద లంగ్ స్పేస్ అని, పైగా చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతమని చెప్పారు.