Home రాష్ట్ర వార్తలు వరప్రదాయిని

వరప్రదాయిని

cm-kcrసీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు మహా వరం, ఐదున్నర లక్షల ఎకరాలకు నీరు, కరువు
ప్రాంతాలకు ప్రాణప్రదం, రెండున్నర సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి, నేడు శంకుస్థాపన,
ఎక్కువ ఆయకట్టు కోసమే దుమ్ముగూడెం రీ డిజైనింగ్ : సిఎం కెసిఆర్

ఖమ్మం ప్రతినిధి : ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించ డంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు ప్రత్యామ్నాయం చూపే విధంగా సీతారామ సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని ఇది ఖమ్మం జిల్లా ప్రజల పాలిట వరప్రదాయిని అని సిఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రెండున్నర సంవత్సరాల్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి నీరు అందించనున్నామని ఆయన తెలిపా రు. దీంతో పాటు కరువు ప్రాంతమైన పాలేరు నియోజకవర్గా నికి సాగునీరు అందించేందుకు వంద కోట్ల రూపాయలతో మాదిరిపురం వద్ద ఎత్తిపోతల పథ కానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలి పారు. సోమవార సాయంత్రం ఖమ్మంలో జరిగిన విలేకర్ల సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా నిర్మించే సీతారామ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న ప్రాజెక్టులో కొంత ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడం గతం కంటే ఎక్కువ భూమికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగిందన్నారు. దుమ్ముగూడెం వద్ద సంవత్సరం పొడవునా నీరు అందుబాటులో ఉంటుందని అందువల్ల ఖమ్మం జిల్లాకు సాగునీటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో కృష్ణా నది పరివాహక ప్రాంతానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలు కృష్ణ, గోదావరి నదులపై దాదాపు 200 ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని, ఈ సంవత్సరం కృష్ణా నది ఎగువ భాగంలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు సైతం చుక్క నీరు రాలేదన్నారు. గోదావరి దిగువ భాగాన సీతారామ ప్రాజెక్టు నిర్మించడం వల్ల గోదావరి నీటికి కొరత లేదని ఆయన తెలిపారు. ఖమ్మంతో పాటు నాలుగు కార్పొరేషన్లకు ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయల చొప్పున కేటాయించనున్నామని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 42.3 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నందున పట్టణ ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులకు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని మిగతా దేవాయాలకు దీటుగా భద్రాచలం దేవాలయాన్ని సైతం ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయనున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మండలాలు విలీనం అయిన సందర్భం హడావిడిగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదించిన మీదట ఐదు గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో తద్వారా ఖమ్మం జిల్లాలో విలీనం కానున్నాయని, ఈ విషయం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా మాట్లాడడం జరిగిందన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తిపన్నుకు సంబంధించిన పెనాల్టీలను ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 5. 70 కోట్లు, వరంగల్ పరిధిలోని 3.5 కోట్లు రద్దు చేస్తూ జి.ఓ విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్,వరంగల్ నగరాలతో పాటుగా ఖమ్మంలో కూడా అత్యాధునిక వసతులతో జర్నలిస్టు కాలనీని నిర్మిస్తామని కెసిఆర్ తెలిపారు. మార్చి బడ్జెట్ సమావేశాల తర్వాత ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఖమ్మం నగరానికి సంబంధించి 14 కోట్లతో 7.29 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో కూడిన బస్టాండ్ నిర్మిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా ఎన్‌ఎస్‌పి ఖాళీస్థలంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయడం ద్వారా లభించే స్థలాన్ని పౌర అవసరాలకు వినియోగిస్తామన్నారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఆరు చోట్ల మార్కెట్లను నిర్మించడంతో పాటు రెండుకోట్లతో నూతనంగా షాదీఖానా నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం నగరానికి ఇప్పటికే ప్రకటించిన రెండువేల డబుల్‌బెడ్ రూం ఇళ్లతో పాటు బడ్జెట్ సమావేశాల అనంతరం మరో మూడు వేల బెడ్‌రూం ఇళ్లు మంజూరీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం నగరానికి జాతీయ రహదారి మంజూరు అయినందున సగం రింగ్ రోడ్డుగా ఉపయోగపడుతుందని, మిగిలిన సగం రింగ్ రోడ్డును వీలైనంత త్వరగా నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం నగర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పలు హమీలు ఇవ్వడంతో పాటు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు, కలెక్టర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జడ్‌ఫి ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్, స్థానిక శాసన సభ్యులు జలగం వెంకట్రావ్, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.