Home తాజా వార్తలు  కాంగ్రెస్, బిజెపిలు గోల్‌మాల్ పార్టీలు

 కాంగ్రెస్, బిజెపిలు గోల్‌మాల్ పార్టీలు

CM KCRమనమే ఢిల్లీని సాదుతున్నాం
కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది లక్ష కోట్లు
ఢిల్లీ మనకిచ్చేది 24 వేల కోట్లు
ప్రధాని మోడీ సర్పంచ్ కంటే దిగజారి మాట్లాడుతున్నాడు

దేశానికి కాంగ్రెస్ లేని, బిజెపి లేని కూటమి కావాలి
కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనమే నడవాలి
మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని పెద్దలు చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం టిఆర్‌ఎస్ ఎంపిలు గెలవాల్సిందే వరంగల్ సభలో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి పార్టీలు దేశాన్ని గోల్‌మాల్ గోవిందం చేశాయని, ఈసారి కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీలదేనని టిఆర్‌ఎస్ అధ్యక్షులు ముఖ్య మంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. “మనల్ని ఢిల్లీ సాదుతలేదు…మనమే ఢిల్లీని సాదుతున్నాం… సంవత్సరానికి తెలంగాణ కేంద్రానికి ఇచ్చే డబ్బు రూ.లక్ష కోట్లు…ఢిల్లీ నుంచి మనకు తిరిగి వచ్చేది ముష్టి రూ.24 వేల కోట్లు…దేశాన్ని సాదేటువంటి ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి” అని టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రూ.75 వేల కోట్ల ఆదాయం మా రాష్ట్రం నుంచి మీరు తీసుకుంటున్నరు అని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు. మేం తప్పని అంటలేం కానీ ఇక్కడి వచ్చి అబద్దాలు చెప్పి అవాకులు, చెవాకులు మాట్లాడవద్దని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు.

వరంగల్‌లోని అజంజాహి మిల్లు మైదానంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా సిఎం కెసిఆర్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టి.రాజయ్య, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి,రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, ఎంఎల్‌ఎలు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో సిఎం కెసిఆర్ ప్రసంగం స్థానిక అంశాలతో పాటు దేశ రాజకీయాలను ప్రస్తావిస్తూ నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీలపై విమర్శలు కొనసాగించారు. ప్రధాని నరేంద్రమోడీ కెసిఆర్ జాతకం చూసుకుంటడు..కెసిఆర్ ముక్కు సక్కగ లేదు…మూతి సక్కగ లేదు, ముడ్డి సక్కగ లేదు అని మాట్లాడతడు…గివేనా వ్యా మాట్లాడేది..? ప్రధానమంత్రి మాట్లాడేది గిదేనా వ్యా అని పేర్కొన్నారు. దేశం రాజకీయం నడిపించే వ్యక్తి మాట్లాడొచ్చునా…? ప్రశ్నించారు. సర్పంచ్ స్థాయి కన్నా దిగజారి ప్రధానమంత్రి మాట్లాడతడు ఈ దేశంలో అని మండిపడ్డారు.

గతంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడితే కూడా నువ్వు రా….నేను చెప్పేది తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అడిగితే దాటి పారిపోయి వెళ్లిపోయారని గుర్తు చేశారు. నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని…రూ.35 వేల కోట్లు ఇచ్చామని ప్రగల్బాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. ముష్టి రూ.35 వేల కోట్లు మీరు ఇవ్వలె…ఎక్సైజ్ కస్టమ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కం ట్యాక్స్, జిఎస్‌టిలో కేంద్ర వాటా ద్వారా తెలంగాణ కేంద్రానికి రూ.లక్ష కోట్లు ఇస్తుందని వివరించారు. బిజెపి నాయకులకు నిజాయితీ ఉంటే దీనిపై సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఉద్యమంలో తాము చెప్పిన విధంగానే తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.

గోల్‌మాల్ గోవిందం చేసే రెండు పార్టీలు పనికిరావు
ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు గడిస్తే 55 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లు బిజెపి ప్రభుత్వాలు పాలించగా, నాలుగైదు ఏళ్లు ఇంకొకరు పాలించారని అన్నారు. గోల్‌మాల్ గోవిందం చేసే కాంగ్రెస్, బిజెపిలు ఈ దేశానికి పనికిరావని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ లేని, బిజెపి లేని కూటమి ఈ దేశానికి కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌యేతర, బిజెపియేతర ప్రభుత్వం రాబోతుందని తనను ఇంటర్వూ చేసిన ఎన్‌డిటివి ప్రతినిధులు చెప్పారని తెలిపారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉంటేనే రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీలు రోజూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఛోర్ హై అని ఒకడు అంటడు….మా బేటే జమానత్ పే హై అని ఇంకొకడు అంటారని విమర్శించారు. ఇలాంటివాళ్లే మనకు కావాల్సింది అని అడిగారు. ప్రజలు లేరా..? సమస్యలు లేవా..? అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి తాను మాట్లాడుతున్నప్పటి నుంచి రెండు విషయాల గురించి అడుగుతున్నానని చెప్పారు. ఈ దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు ఉన్నవి, వాటిని ఎందుకు వాడుతలేరు అంటే వీడు మాట్లాడడు…నా వాడు మాట్లాడడు అని విమర్శించారు.

దేశంలో 3.44 లక్షల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయితే, ఎన్నడూ కూడా 2.20 లక్షల మెగావాట్ల కరెంట్ వాడకం దాటలేదని చెప్పారు. సగం దేశం చీకట్లో ఉందని, ఉత్తర భారతదేశంలో మోడీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వరని తెలిపారు. ఉన్న నీళ్లు, ఉన్న కరెండు వాడే తెలివిలేదు…ఉన్న యువశక్తిని వాడే తెలివిలేదు..పనిచేసే ప్రజలు ఉంటే వాడే తెలివిలేదు..కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తే తగునమ్మా అని వాళ్లే ఇప్పుడు పెద్ద వీరంగం ఎత్తుతున్నరని మండిపడారు. తెలంగాణ అవసరాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం,తెలంగాణ ప్రాజెక్టుల కోసం, తెలంగాణ హక్కుల కోసం కచ్చితంగా టిఆర్‌ఎస్ ఎంపిలు గెలవాల్సిందే అని పేర్కొన్నారు. మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని పెద్దలు చెప్పారని వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు గెలిచినా ఢిల్లీ గులాములే తప్ప నోరు తెరిచి మాట్లాడేవాళ్లు కాదని అన్నారు. మోడీ, రాహుల్‌గాంధీ ముందు వీళ్లు మాట్లాడతరా…? అని ప్రశ్నించారు. సిట్ అంటే సిట్…స్టాండ్ అంటే స్టాండ్…మూత్రం పోయాలంటే కూడా వాళ్ల పర్మిషన్ కావాలని విమర్శించారు. అదే టిఆర్‌ఎస్ అయితే ఇద్దరే ఎంపిలున్నా పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చామని చెప్పారు. అదే పద్దతిలో టిఆర్‌ఎస్ ఎంపిలు ఉంటేనే మన హక్కులు నెరవేరుతాయని స్పష్టం చేశారు.

ప్రధాని కావాలన్న కోరిక నాకు లేదు
దేశానికి ప్రధాని ఎవరైనా తనకు సంబంధం లేదని, కావాలన్న కోరిక తనకు లేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని ఎవరైనా ప్రజల అభీష్టం నెరవేరాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఎన్నికలు వస్తే పార్టీలు కాదు గెలవాల్సింది…ప్రజలు గెలవాలె…ప్రజల అభీష్టం గెలవాలె…ప్రజల అభిమతం గెలవాలె అని పేర్కొన్నారు. ప్రజలు ఏదీ కొరుతరో అది గెలవాలె అని అన్నారు. దేశంలోని వనరులన్నీ ప్రజల సౌభాగ్యం కోసం ఉపయోగంలోకి తేవాలి అని పేర్కొన్నారు. దేశంలో పేదరికం పోవాలి… నిరుద్యోగ సమస్య పోవాలె…రైతులకు గిట్టుబాటు ధర దొరకాలె…మౌళిక వసతులు రావాలి అని వ్యాఖ్యానించారు.

దేశానికి దిక్సూచిగా ఉన్నాం
సంక్షేమంతో పాటు అనేక రంగాల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉన్నామని సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి రెట్టింపు చేసిన పెన్షన్లు ఇస్తామని తెలిపారు. కొత్త జిల్లాలు చేసుకున్నాం, పరిపాలన సంస్కరణలు చేసుకున్నామని తెలిపారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎట్ల ఉండే…ఇప్పుడు తెలంగాణ ఎట్ల ఉందో ఆలోచించుకోవాలని కోరారు. కరెంట్ కోసం ధర్నాలు, లాఠీ ఛార్జీలు, కాలిపోయే మోటార్లు…పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు…ఇలా ఎన్నో చూశామని పేర్కొన్నారు. ఐదేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పరిస్థితి తారుమారైందని అన్నారు.

వరంగల్ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది
వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అని, ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదని ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్లే గెలుపులో కూడా అగ్రభాగాన ఉండాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా అగ్రభాగాన నిలబెట్టాలని కోరారు. వరంగల్‌కు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీసుకొచ్చామని చెప్పారు. అలాగే సైనిక్ స్కూల్, వెటర్నరీ కాలేజీలు, ఐటి కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే పరకాలలో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. పరకాల, తొర్రూర్, స్టేషన్ ఘన్‌పూర్ రెవిన్యూ డివిజన్లు చేసుకున్నామని తెలిపారు. వరంగల్‌కు 75-100 టిఎంసిల నీళ్లు వరంగల్‌కే ఉండే విధంగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పారు. తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ కూడా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్‌ఆర్‌ఎస్‌పిలో కాలువల్లో చెట్లు మెలిచాయని, ఇప్పుడు వాటికి మరమ్మత్తులు జరుగుతున్నాయని అన్నారు. ఒక్కసారి కాళేశ్వరం దగ్గర బటన్ ఆన్ చేస్తే దాదాపు పది నెలలు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల్లో నీళ్లు నిండి ఉంటాయని పేర్కొన్నారు. ఇదే సంవత్సరంలో వర్షాకాలం తర్వాత కాకతీయ కాలువ నీళ్లు లేకుండా ఉండదని, అది మీ కళ్లారా మీరు చూడబోతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి విద్యావంతుడు, సౌమ్యుడు అయిన దయాకర్‌ను గెలిపించాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తాం
భూముల విషయంలో దేశంలో ఎవ్వరూ చేయని సాహసం మనం చేశామని సిఎం కెసిఆర్ అన్నారు. పాస్‌బుక్‌లను మార్చామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో కొత్త రెవిన్యూ చట్టం ద్వారా మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ప్రతి జిల్లాకు తానే స్వయంగా వచ్చి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి కోర్టు వివాదం లేని భూమికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కారం చేసి అధికార పత్రాలు ఇస్తానని హామీ ఇచ్చారు. రైతుల పోడు భూముల సమస్య, పట్టా భూములు, సాదా బైనామాల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఆ లోపు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని అన్నారు. మిషన్ భగీరథ త్వరలోనే పూర్తి కాబోతుందని చెప్పారు. ప్రభుత్వం అంటే ఇట్లా కూడా పనిచేస్తదా అనే లాగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని వ్యాఖ్యానించారు.

ఎస్‌సి వర్గీకరణ జరగాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలె
దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు పేదరికంలో మగ్గుతున్నారని చెప్పారు. మన దగ్గర ఎస్‌సి వర్గీకరణ చేయమని అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానం చేసినా చేయలేదని అన్నారు. మోడీ బతిమాలి అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎందుకు ఇవ్వరు…నీ అయ్య అదేమన్న నీ అయ్య జాగీరా…? మన రాష్ట్రంలో మేం చేసుకుంటామని అంటున్నామని చెప్పారు. కేంద్రం తలుచుకుంటే ఒక రాష్ట్రానికి పరిమితం చేసి కూడా 371డి లాగా ఇవ్వొచ్చు కానీ ఇవ్వరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇవ్వలె… బిజెపి కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. ఎస్‌సి వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం కావాలంటే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే రావాలె…ప్రాంతీయ పార్టీల పెత్తనమే నడవాలె అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ల దగ్గర పెట్టి కూర్చుకున్నారని, రాష్ట్రాల హక్కులు, అధికారాలు వాళ్లే లాగేసుకున్నారని తెలిపారు. ‘గడ్డి వాము మీద కుక్క కూర్చున్నట్లు వాళ్లు మెయ్యరు..ఇంకొకరిని మెయ్యనియ్యరు’ అని అన్నారు. పని చెయ్యరు…చేసేవాళ్లను చేయనియ్యరు…విదేశాంగ నీతి పట్టించుకోరు…పాకిస్తాన్ సమస్యను పరిష్కరించరు…ఆర్థిక విధానం పెంచరు…వ్యవసాయ ధరలు రావు…కానీ రాష్ట్రాల ఎంబడి పడి చిల్లర రాజకీయాలు చేస్తరని అని వ్యాఖ్యానించారు.

దయాకర్‌ను గెలిపిస్తాం: ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ ఏకతాటిపై నడిపించి, అత్యధిక మెజారిటీతో వరంగల్ లోక్‌సభ సభ్యునిగా పసునూరి దయాకర్‌ను గెలిపిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అధ్యక్షతన మంగళవారం ఆజంజాహీ మిల్లు ప్రాంగణంలో టిఆర్‌స్ ప్రచార సభ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా దయాకరరావు మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లతో త్వరలోనే తెలంగాణలో అధిక భాగం నీరొస్తుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తాను ఉన్నా, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలంటే, ప్రధానమంత్రిగా కెసిఆర్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం నిర్వహిస్తున్న మైదానానికి మంచి చరిత్ర ఉందని, ఆజంజాహి మిల్లు ప్రాంగణంలో సమావేశం పెట్టిన జవహర్‌లాల్ నెహ్రూ, పివి నరసింహారావులు ప్రధానమంత్రులు అయ్యారని, ఇప్పుడు కెసిఆర్ కూడా పిఎం అవుతారని మైదానం సెంటిమెంటును తెలియజేశారు. వరంగల్ ఎంపి అభ్యర్ధి పసునూరి దయాకర్ మాట్లాడుతూ 2015లో తనను 4.6 లక్షల మెజారిటీతో గెలిపించారని, ఇప్పుడు అంతకు మించిన మెజారిటీని ఇవ్వాలని కోరారు. కెసిఆర్‌ను తాను ఎన్నటికీ మరవలేనన్నారు. ఉచిత వ్యవసాయ కరెంటు, రైతు భీమా, రైతు భీమా, పెన్షన్, సంక్షేమ రాజ్యంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు చెందిన 16 ఎంపిలు ఖచ్చితంగా గెలుస్తారని, వారందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ప్రశంసించారు. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ కోటి ఎకరాల మాగాణి కోసం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయడానికి కేంద్రం నుంచి నిధులు రావాలని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర నిధులు పొందాలంటే 16 మంది టిఆర్‌ఎస్ అభ్యర్ధులను ఎంపిలుగా గెలిపించాలని పిలుపునిచ్చారు. 40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి రూపశిల్పి పసునూరి దయాకర్‌ను రెండోసారి ఎంపిగా గెలిపించాలని వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ గతంలో పశ్చిమ బెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం ఏం చేస్తే దేశమంతా అదే చేస్తుందన్న సామెత ఉండేదని, దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తిరగరాశారని ప్రకటించారు. ఇప్పుడు సంక్షేమ పథకాల కోసం తెలంగాణ వైపు దేశం చూస్తుందన్నారు. గతంలో వచ్చిన మెజారిటీ రికార్డును బ్రేక్ చేస్తూ దయాకర్‌ను ఎంపిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమన్వయకర్తగా, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అధ్యక్షతన సభ జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, ధర్మారెడ్డి తదితరులు ప్రసంగించారు. కళాకారుడు సాయిచంద్ బృందం ఆట పాటా అందరినీ అలరించాయి.

CM KCR Addressing At Warangal Parliament Election Campaign Meeting