Home తాజా వార్తలు కోటి ఎకరాలకు నీరందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం

కోటి ఎకరాలకు నీరందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం

harish-rao

మెదక్: ఒకరేమో ఉచిత కరెంటు అసాధ్యమన్నారు…ఉచిత కరెంటు వస్తే కరెంటు తీగలపై బట్టలు ఎండేస్తారని ప్రచారం చేశారు.. వ్యవసాయం దండుగ అనడంతో పాటు పరిహారం ఇస్తే ఆత్మహత్యలు ఎక్కువయితాయని ప్రచారం చేశారు…మరొకరు పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని రైతులు ఆందోళన చేస్తే తుపాకులతో కాల్చి చంపారు. వీరు 59 ఏళ్లకు పైగా పాలించి నేడు మొసలి కన్నీరు కార్చుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, అసెంబ్లీ వ్యవహారాలు, భూగర్భ జలవనరులు, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి, ఫీడర్ చానల్ కాలువ సిమెంటు లైనింగ్ కోసం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి ఆదివారం శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి వనరులు లేక తెలంగాణ ప్రాంతం అల్లాడుతుంటే సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్షం వహించాయన్నారు. ఇన్నేళ్ల పాలనలో మెదక్ జిల్లాకు గానీ, తొగుట మండలానికి గానీ ఒక్క ఎకరానికి నీళ్లందించారా అని ఆయన ప్రశ్నించారు. నిజాం హాయాంలో నిర్మించిన ఫీడర్ చానల్‌కు కొంత సిమెంటు లైనింగ్‌గైనా వేశారా అని ప్రశించారు. వీరి పాలన మూలంగానే రైతులు బోర్లు వేసుకొని ఆత్మహత్యల పాలయ్యారని వీరి మరణానికి కారణమైన వీరు నేడు ధర్నాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు, మెదక్ జిల్లాలో 3లక్షల ఎకరాలకు నీరందించడమే లక్షంగా కెసిఆర్ కృషి చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో సాగునీటి కష్టాలు తీరుతాయని, అప్పటి వరకు గోడాన్‌ల నిర్మాణం, చెరువు, కుంటల అభివృద్ది, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం జరుగుతుందన్నారు. సాగునీరు అందించి రైతుల కళ్లలో ఆనందం చూడటానికి పనిచేస్తున్నామని, అప్పుడే వారిని నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని అన్నారు. చెరువులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని, రైతుల కష్టాలు తీర్చడానికి కృషిచేయడం జరుగుతుందన్నారు.