Home తాజా వార్తలు 17 నుంచి కెసిఆర్ ప్రచార భేరీ

17 నుంచి కెసిఆర్ ప్రచార భేరీ

KCR and KTRహైదరాబాద్: టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 17వ తేదీన కరీంనగర్ నుంచి మొదలుపెట్టనున్నారు. ఆ తర్వాత 19న కుమార్తె కవిత పోటీచేసే నిజామాబాద్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం పదిహేడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కెసిఆర్ ఎన్నికల ప్రచారం చేయడానికి ప్రాథమిక షెడ్యూలు ఖరారుకాగా పూర్తి స్థాయి షెడ్యూలు ముగింపు దశలో ఉంది. మజ్లిస్ పోటీచేసే హైదరాబాద్ నియోజకవర్గంలోనూ కెసిఆర్ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఆయా నియోజకవర్గాల ఎంపిలు ఊహించినదాని కంటే ఎక్కువ ఫలితాన్నే ఇచ్చినందున ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌ఏలు భారీ మెజారిటీ గెలిపించే బాధ్యతను తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. టిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించి ఎంఎల్‌ఏలకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన నిర్దేశం చే శారు. ఒక్కో సభకు కనీసంగా రెండు లక్షల మంది ప్రజలను సమీకరించే ల క్ష్యాన్ని పెట్టారు. కెసిఆర్ బహిరంగ సభల షెడ్యూలుకు అనుగుణంగా పార్లమెంటరీ సన్నాహక సమావేశాలకు ఇప్పటికే రూపొందించుకున్న షెడ్యూలులో కెటిఆర్ కొన్ని మార్పులు చేశారు.

కెసిఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్
టిఆర్‌ఎస్‌కు సెంటిమెంట్‌గా కలిసివస్తున్న కరీంనగర్ నుంచి సిఎం కెసిఆర్ ఈ నెల 17న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భారీ బహిరంగసభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగితే టిఆర్‌ఎస్ పార్టీకి ఖచ్చితంగా వేస్తారని, కాంగ్రెస్ అభిమానులు సైతం ప్రభుత్వ పథకాల లబ్దిదారులుగా ఉన్నందున వారి ఇండ్ల కూ వెళ్ళి ఓట్లను అడగాలని సిఎం కెసిఆర్ శాసనసభాపక్ష సమావేశంలో ఎంఎల్‌ఏలకు, పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతాయుతంగా వ్యవహరించినా పార్లమెంట్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించే గురుతర బాధ్య త టిఆర్‌ఎస్ శాసన సభ్యులపై ఉందని నొక్కిచెప్పారు. నియోజకవర్గాల వారీగా శాసనసభ ఎన్నికల్లోకంటే భారీ మెజారిటీ సాధించాలని స్పష్టం చేశారు. ప్రతీ హామీని నెరవేరుస్తుండటంతో ప్రజలంతా టిఆర్‌ఎస్ పక్షం లో ఉన్నారనే అంశాన్ని గమనించి శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధు లు, పారీశ్రేణులు అంకితభావంతో పార్లమెంట్ సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిఎం కెసిఆర్ ఈ సమావేశంలో ఆదేశించారు.

కెటిఆర్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
టిఆర్‌ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పార్లమెంట్ ఎన్నికల ప్రచార షెడ్యూలు వెల్లడికావడంతో కెటిఆర్ నిర్వహిస్తున్న సన్నాహాక సమావేశాల షెడ్యూలులో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 13న ఉదయం 10.30కి నిజాంసాగర్ ప్రాజెక్టు మైదానంలో జరగనున్న జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం, మధ్యాహ్నం 2.30 కి ఇంపీరియల్ గార్డెన్‌లో జరగనున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం యదావిధిగా జరుగుతుంది. కానీ ఆ తర్వాతి రోజుల్లో పేర్కొన్న షెడ్యూలులో మాత్రం మార్పులు జరిగాయి. సవరించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు పెద్దపల్లి, 16న మధ్యాహ్నం 2.30 గంటలకు నల్గొండ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. 19న సిఎం కెసిఆర్ నిజమాబాద్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో 14న జరగనున్న నిజమాబాద్, ఆదిలాబాద్, 16న జరగనున్న మహబూబాబాద్, ఖమ్మం, 17న నల్గొండ,మహబూబ్ నగర్ సన్నాహక సమావేశాలు రద్దయ్యాయి.

CM KCR campaign from 17th for Parliament Election 2019