Home తాజా వార్తలు రేపు దుబాయ్‌కి సిఎం కెసిఆర్ ?

రేపు దుబాయ్‌కి సిఎం కెసిఆర్ ?

CM KCR Dubai travel

 

పెట్టుబడుల సదస్సులో
పాల్గొనేందుకు పయనం
సిఎం వెంట మరో నలుగురు అధికారులు
వారం రోజులపాటు పర్యటన

పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు పయనం
సిఎం వెంట మరో నలుగురు అధికారులు 

మన తెలంగాణ / హైదరాబాద్ : దుబాయ్ నగరంలో ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ‘ఇన్వెస్టర్స్ మీట్’లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మరో నలుగురు అధికారులు ఆదివారం బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన ‘పొలిటికల్ క్లియరెన్స్’ తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు గురువారం రాత్రి లేఖ అందింది. ముఖ్యమంత్రి వెంటన ఆయన కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా వెళ్ళనున్నారు.

ఈ ఐదుగురికి అవసరమైన పొలిటికల్ క్లియరెన్స్ ప్రక్రియను సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకు విదేశాంగ శాఖ నుంచి అనుమతి కోరుతూ జిఏడి అధికారులు లేఖ రాశారు. అయితే షెడ్యూలును కొద్దిగా కుదించుకోవడం మంచిదంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించినట్లు తెలిసింది. తుది అనుమతి కోసం ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైల్ ప్రధాని కార్యాలయానికి చేరినట్లు సమాచారం. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చే సూచనలు, అనుమతి ప్రకారం ఈ పర్యటనలో అవసరమైన మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని రాష్ట్ర జిఏడి అధికారులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం కల్లా స్పష్టత రావచ్చని తెలిసింది.

విభాగాల కార్యదర్శులకు అదనపు బాధ్యతలు
దుబాయ్ పర్యటనకు సిఎం కెసిఆర్ వెళ్ళడంపై అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం రానప్పటికీ నలుగురు అధికారులు వెళ్ళడం మాత్రం దాదాపు ఖాయమైనట్లు తెలిసింది. ఈ నలుగురు అధికారుల దుబాయ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఇతర విభాగాలకు చెందిన కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు (జిఓ నెం. 26) శుక్రవారం జారీ చేశారు. పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ దుబాయ్ వెళ్తున్నందువల్ల ఆ శాఖ బాధ్యతలను ఆయన తిరిగొచ్చేంత వరకు నిర్వహించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌కు అదనంగా అప్పగించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటి తదితర శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా వెళ్తున్నందున ఆయన బాధ్యతలను తిరిగి వచ్చేంత వరకు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ చూసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించారు.

CM KCR Dubai travel to participate in tomorrow investors meet

Telangana Latest News