Home తాజా వార్తలు వారికి ఓటు అడిగే హక్కు లేదు…

వారికి ఓటు అడిగే హక్కు లేదు…

KCR Campaignఅలంపూర్: ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సిఎం కెసిఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్  ప్రజా ఆశీర్వాద సభలో పిలుపునిచ్చారు. సిఎం మాట్లాడుతూ… 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టిడిపి ఒక వైపు ఉంటే… 15ఏళ్లు ఉద్యమం చేసిన టిఆర్ఎస్ ఓ వైపు ఉందని, కాబట్టి పనిచేసిన వారు ఎవరున్నారనేది ఆలోచించాలని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెచ్చామని, ఆసరా పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, నిరుద్యోగ భృతి అందిస్తున్నామన్నారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5లక్షల బీమా అందజేస్తున్నామని చెప్పారు. టిఆర్ఎస్ కేవలం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిందనే విషయం ప్రజలకు  బాగా తెలుసన్నారు.

కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని, వారికి ఎందుకు ఓటయ్యాల్నో నిలదీయండి అని సిఎం అన్నారు. సమైక్య పాలకులు పాలమూరును నిర్లక్ష్యం చేశారని, కూటమికి ఓటేస్తే  తుమ్మిళ్ల ప్రాజెక్టు నుంచి నీళ్లు రావని, ఓట్ల ద్వారా అలంపూర్ పౌరుషం చూపించాలన్నారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల నుంచి అదనంగా 40వేల ఎకరాలకు సాగునీరందిస్తామని, తుమ్మిళ్ల పనులు శరవేగంగా జరిపిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీఎస్ తూములను మూసివేస్తామని ఆనాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెదిరిస్తే ఆర్డీఎస్ తూములను మీరు మూసివేస్తే నేను బాంబులతో బద్దలు కొడతానని బెదిరించానన్నారు. ఆనాడు టిడిపి, కాంగ్రెస్ నాయకలు నోరు మూసుకుని కూర్చున్నారని విమర్శించారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు మేము ధీటుగా సమాధానం చెప్పామని కెసిఆర్ చెప్పుకొచ్చారు. 11న ఓట్ల లెక్కింపు రోజు ఆర్డీఎస్ కాల్వలో నీరు పారినట్టు… కౌటింగ్ చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీకి ఓట్ల వరద పారి లక్ష ఓట్ల మెజార్టీతో మన అభ్యర్థి అబ్రహాం గెలుపొందాలని కెసిఆర్ అన్నారు.