Home తాజా వార్తలు ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సిఎం

ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సిఎం

CM KCRహైదరాబాద్: తెలంగాణలోని ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టులపై ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో కెసిఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… కృష్ణా నది ప్రాజెక్టులకు నీరందకపోతే గోదావరి నీరు అందేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని అనుకూలతలు ఉన్న ఖమ్మం జిల్లాలో కరవు క్షమించరాని నేరమన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని చెప్పారు.

దుమ్ముగూడెం నుంచి బయ్యారం వరకు గోదావరి నీరు ఎత్తిపోసి సాగునీరివ్వాలన్నారు. అవసరమైన చోట్ల జలాశయాలు, ఎత్తిపోతలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల ద్వారా నీరు అందని ప్రాంతాలను గుర్తించి, స్థానిక వనరుల ద్వారా సాగునీరు అందించాలన్న సిఎం… అటవీహక్కుల చట్టం, అసైన్డ్ భూములకు సైతం సాగునీరు అందించాలన్నారు. సమైక్య పాలనలో ఎక్కువగా మహబూబ్‌నగర్ జిల్లా నష్టపోయిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల ద్వారా ఎక్కువ ప్రాజెక్టులు రూపకల్పనతో నీరు సరిపోని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ద్వారా ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అవసరమైన జలాశయాల నిర్మాణం ఎక్కడికక్కడ పూర్తి చేసి.. చెరువులు నింపే ప్రణాళిక రూపొందించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR For Early Completion Of Irrigation Projects