Home తాజా వార్తలు కాళేశ్వరంలో సిఎం కెసిఆర్ పర్యటన

కాళేశ్వరంలో సిఎం కెసిఆర్ పర్యటన

CM-KCRహైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్‌టిపిసి గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ఆయన హెలికాప్టర్ ద్వారా ఆదివారం ఉదయం 6.40 గంటలకు మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంపుహౌజ్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన సమీపంలోని కాళేశ్వరం ఆలయం సందర్శిస్తారు. ఉదయం 6.50 గంటలకు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఉదయం 7.25 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు బయల్దేరుతారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మిస్తుంది. ఉదయం 7.45 గంటలకు సిఎం అక్కడికి చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటల వరకు మేడిగడ్డ బరాజ్ వద్ద ఉంటారు. దాదాపు 5.45 గంటల పాటు మేడిగడ్డలో బరాజ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బరాజ్, గేట్ల బిగింపు, కరకట్టల నిర్మాణం, రివీట్‌మెంటు పనుల పురోగతిపై సిఎం సాగునీటి శాఖ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహిస్తారు.

ఈ వానాకాలం నుంచే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన సిఎం చివరగా గత జనవరి ఒకటిన మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం సాగునీటి శాఖ ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ బరాజ్ నిర్మాణ పనుల పూర్తికి గడువు నిర్దేశించారు. దీంతో పనుల్లో మరింత వేగం పెరగడం వల్ల ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ నిర్మాణం తుది దశకు చేరింది. వీటిని స్వయంగా పరిశీలించేందుకు సిఎం కెసిఆర్ మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించనున్నారు.

భారీ భద్రతా ఏర్పాట్లు..

సిఎం పర్యటనను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్.పి ఆర్.భాస్కరన్, మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్, కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం సికెఆర్ పర్యటించే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్సీ ఐజి నవీన్‌చంద్ కాళేశ్వరం చేరుకుని సెక్యూరిటీపై పోలీసు అధికారులతో చర్చించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనే పూజల ఏర్పాట్లను పరిశీలించారు.

CM KCR Kaleshwaram Tour