Home తాజా వార్తలు త్వరలో ఎంపిలతో సిఎం విందు భేటీ

త్వరలో ఎంపిలతో సిఎం విందు భేటీ

CM KCR

 

మన తెలంగాణ / హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడనుండడంతో అప్పటికల్లా అభ్యర్థులను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. మొత్తం పదహారు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం ‘మిషన్ 16’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి అడుగేయాలని భావిస్తున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల్లో ముగ్గురు లేదా నలుగురిని తప్పించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అర్థం చేయించడంతో పాటు ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందో స్వయంగా వారికే వివరించాలని కెసిఆర్ భావిస్తున్నారని, ఈ నెల 15 లేదా 16 తేదీల్లో వారిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించి సమావేశం కావాలనుకుంటున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చేవెళ్ళ ఎంపిగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇదే తరహాలో మరో మూడు నియోజకవర్గాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని ఖరారు చేయాలనేదానిపై సెంటిమెంట్లకు తావులేకుండా గెలుపే లక్షంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయానికి అవసరమే లేదని, ఎలాగూ ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 25వ తేదీ వరకు వారం రోజుల అవకాశం ఉన్నందువల్ల తొందరపడి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అన్ని అంశాలనూ కూలంకషంగా ఆలోచించడంతో పాటు సిట్టింగ్ ఎంపిల అభిప్రాయాలను తెలుసుకుని, వారికి అర్థం చేయించి వారి సమక్షంలోనే అభ్యర్థులను ఖరారు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో ఒకటి ఎంఐఎంకు పోగా మిగిలిన పదహారు స్థానాల్లో గెలవాల్సిన అవసరం, ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ పోషించనున్న పాత్ర తదితరాలన్నింటినీ లంచ్ సమావేశంలో సిట్టింగ్ ఎంపిలతో చర్చించనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ స్వంతంగా పదకొండు మంది ఎంపిలను గెలుచుకోగా అందులో చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఆ సంఖ్య పదికి తగ్గింది.

అయితే కాంగ్రెస్ తరఫున గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి తరఫున గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం తరఫున గెలిచిన మల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ సంఖ్య 13కు చేరుకుంది. ఎలాగూ ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నందున సికింద్రాబాద్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, నాగర్‌కర్నూల్ నుంచి గెలిచిన నంది ఎల్లయ్య మినహా మిగిలినవారంతా టిఆర్‌ఎస్‌తోనే ఉన్నట్లయింది. మొత్తం పదిహేడు మంది ఎంపిల్లో కేవలం ఇద్దరు మినహా మిగిలినవారంతా టిఆర్‌ఎస్‌తోనే ఉన్నందున ఈసారి ఆ అవకాశం కూడా లేకుండా మొత్తం ఎంపిలను గెల్చుకోవాలని కెసిఆర్, కెటిఆర్ భావిస్తున్నారు.

కెసిఆర్ ఏర్పాటు చేయనున్న లంచ్ సమావేశానికి 11 మంది ఎంపిలు హాజరయ్యే అవకాశం ఉంది. పెద్దపల్లి ఎంపిగా ఉన్న బాల్క సుమన్, మల్కాజిగిరి ఎంపిగా ఉన్న మల్లారెడ్డి రాజీనామా చేయడంతో వారు శాసనసభ్యులుగా మాత్రమే అవకాశాన్ని బట్టి ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినందున ఆయన కూడా హాజరుకారు. సిట్టింగ్ ఎంపిల్లో ముగ్గురికి టికెట్ ఇవ్వడానికి అవకాశం లేకపోయినప్పటికీ పార్టీ వారికి తగిన అవకాశాలు ఇస్తుందని, వారి సేవలను మరో రకంగా వినియోగించుకుంటుందని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.

CM KCR Meet With TRS MP’s in Telangana