Home తాజా వార్తలు ఆదర్శ గ్రామ స్వరాజ్యం

ఆదర్శ గ్రామ స్వరాజ్యం

పరిషత్‌లకు రూ.10 కోట్లు అదనంగా ఇస్తాం
గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్‌లాగా అన్ని గ్రామాలు ఆదర్శంగా మారాలి
పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిది
ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండాలి
32 జిల్లా పరిషత్‌లు ఎప్పుడూ రాలేదు
ఇప్పుడు బరువు, బాధ్యతలు మరింత పెరిగాయి
ప్రస్తుతం విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి
గ్రామాలను అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది
జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో సిఎం కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకశంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం తీసుకు రావాలని సిఎం వారితో పేర్కొన్నారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్‌లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా అన్ని గ్రామాలు మారాలని సిఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్థిల్లాలన్న ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన కోరారు.
మన జీవితం చాలా చిన్నది
జిల్లా పరిషత్ చైర్మన్లగా, వైస్ చైర్మన్లగా ఏకపక్ష విజయం సాధించినందున అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, గెలిచిన వారికి ఈ సందర్భంగా కెసిఆర్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఐదేళ్ల కాలంలో గెలిచిన వారు మంచి పేరు తెచ్చుకోవాలని, పనిచేసే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని తాను ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ఉన్నత పదవులు అధిష్టించాలని కెసిఆర్ ఆకాంక్షించారు. గెలిచిన వారు తమ పదవిని నిలబెట్టుకుంటే అంత మంచిదని, ఎవరూ కూడా పుట్టినప్పుడు అన్నీ నేర్చుకోలేదని ఆయన హితవు పలికారు. పరిస్థితులను బట్టి నేర్చుకుంటూ పోవాలని, మనిషి చివరి శ్వాస విడిచేవరకు జ్ఞాన సముపార్జన చేసుకోవాలని ఆయన వారికి సూచించారు. మన జీవితం చాలా చిన్నదని, ఆ కాస్త సమయంలోనే మంచి పేరు తెచ్చుకోవాలని, అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడని, కానీ మూర్ఖుడు జ్ఞానీ కాలేడని సిఎం పేర్కొన్నారు. అజ్ఞానీ తనకే అన్నీ తెలుసనీ అనుకుంటాడని, అలా కాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న వారే తాము ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలగుతారన్నారు. అన్ని విషయాల్లాగానే పంచాయతీ రాజ్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని ముఖ్యమంత్రి వారికి ఉద్భోదించారు.
మన సహజత్వాన్ని కోల్పోకూడదు
పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదని, అలా చేస్తే మన వెనుక ఉన్న జనం నవ్వుతారని, లేనిపోని దర్ఫం తెచ్చుకోకూడ దన్నారు. పదవి రాగానే మారిపోకూడదు, మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం దానంతట అదే వస్తుందన్నారు. పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిదని, మన వ్యవహార శైలే మనకు లాభం చేకూరుస్తుందని కెసిఆర్ వారితో పేర్కొన్నారు. ప్రజలకు అనేక సమస్యలుంటాయి, వారు ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ దగ్గరికి వస్తారన్నారు. అప్పుడు నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినడం, అదే మీరు చేయాలని, ఓపికగా వారి సమస్యలను సావధానంగా వినాలని, వాళ్లను కూర్చోబెట్టి మర్యాద చేయాలని, అప్పుడే వాళ్లకు రిలీఫ్ వస్తుందన్నారు. ఆ తరువాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయాలని, సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచి పేరు వస్తుందని, మంచిపేరుతోనే ఉన్నత స్థాయి వస్తుందని సిఎం పేర్కొన్నారు.
ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండాలి
ప్రతివారు మీ మీ సామర్థ్యాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి ఈ పదవుల్లోకి వచ్చారు. ఇదంతా మీమీ సత్ప్రవర్తన వల్లే వచ్చింది. మంచి పనులు చేయడానికి పెట్టుబడులు అవసరం లేదని కెసిఆర్ సూచించారు. సరళంగా మాట్లాడడమే ఏ రోజునైనా మనకు పెట్టని కోట అని ఆయన వారితో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారన్నారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయన్నారు. విజయాలు, అపజయాలు సర్వసాధారణమని, కానీ రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండడం ప్రాథమిక లక్షణమని సిఎం పేర్కొన్నారు.
విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి
గతంలో జడ్పీ చైర్మెన్లకు పెద్దగా పనిలేదని, ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించానని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ జడ్పీ చైర్మెన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ రాంక్ ఇచ్చామని, వాళ్లు ఇక ముందు క్రియాశీలకంగా పని చేస్తారన్నారు. అవసరమైన సహాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చారని, ఏ విధంగానైనా ఈ వ్యవస్థను పటిష్టం చేయాలన్న ఆలోచనలో తాను ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింప చేస్తామని, ఇంత ఏక పక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నిక ఫలితాలు ఎప్పుడూ రాలేదన్నారు. దీంతో పాటే మీకు బరువు, బాధ్యతలు పెరిగాయని, మీ పాత్ర ఉన్నతంగా ఉండాలని కెసిఆర్ సూచించారు. జిల్లాపరిషత్ క్రియాశీలకం కావాలని, మీ విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి అని కెసిఆర్ వివరించారు.
మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్‌మెంట్
పంచాయతీరాజ్ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన ఆరంభ రోజుల్లో దీనికి రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్ర ఉండాలని, అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టాలని కెసిఆర్ గెలిచిన వారికి సూచించారు. కేంద్రీకృత పాలనపై క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదని, ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్భుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారని, దీని మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అని కెసిఆర్ పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కొత్త రోజుల్లో అమెరికా వెళ్లినప్పుడు ఆ దేశాధ్య క్షుడు ఐసన్ హోవర్ ఆయనకు ఎస్కేడేను పరిచయం చేశారని, ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడని, అవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని ఐసన్ హోవర్ నెహ్రూకు చెప్పారన్నారు. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పొగడడంపై సంతోషం వ్యక్తం చేసిన నెహ్రూ భారత దేశానికి రమ్మని ఎస్కే డేను ఆహ్వానించాడని ఆయన తెలిపారు. నెహ్రూ ప్రథమ పంచవర్ష ప్రణాళికలో భారతదేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం తనకు అభ్యంతరమని, అది తప్పనీ, మొదలు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని డే సూచించారు. నెహ్రూ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించాడని, నెహ్రూ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత మంత్రి మండలిలో, పార్టీలో ఎస్కే డే సలహా మీద చర్చించారన్నారు. ఫలితంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతక్రమం మారిందని కెసిఆర్ వారితో చెప్పుకొచ్చారు.
గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు
ఆధునిక దేవాలయాల పేరిట భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమయ్యిందని కెసిఆర్ తెలిపారు. అప్పటి ఆ మార్పువల్ల ఈ రోజున ఆహార రంగంలో స్వావలంభన వచ్చిందన్నారు. నెహ్రూ తీసుకువచ్చిన మార్పువల్ల సంతోషించిన ఎస్కే డే భారత దేశానికి వస్తానని నెహ్రూకు లేఖ రాశారని, అలా ఆయన ఇండియాకు వచ్చారన్నారు. ఆయన్ను తక్షణమే రాజ్యసభ సభ్యుడిగాను, కేబినెట్ మంత్రిగా నెహ్రూ చేశారన్నారు. ఆయనకు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ శాఖను కేటాయించారని, గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయన వెంటనే కార్యక్రమం మొదలుపెట్టారని, హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఎన్‌ఐఆర్డీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. హైదరాబాద్ నుంచే యావత్ భారతదేశానికి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ఆయన విస్తరింప చేశారని కెసిఆర్ తెలిపారు. అప్పట్లో ఆయన దేశంలోనే మొట్టమొదటి సమితి (పటాన్ చెరువు) అధ్యక్షుడిగా పి.రామచంద్రారెడ్డిని నియమించారని, అలా పంచాయితీరాజ్ ఉద్యమం మొదలయ్యిందని అని కెసిఆర్ వివరించారు.
పంచాయితీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు
చాలా కాలం పంచాయితీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయని కెసిఆర్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేదని, దురదృష్ట వశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడిందన్నారు. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్రత వాతావరణం కొట్టవచ్చినట్లు కనబడుతుందని, గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదన్నారు. పల్లెలు పెంటకుప్పల లాగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకీ క్షీణత? మంచినీళ్ల గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు, గ్రామాల్లోనే ఉంది. గ్రామాలు మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన సూచించారు. గెలిచిన వారంతా విద్యాధికులని, పరిస్థితులను అర్థం చేసుకుంటారని, గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. భయంకరమైన గ్రామాల పరిస్థితుల్లో మార్పు రావాలని, అది గుణాత్మకమైన మార్పు కావాలన్నారు.
ఏడురోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యా
పంచాయితీ రాజ్ విషయంలో అవగాహన పెంచుకోవడానికి, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్‌ఐఆర్డీలో శిక్షణకు వెళ్లానని కెసిఆర్ వారితో పేర్కొన్నారు. అక్కడే హాస్టల్‌లో ఆరు రోజుల పాటు ఉండి ఏడురోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన తెలిపారు. తనకు దానిపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని, మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలని కెసిఆర్ వారికి సూచించారు. గెలిచిన వారందరూ జూలై నెలలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని, ఈ లోపుగా గెలిచిన వారంతా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (Telangana State Rural development Institute)లో శిక్షణ తీసుకోవాలన్నారు. దానికి అధికారులు కూడా ఒక మంచి కోర్స్ డిజైన్ తయారు చేస్తారన్నారు.
పంచాయితీ రాజ్ చట్టం చాలా కఠినంగా ఉంది
గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయితీ రాజ్ చట్టం చాలా కఠినంగా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. కార్యదర్శి చక్కగా పనిచేస్తేనే, అనుకున్న ఫలితాలను సాధిస్తామని, మూడేళ్ల తరువాత వారి సేవలను క్రమబద్ధీకరిస్తామన్నారు. పంచాయితీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ ఉండాలని, అలాగే డిపిఓ, డిఎల్పీఓ, ఈవోఆర్డీ, ఎంపిడిఓలతో బాగా పనిచేయించాలన్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తామని, ఆర్నెళ్లలో పూర్తి మార్పు కనబడాలి అని సిఎం పేర్కొన్నారు.
32 జిల్లాలు అగ్రభాగాన నిలవాలి
ఏ జిల్లా పరిషత్ అగ్రభాగాన పోతే, ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేస్తామని కెసిఆర్ హామీనిచ్చారు. ఒకటి కంటే ఎక్కువ పరిషత్ లు ముందుకు పొతే వాళ్లకు ఆ నిధులను మంజూరు చేస్తామన్నారు. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలవాలని, దీనికి కొన్ని బెంచ్ మార్క్‌లు, ప్రమాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ కలిసి రూ. 320 కోట్లు పొందాలని, ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్‌కు కొత్త కార్లు కొని ఇస్తామని, చాలా మంచి మార్పు తీసుకు రాగలమన్నభావన ప్రజల్లో తీసుకు రాగలిగితే అంతకన్నా గొప్ప విషయం లేదని, ఇది తన ఆకాంక్ష అని, దీనిని నెరవేర్చాలని కెసిఆర్ వారికి సూచించారు. ప్రజల్లో బాగా తిరిగి పంచాయితీరాజ్ సంస్థను బలోపేతం చేయాలని, క్రియాశీలకంగా గ్రామం అభివృద్ధి జరగాలంటే దానిని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కెసిఆర్ వారికి సూచించారు. దానికి మీరందరూ నాయకత్వం వహించాలని, ఇది కిందివారికి స్ఫూర్తి కావాలని, ఎలాగైతే తెలంగాణ సాధించామో అలాగే గ్రామాల అభివృద్ధి జరగాలని కెసిఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రవేశం పెట్టిన పథకాలకు ప్రజల్లో ఆదరణ
మన ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశ పెట్టిన పింఛన్, రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలు ఆదరణ పొంది, ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయని కెసిఆర్ పేర్కొన్నారు. అందుకే వాళ్ల రుణం మనం తీర్చుకోవాలని, దీనికి ఎక్కువ పాత్రధారులు మీరేనని కెసిఆర్ వారితో పేర్కొన్నారు. మండలాధ్యక్షులను మీలాగే తయారు చేయాలని, వారికి కూడా అవగాహన కలిగించాలని, సందేశాత్మకంగా మాట్లాడాలన్నారు. ఆ స్థాయి రావడానికే శిక్షణ ఇప్పిస్తున్నామని, ఏ ఉద్యమ స్ఫూర్తితో ఎస్కే డే పంచాయితీరాజ్ ను ప్రారంభించాడో, దాన్ని మనం ముందుకు తీసుకు పోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. 60% జనాభా ఉన్న గ్రామీణ ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. గ్రామాలను పట్టుకొమ్మల్లాగా చేయడంలో నిమగ్నమం కావాలన్నారు. అలా చేసి మీ జీవితాలను ధన్యం చేసుకోని, గొప్ప పేరు సంపాదించుకోవాలని కెసిఆర్ సూచించారు. అందులో ఉన్నా తృప్తి మరెందులోనూ లేదని, గ్రామీణ తెలంగాణాను అన్ని రకాల బాగుచేయడానికి మీ శక్తి-యుక్తులను ఉపయోగించాలని, ప్రతి గ్రామం ఒక గంగిదేవి పల్లి, ఒక అంకాపూర్, ఒక ముల్కనూర్ కావాలి అని కెసిఆర్ ఆకాంక్షించారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పరిషత్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను వారి స్థానాల దగ్గరికి పోయి కలిసి, ప్రతి ఒక్కరినీ పేరు-పేరునా అభినందించారు. వారందరితో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ.జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

CM KCR Meets to newly elected ZP Chairmans