Home తాజా వార్తలు ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు!

ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు!

Cultivation

నైరుతి ఆలస్యంతో దృష్టి సారించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ
పంటల సాగుపై జయశంకర్ వర్సిటీ, అధికారులతో సిఎం ఆరా
వర్షాలను బట్టి ప్రణాళికల్లో మార్పులు..
సిద్ధంగా స్వల్పకాలిక, మధ్యకాలిక రకాల విత్తనాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రుతుపవనాల రాకలో జాప్యం, వచ్చినా తరువాత వర్షాలు అనుకూలించకపోతే తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వ్యవసాయశాఖ దృష్టి సారించింది. అదనులో పదును కాకుంటే ఏ పంటలు సాగు చేయించాలనే దిశగా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. మరో రెండు రోజులు వేచి చూసి, ఈ ప్రణాళికలు విడుదల చేయనున్నట్లు తెలిసింది. స్వల్పకాలిక రకాలైన విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ సిద్ధంగా పెట్టుకుంది. ఈ నెల 23 వరకు రాష్ట్రానికి నైరుతి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఒకవేళ మరింత ఆలస్యమైనా, సరైన వానలు కురవకపోతే ఎలా అనేదానిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జాతీయ మెట్ట పరిశోధనల సంస్థ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కలిసి విడతల వారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా నైరుతి రుతు పవనాలు ఆలస్యం, రాష్ట్రంలోని పంటల సాగు పరిస్థితిపై జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారుల దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకుని ఆరా తీసినట్లు తెలిసింది.

వానల రాకలో ఏం తేడా వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయం వైపు మళ్లే విధంగా సిద్ధంగా ఉండాలని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 1.10 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని ముందుగా అంచనా వేసింది. అయితే నైరుతి ఆలస్యంతో దీనిని తగ్గించనున్నారు. వర్షధార పంటల్లో కూడా చాలా తక్కువ నీటితో రెండు, మూడు తడులు ఇస్తే పండే పంటల వైపు రైతులను మళ్లించనున్నారు. ఈ ఖరీఫ్‌లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాల పంపిణీ లక్షంగా ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే విక్రయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో వరి ఈసారి 2.80 లక్షల విత్తనాల పంపిణీ లక్షం ఉండగా, ఇప్పటి వరకు 31 వేల క్వింటాళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సోయాబీన్ 2 లక్షల క్వింటాళ్లకు గాను 85 వేల క్వింటాళ్లు విక్రయించారు. మొక్కజొన్న 80 వేల క్వింటాళ్లకు గాను ఒక్క క్వింటా కూడా రైతులు కొనుగోలు చేయలేదు.

వర్షాలు ఆలస్యం అవుతుండటంతో పత్తి సాగు తగ్గించడం, ఈ పంటను నల్ల నేలలకే పరిమితం చేయడం వంటివి ప్రత్యామ్నాయ ప్లాన్‌లో భాగంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ నీటి అవసరం లేని మొక్కజొన్న, జొన్న, కంది, సోయాబీన్ సాగును ప్రోత్సాహించనున్నారు. ఇందులో స్వల్పకాలిక రకాల విత్తనాలు వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ఉంచనుంది. మొక్కజొన్న, పత్తి , సోయాచిక్కుడు -జూలై 15 వరకు విత్తుకోవచ్చునని వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కంది జూలై 31 వరకు, పెసర, జొన్నలు జూన్ 30 వరకు, వరి నారు పోసుకోవడానికి దీర్ఘకాలిక రకాలు జూన్ 20 వరకు, మధ్యకాలిక రకాలు జూలై 10, స్వల్పకాలిక రకాలు జూలై 31 వరకు చేయవచ్చునని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువుల వాడకంపై, నీటి ఆదాపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

CM Kcr meets with Jayashankar varsity officials cultivation