Home తాజా వార్తలు విద్యుత్ రంగంలో అమోఘ విజయాలు

విద్యుత్ రంగంలో అమోఘ విజయాలు

kcr

ఈయన అనుభవమే అక్కరకొచ్చింది

మంగళవారం ఉదయం 10,429 మె.వా. రికార్డు డిమాండ్
ఒక్క నిమిషం కోత లేకుండా సరఫరా చేయగలిగారు
ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావుకు సిఎం ప్రశంస

విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభాకర్ రావు అనుభవం తెలంగాణలో విద్యుత్ విజయాలకు అక్కరకొచ్చిందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. జెన్ కో, ట్రాన్స్‌కో సంస్థలకు ఒకరే అధిపతిగా ఉంటే, సమన్వయం బాగుండి విద్యుత్ సంస్థలు బాగుపడతాయని, విద్యుత్ సరఫరా మెరుగవుతుందని తాను నమ్మానని, నేడు అదే నిజమైందని సిఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. సిఎండి ప్రభాకర్ రావుతో పాటు ఈ విజయానికి కారణమైన విద్యుత్ సంస్థల అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10,429 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడి, కొత్త రికార్డు నమోదైందని, గరిష్ట డిమాండ్ నమోదైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత విధించకుండా సమర్థవంతంగా సరఫరా చేయగలిగారని పేర్కొన్న సిఎం జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావును అభినందించారు. ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపిన సిఎండి ప్రభాకర్ రావు, కెసిఆర్ మార్గదర్శకం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయని వ్యాఖ్యానించారు. ఖరీఫ్ లో 11,500 గరిష్ట డిమాండ్ ఏర్పడుతుందనే అంచనా ఉందని, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని సిఎంకు వివరించారు.