Home తాజా వార్తలు మధ్యంతరమా? పూర్తిస్థాయా?

మధ్యంతరమా? పూర్తిస్థాయా?

CM KCR meeting

 

మధ్యంతరమా? పూర్తిస్థాయా?
బడ్జెట్‌పై అధ్యయనం చేయండి
అధికారులకు కెసిఆర్ ఆదేశం
ఇఎన్‌టి, దంత వైద్య క్యాంపులపై సమీక్ష
ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలు పూర్తికావాలని ఆదేశం

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను పెట్టాలా లేక పూర్తిస్థాయి బడ్జెట్‌గా ఉండాలో అధ్యయనం చేయాలని ఆ శాఖ అదికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాన్నున ఆర్థిక సంవత్సరం (2019-20) బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నందున కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమగ్ర స్వరూపం తెలియదని, రాష్ట్రాలకు ఏ రకమైన కేటాయింపులు ఉంటాయో స్పష్టత ఉండదని, అందువల్ల రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలా లేక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలా లేక కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అనుసరించే విధానానికి అనుగుుణంగా తిరిగి బడ్జెట్ పెట్టుకోవాలా? అనే విషయాలపై లోతుగా అధ్యయనం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు కెసిఆర్ సూచించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించడంతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనపై కూడా కెసిఆర్ చర్చించారు.
ఇఎన్‌టి, దంత వైద్య శిబిరాలకు ఏర్పాట్లు చేయండి :
నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘కంటి వెలుగు’ శిబిరాలను ఆగస్టు నుంచి నిర్వహిస్తున్న విధంగానే ఇకపైన చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు అనుగుణంగా క్యాంపులను ఏర్పాటుచేయడంపై దృష్టి సారించాలని, దానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. పంచాయితీ రాజ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని వివరించారు. ‘కంటి వెలుగు’ శిబిరాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నదని, ప్రజలకు ఎంతో ఉపయోగుపడుతున్నదని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ‘కంటి వెలుగు’ శిబిరాల తరహాలోనే ఇకపైన ప్రజలందరికీ ఫిబ్రవరి నుంచి చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి, ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఆ ప్రొఫైల్ ఆధారంగా ‘హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ’ తయారు చేయాలని అన్నారు.
ఎత్తిపోతల పథకాలు ఈ ఏడాదిలో పూర్తి :
కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, డిండి, శ్రీరాం సాగర్ పునరుజ్జీవన పథకం లాంటి ఎత్తిపోతల పథకాలన్నీ ఈ దఫాలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టు పని ఎంత వరకు వచ్చింది, ఇంకా ఎంత మిగిలి ఉంది, దానికి ఎంత ఖర్చవుతుంది, ఎక్కడైనా లోపాలున్నాయా తదితర అంశాలపై నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. రానున్న బడ్జెట్లో కూడా నీటిపారుదల శాఖకు సముచిత రీతిలో నిధులను కేటాయించడంతో పాటు, ఇతరత్రా మార్గాల ద్వారా కూడా నిధులను సమీకరించుకోనున్నట్లు స్పష్టం చేశారు. వివిధ రకాల పింఛన్లతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాల్సి ఉన్నందున, బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛనుదార్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసేందుకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో మాట్లాడి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు.

CM KCR Review on Irrigation and Health Department