Home తాజా వార్తలు గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి

గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి

kcr
హైదరాబాద్: ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్షంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్‌లో మిషన్ బగీరథ పనులపై సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తిచేయాలని, రేయింబవళ్లు కష్టపడుతూ శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు గ్రామాల్లో అంతర్గత పనులను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత సమయంలోపు పనులను పూర్తిచేయని వర్క్ ఎజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఒహెచ్‌ఎస్‌ఆర్ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, ఆ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. అవసరమైతే టీములను పెంచి 3 షిఫ్టులు పనిచేయాలనిన్నారు. పైపులైన్లు, నల్లాలు, ఇతర సామాగ్రిని నిర్మాణ ప్రాంతాలకు తరలించాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీవడోద్దని, పకడ్బందీగా అధికారులు పనులను పూర్తి చేయించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో మినిమమ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ నిర్వహించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.